Fact: ఆవులు మాంసాహారం తింటే ఎక్కువ పాలు ఇస్తాయా.? అమెరికాలో ఎందుకలా చేస్తారు.?
అమెరికా, భారత్‌ల మధ్య వాణిణ్య ఒప్పందానికి పాల దిగుమతికి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో నాన్ వెజ్ మిల్క్ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో ఆవులకు మేతగా మాంసాహారం వేస్తారనే విషయం సరికొత్త చర్చకు తెర తీసింది.

అమెరికాలో భిన్న పరిస్థితి
సాధారణంగా ఆవులకు మేతగా గడ్డి వేస్తారనే విషయం తెలిసిందే. భారత దేశంలో ఎక్కడైనా ఇదే దృశ్యం కనిపిస్తుంది. కానీ అమెరికాలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆవులకు సాధారణంగా మాంసాహార పదార్థాలు అందిస్తారు. ఇది పాలు ఉత్పత్తి పెంచే ప్రయత్నాల్లో భాగమేనని అక్కడి పరిశ్రమలు చెబుతుంటాయి.
మాంసం, రక్త భాగాలతో తయారయ్యే ప్రత్యేక మేత
అమెరికాలోని పశుగ్రాస పరిశ్రమలో, వధించబడిన జంతువుల (చేపలు, పందులు, గుర్రాలు, కుక్కలు, పిల్లులు మొదలైనవి) మాంసం, ఎముకలు, ఈకలు, రెట్టలు వంటి భాగాలను ఎండబెట్టి, పొడి రూపంలో పశుగ్రాసంగా తయారు చేస్తారు. దీనిని "రక్త మాంసం" లేదా "బ్లడ్ మీల్", "ఫెదర్ మీల్" వంటి పేర్లతో పిలుస్తారు. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉండటంతో, ఆవులకు ఇవి తినిపించడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని అక్కడి పరిశ్రమలు అంటున్నాయి.
లైసిన్ వంటి అమైనో ఆమ్లాలు
ఈ మాంసాహార పదార్థాల్లో ముఖ్యంగా లైసిన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది పశువుల ఆరోగ్యానికి అవసరమైన 10 కీలక అమైనో ఆమ్లాలలో ఒకటి. ఈ పోషకాల వల్ల ఆవులు బరువు పెరగడం, శరీర సామర్థ్యం మెరుగవుతుందని చెబుతారు. దీంతోపాటు పాలు ఉత్పత్తి కూడా పెరుగుతుందన్న నమ్మకం ఉంది.
ఎరువుగా కూడా..
ఈ మాంసాహార పశుగ్రాసం కేవలం పాడిపశువులకు ఆహారంగా మాత్రమే కాకుండా వ్యవసాయంలో నత్రజని ఎరువుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఒక ఎకరానికి 100 కిలోల బ్లడ్ మీల్ ఉపయోగిస్తే అధిక దిగుబడి వస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఇది వ్యవసాయానికి సహాయపడుతుంది కానీ అదే పదార్థాన్ని ఆవులకు తినిపించడంపై మాత్రం వివాదం కొనసాగుతోంది.
భారత్ ఎందుకు తిరస్కరిస్తోంది.?
భారతదేశంలో పాలను కేవలం ఆహారంగానే కాకుండా మతపరంగా కూడా పవిత్రంగా భావిస్తారు. గోవులను గౌరవించడమేకాకుండా, వాటిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ నేపథ్యంలో మాంసాహార పదార్థాలతో పశుగ్రాసాన్ని తయారుచేసే పద్ధతిని ఇక్కడ ప్రజలు తిరస్కరిస్తున్నారు. అందుకే అమెరికా నుంచి పాల దిగుమతి అంశాన్ని భారత ప్రభుత్వం సైతం వ్యతిరేకిస్తోంది.