పిల్లలకు ఫుడ్ ఈజీగా అరగాలంటే ఈ 5 చిట్కాలు ఫాలో అయితే చాలు!
పిల్లలు తిన్నారంటే చాలు.. పేరెంట్స్ కి అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. కానీ చాలాసార్లు పిల్లలు బాగా తిన్నా ఫుడ్ సరిగ్గా అరగకపోవడం వల్ల బరువు తగ్గడం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తుంటాయి. కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

పిల్లలకు ఫుడ్ ఈజీగా అరగాలంటే పాటించాల్సిన చిట్కాలు
చిన్నారుల ఆరోగ్యం, పెరుగుదల, ఉత్సాహం అన్నీ వారి ఆహారంపైనే ఆధారపడి ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలకు ఎంత మంచి ఆహారం ఇచ్చినా.. అది సరిగ్గా జీర్ణం కాకపోతే ప్రయోజనం ఉండదు. తిన్న ఆహారం శరీరానికి శక్తినివ్వాలంటే.. ఫస్ట్ అది జీర్ణం కావాలి. మరి పిల్లలకు ఫుడ్ ఈజీగా అరగాలంటే పేరెంట్స్ ఏం చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
చిన్న మోతాదులో ఎక్కువసార్లు ఇవ్వడం
పిల్లల జీర్ణ వ్యవస్థ పెద్దలతో పోలిస్తే చాలా సున్నితంగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువగా తినిపిస్తే సరిగ్గా అరగదు. కాబట్టి రోజుకు మూడుసార్లు ఎక్కువ మోతాదులో పెట్టడం కన్నా.. ఐదారు సార్లు చిన్న మోతాదుల్లో ఇవ్వడం మంచిది. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం తేలికపాటి స్నాక్, లంచ్, సాయంత్రం స్నాక్, రాత్రి తేలికపాటి భోజనం.. ఈ విధంగా ఇస్తే పిల్లల కడుపు ఎప్పుడూ బరువుగా అనిపించదు. ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది.
ఫైబర్, ప్రోబయాటిక్ ఫుడ్
పిల్లల ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండాలి. కూరగాయలు, పండ్లు, మినపప్పు, గోధుమలు, ఓట్స్, రాగి వంటి పదార్థాలు చేర్చాలి. ఇవి జీర్ణక్రియను సహజంగా మెరుగుపరుస్తాయి. అలాగే పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోశ వంటి ప్రోబయాటిక్ ఆహారాలు జీర్ణ ఎంజైమ్స్‌కి సహాయపడతాయి. ఈ ఆహారాలు పేగుల్లో “గుడ్ బ్యాక్టీరియా”ని పెంచి, ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
తినేటప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూడడం
చాలామంది పిల్లలు తింటూ టీవీ చూస్తారు. మొబైల్‌లో వీడియోలు చూస్తారు లేదా ఆడుకుంటారు. ఇలా తింటే మనసు ఆహారంపై ఉండదు. జీర్ణక్రియ కూడా బలహీనమవుతుంది. పిల్లలు తినేటప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోబెట్టాలి. నెమ్మదిగా నమిలి తినే అలవాటు నేర్పించాలి. సరిగ్గా నమిలి తినడం వల్ల ఫుడ్ సులభంగా జీర్ణమవుతుంది.
సరిపడా నీరు తాగించడం
చాలామంది పిల్లలు నీరు ఎక్కువగా తాగరు. కానీ నీరు తక్కువగా తాగితే మలబద్ధకం సమస్య వస్తుంది. పిల్లలు రోజుకు కనీసం 1–1.5 లీటర్ల నీరు తాగేలా చూడాలి. గోరువెచ్చని నీరు తాగించడం ఇంకా మంచిది. భోజనం తర్వాత కొద్ది కొద్దిగా నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఆటపాటలు
జీర్ణక్రియలో ఫిజికల్ ఆక్టివిటీ కూడా కీలకం. రోజంతా మొబైల్, టీవీ ముందు కూర్చునే పిల్లల జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. కాబట్టి పిల్లలు రోజుకు కనీసం 30–45 నిమిషాలు బయట ఆడుకోవాలి. రన్నింగ్, సైకిల్ రైడ్, జంప్ గేమ్స్, డ్యాన్స్ వంటివి జీర్ణ ఎంజైమ్స్ యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. ఆటపాటలు శరీరానికి ఆక్సిజన్ సరఫరాను పెంచి, ఆహారం సరిగ్గా అరగడానికి సహాయపడతాయి.