- Home
- Life
- Pregnancy & Parenting
- Girl Child: ఇంట్లో ఆడపిల్ల ఉందా? వంట-వార్పు కాదు,కచ్చితంగా నేర్పించాల్సిన 5 విషయాలు ఇవి..!
Girl Child: ఇంట్లో ఆడపిల్ల ఉందా? వంట-వార్పు కాదు,కచ్చితంగా నేర్పించాల్సిన 5 విషయాలు ఇవి..!
Girl Child: ఇంట్లో ఆడపిల్ల ఉంటే.. పేరెంట్స్ కచ్చితంగా కొన్ని విషయాలు నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు. ఏది నేర్పినా, నేర్పించకపోయినా.. ఇవి నేర్పిస్తే.. వారి జీవితం సవ్యంగా సాగుతుంది.

Girl Child
ఆడ పిల్ల అనగానే ఇంటి పనీ, వంట పనీ నేర్చుకొని ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇవి నేర్పించకపోతే.. పెళ్లయ్యాక అత్తారింట్లో ఇబ్బందులు పడతారని చెబుతూ ఉంటారు. కానీ.. వంటా- వార్పు నేర్పించినా.. నేర్పించకపోయినా కచ్చితంగా ఐదు విషయాలు నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ ఐదు విషయాలు ఏంటో చూద్దాం...
ఆత్మవిశ్వాసం, నో చెప్పడం..
ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసంతో ఉండటం నేర్పించాలి. చాలా ఇళ్లల్లో ఆడపిల్లల అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇవ్వరు. కానీ, మీరు అలాంటి పొరపాటు చేయకూడదు. తన అభిప్రాయానికి కూడా విలువ ఉంటుందని ఆమెకు అర్థం అయ్యేలా పెంచండి. ఎవరైనా తనకు నచ్చని పని చేయమని అడిగితే.. కచ్చితంగా నో చెప్పడం నేర్పించాలి.
‘ నువ్వు ఇతరులను మెప్పించడానికి పుట్టలేదు, నీ సొంత గుర్తింపు కోసం బతకాలి’ అనే మాట మీరు రోజూ మీ అమ్మాయికి చెప్పాలి.
2.గుడ్ టచ్- బ్యాడ్ టచ్..
చిన్న వయసు నుండే తన శరీరానికి సంబంధించిన హక్కు తనకు మాత్రమే ఉంటుందనే విషయం మీ పిల్లలకు నేర్పించాలి. ముఖ్యంగా గుడ్ టచ్ కీ, బ్యాడ్ టచ్ కీ ఉన్న తేదీని నేర్పించాలి. ఎవరైనా తాకినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తే.. వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి అనే విషయాన్ని నేర్పాలి. తన శరీరం గురించి ఆమెకు అవగాహన ఉంటే, ఎవరైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు తొందరగా గుర్తించగలుగుతుంది.
3.ఆర్థిక స్వతంత్రత..
‘ పెళ్లి చేసుకుంటే నీ బాధ్యత భర్త చూసుకుంటాడు’ అని కాకుండా, ‘ నీకంటూ ఒక ఆర్థిక పునాది’ ఉండాలి అనే విషయం పిల్లలకు నేర్పించాలి. అంతేకాదు, చిన్నప్పటి నుండే డబ్బును ఎలా పొదుపు చేయాలి, ఎలా ఖర్చు చేయాలి అనే అవగాహన కల్పించాలి. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం వల్ల ఆమె ఏ పరిస్థితిలోనూ ఇతరులపై ఆధారపడకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలదు.
ఓటమిని తట్టుకోవడం...
జీవితంలో ఎప్పుడూ గెలుపే ఉండదు. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా, మళ్ళీ ఎలా నిలబడాలో నేర్పండి.
"నువ్వు ఓడిపోయినా మేము నీ వెంటే ఉంటాం" అనే నమ్మకాన్ని ఇవ్వండి.తన తప్పుల నుండి నేర్చుకోవడం, మానసికంగా దృఢంగా ఉండటం ఆమెకు గొప్ప ఆయుధం అవుతుంది.
5. ఆత్మగౌరవం, వ్యక్తిత్వం
అందం కంటే గుణం, రంగు కంటే వ్యక్తిత్వం ముఖ్యమని నేర్పండి.ఇతరులు ఏమనుకుంటారో అని తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పండి. ఒకరిని గౌరవించడం ఎంత ముఖ్యమో, తనను తాను గౌరవించుకోవడం (Self-Respect) కూడా అంతే ముఖ్యమని అర్థం కావాలి.
తండ్రి/తల్లిగా మీరు చేయాల్సిన పని:
మీ కూతురు మీతో ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు, ఆమె చెప్పేది జడ్జ్ చేయకుండా.. చెప్పేది వినాలి. అప్పుడే ఆమెకు మీపై నమ్మకం పెరుగుతుంది.

