Union Budget : రైతుల ఖాతాలో నేరుగా రూ.8000..?
Union Budget 2026: ఈసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో డబ్బులు పెరుగుతాయా..? బడ్జెట్ లో ఈ ప్రకటన ఉంటుందా..? ఇవే ప్రశ్నలు కోట్లాది మంది రైతుల మదిలో మెదులుతోంది.

పీఎం కిసాన్ డబ్బులు పెంచుతారా..?
PM Kisan : కేంద్ర బడ్జెట్ 2026 లో రైతులకు గుడ్ న్యూస్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇలా వ్యవసాయ పెట్టుబడికోసం రైతులకు ఇస్తున్న ఆర్థికసాయాన్ని మరింత పెంచే అవకాశాలున్నాయనే ప్రచారం జోరందుకుంది.
ప్రస్తుతం అర్హులైన రైతులకు ఏటా రూ.6000 (మూడు సమాన వాయిదాల్లో) నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి 21 విడతల డబ్బులు వచ్చాయి. 22వ విడత నుండి ఆర్థిక సాయం పెరిగే అవకాశాలున్నాయని… బడ్జెట్ లో ఇందుకు సంబంధించి ప్రకటన ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ లో పీఎం కిసాన్ పథకం కింద ఆర్థిక సాయం పెంపు ఉంటుందో లేదో చూడాలి.
పీఎం కిసాన్ 22వ విడత ఎప్పుడు వస్తుంది?
ప్రభుత్వం నుంచి అధికారిక తేదీ ఇంకా వెలువడలేదు… కానీ గత సరళిని చూస్తే ఓ అంచనాకు రావచ్చు. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వాయిదాలు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. దీని ఆధారంగా 22వ విడత ఫిబ్రవరి 2026 లో రావచ్చని రైతులు భావిస్తున్నారు. అయితే బడ్జెట్ లో ఈ పిఎం కిసాన్ పెంపు ప్రకటన ఉంటే మాత్రం కాస్త ఆలస్యం కావచ్చు… లేదంటే యధావిధిగా టైమ్ కి డబ్బులు పడిపోతాయి.
పీఎం కిసాన్ పెంపుపై ప్రభుత్వం ఏమంటోంది..?
పీఎం కిసాన్ ఆర్థికసాయం పెంపుపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో మాత్రమే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు… కనీసం ఆ దిశగా సంకేతాలు కూడా కనిపించడంలేదు. దీంతో కేవలం రైతుల డిమాండ్ ఆధారంగానే పిఎం కిసాన్ సాయం పెంచుతారనే ప్రచారం జరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని బడ్జెట్‌లో పీఎం కిసాన్ ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకుంటారో లేదో ఫిబ్రవరి 1, 2026న స్పష్టత వస్తుంది.
పీఎం కిసాన్ 22వ విడత ఎందుకు ఆగిపోవచ్చు?
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థికసాయం అందించాలంటే తప్పనిసరిగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది ప్రభుత్వం. కాబట్టి రైతులు వాటిని పూర్తిచేస్తేనే డబ్బులు పడతాయి. అవేంటంటే…
- ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి.
- బ్యాంకు ఖాతా, ఆధార్ సరిగ్గా లింక్ అయి ఉండాలి.
- భూమికి సంబంధించిన రికార్డులు అప్‌డేట్ చేసి ఉండాలి.
- కొత్త ఫార్మర్ ఐడీ (డిజిటల్ గుర్తింపు) సిద్ధంగా ఉండాలి.
పీఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ఎలా..?
పీఎం కిసాన్ తదుపరి విడత డబ్బులు సమయానికి రావాలంటే, లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. దీని కోసం స్టేటస్ తప్పకుండా చెక్ చేసుకోండి. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.

