Holiday: రెండో శనివారం హాలీడే ఇవ్వడానికి అసలు కారణం ఏంటో తెలుసా.?
శని,ఆదివారాలు సెలవు దినాలు అనేది ఐటీ రంగం వచ్చాక సర్వసాధారణంగా మారిపోయింది. అయితే స్వాతంత్రానికి ముందు నుంచే రెండో శనివారం సెలవుగా అమలవుతోంది. అయితే ఈ సంప్రదాయం ఎలా వచ్చింది.? దీని వెనకాల ఉన్న అసలు చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రెండో శనివారం సెలవు ఎలా ప్రారంభమైందంటే..
రెండో శనివారం సెలవు దినంగా ప్రకటించడం వెనకాల ఒక భావేద్వగంతో కూడిన కారణం ఉందని మీలో ఎంత మందికి తెలుసు.? అవును మనం సరదాగా ఎంజాయ్ చేసే ఈ హాలీడే వెనకాల ఒక బలమైన కారణం ఉంది.
19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన కాలంలో, ఓ అధికారికి సహాయకుడిగా పని చేస్తున్న వ్యక్తి ప్రతి రోజు అంకితభావంతో పనిచేసేవాడు. అతని సేవలు చూసి బ్రిటిష్ అధికారి ఎంతో మెచ్చుకునేవాడు. అయితే సహాయకుడికి నెలరోజుల్లో ఒక్కసారి మాత్రమే తల్లిదండ్రులను కలిసే అవకాశం ఉండేది.
అధికారి కీలక నిర్ణయం
కాలక్రమంలో అతనిపై బాధ్యతలు పెరగడం వల్ల సెలవుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో కుటుంబాన్ని కలవడం కష్టమైపోయింది. అది గమనించిన అతని తల్లిదండ్రులు ఒకరోజు అతని అధికారిని కలిసి మాట్లాడారు. “మా కొడుక్కి కనీసం నెలకోసారి సమయం ఇవ్వండి, మా వెంట పంపండి” అని కోరారు. ఈ అభ్యర్థన ఆ అధికారి మనసును తాకింది. తన సహాయకుడి సేవలను గుర్తించి, వ్యక్తిగత జీవితానికి విలువ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నాడు.
రెండో శనివారమే ఎందుకు సెలవు.?
ఆ పేరెంట్స్ కోరికకు ఫిదా అయిన ఆ బ్రిటిష్ అధికారి నెలలో రెండో శనివారాన్ని సెలవుదినంగా ప్రకటించాలని నిర్ణయించారు. అది వారానికి మధ్యలో కాకుండా ఆదివారం సెలవుకు సమీపంగా ఉండడంతో, వరుసగా రెండు రోజులు విశ్రాంతి దొరుకుతుందని భావించారు. ఇలా రెండో శనివారం సెలవు దినంగా మారింది.
తర్వాత అందరికీ అమలు చేశారు
మొదట్లో ఈ సెలవును కేవలం బ్రిటిష్ అధికారి సహాయకుడికి అమలు చేసినా ఆ తర్వాత ఈ సెలవును అందరికీ వర్తింపజేశారు. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని ప్రభుత్వ విభాగాల్లో రెండో శనివారం సెలవు దినంగా ప్రకటించింది. ముఖ్యంగా బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు ఈ విధానాన్ని అమలు చేశాయి. కాగా స్వతంత్ర భారత్‌లో కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కొన్ని విభాగాల్లో రెండో శనివారాన్ని అధికారిక సెలవుగా కొనసాగిస్తున్నారు.
మరి ఆదివారం సెలవు ఎలా వచ్చిందో తెలుసా.?
ఆదివారం సెలవు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది కూడా బ్రిటీషర్ల నుంచే వచ్చింది. దీని వెనకాల మతపరమైన కారణం ఉంది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం దేవుడు ప్రపంచాన్ని ఆరు రోజుల్లో సృష్టించి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజే ఆదివారమే. అందుకే బ్రిటిష్ పాలకులు ఆదివారం సెలవుగా ప్రకటించారు. 1843లో భారతదేశంలో ఈ విధానం అమలులోకి వచ్చింది.