- Home
 - National
 - సుఖోయ్ యుద్దవిమానాలు కూడా చైనాసరుకు వంటివేనా..? ఇండియా పరిస్థితేంటి... అందుకే వెనక్కితగ్గిందా?
 
సుఖోయ్ యుద్దవిమానాలు కూడా చైనాసరుకు వంటివేనా..? ఇండియా పరిస్థితేంటి... అందుకే వెనక్కితగ్గిందా?
సుఖోయ్ యుద్దవిమానాలను రష్యా నుండి భారత్ కొనుగోలుచేసింది. అయితే ఇప్పుడు వాటి సామర్థ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. మరి నిజంగానే ఇవి అత్యాధునిక యుద్దాలకు పనికిరావా?

సుఖోయ్ యుద్దవిమానాలపై అనుమానాలు
Sukhoi Fighter Jet : సుఖోయ్ యుద్దవిమానాలు... భారతీయులకు బాగా పరిచయం ఉన్న పేరిది. రష్యా టెక్నాలజీతో రూపొందించిన ఈ యుద్ద విమానాలు భారత సైన్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి... అందువల్లే ఈ ఫైటర్ జెట్స్ పేరు దేశప్రజలకు తరచూ వినిపిస్తుంటుంది. అయితే ఇటీవల రష్యాతో ఈ యుద్దవిమానాల కోసం ఒప్పందం చేసుకున్న ఈజిప్ట్ వెనక్కి తగ్గింది. దీంతో ఈ రష్యన్ టెక్నాలజీ Su-35 ఫైటర్ జెట్స్ పై అనేక అనుమానాలు మొదలయ్యాయి.
Su-35 ఫైటర్స్ కొనుగోలు కోసం 2018లోనే రష్యాతో 2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది ఈజిప్ట్... అయితే రెండు సంవత్సరాలకే ఈ ఒప్పందాన్ని విరమించుకుంది. ఇప్పుడు ఆ దేశ వైమానిక దళానికి చెందిన ఓ సీనియర్ అధికారి ఈ నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు.. దీంతో సుఖోయ్ యుద్దవిమానాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది... ముఖ్యంగా భారత్ వద్ద ఉన్న సుఖోయ్ యుద్దవిమానాల సామర్థ్యంపై అనుమానాలు మొదలయ్యాయి.
Su-35 ఫైటర్ జెట్స్ ను ఈజిప్ట్ ఎందుకు వద్దనుకుంటోందంటే..
ప్రపంచంలో పవర్ ఫుల్ దేశాలేవంటే వెంటనే అమెరికా, రష్యా పేర్లు వినిపిస్తాయి. అర్థ బలంలోనే కాదు అంగబలంలో కూడా ఈ రెండు దేశాలే టాప్. ఇలా సైనిక పరంగా బలమైన రష్యా వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి... అందులో ఒకటే ఈ సుఖోయ్ యుద్ద విమానం. ఈ విమానాలను సొంతంగా దేశ రక్షణకోసం ఉపయోగించుకోవడమే కాదు ఇతర దేశాలకు అమ్మి వ్యాపారం కూడా చేస్తుంది రష్యా. ఇలా రష్యా నుండి భారత్ ఈ Su-35 యుద్దవిమానాలను కొనుగోలు చేసి వాడుతోంది.
అయితే తాజాగా ఈజిప్ట్ ఈ సుఖోయ్ విమానాల ఢీల్ విషయంలో వెనక్కి తగ్గింది. నాలుగైదేళ్ల క్రితమే Su-35 యుద్దవిమానాల కొనుగోలు ఒప్పందాన్ని సైలెంట్ గా రద్దు చేసుకున్న ఈజిప్ట్ ఇప్పుడు అలా ఎందుకు చేయాల్సివచ్చిందో బైటపెట్టింది. ఈజిప్ట్ వైమానిక దళానికి చెందిన ఓ సీనియర్ అధికారి సుఖోయ్ యుద్దవిమానాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
రష్యా సుఖోయ్ విమానాల సాంకేతికతను పరీక్షించినప్పుడు పలు లోపాలు కనిపించాయని సదరు ఈజిప్ట్ అధికారి తెలిపారు. Su-35లోని ముఖ్యమైన రాడార్ వ్యవస్థ Irbis-E అనేది పాతకాలపు PESA టెక్నాలజీపై ఆధారపడింది. ప్రస్తుత ఆధునిక యుద్ధ విమానాల్లో AESA రాడార్లు ఉపయోగిస్తున్నారు... ఎందుకంటే ఇవి జామింగ్‌కు తక్కువగా గురవుతాయి. అమెరికా F-35, ఫ్రాన్స్ Rafale వంటి ఫైటర్లలో ఇదే టెక్నాలజీ ఉంది.
ఇంతకుమించిన సమస్యలు Su-35 ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలోనూ ఉన్నాయని ఈజిప్ట్ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం భద్రతాపరమైన ముప్పును తట్టుకునే సామర్థ్యం ఈ సుఖోయ్ యుద్దవిమానాలకు లేదని గుర్తించామన్నారు. అంతేగాక ఇందులో ఉపయోగించిన AL-41F1S ఇంజిన్లు అధిక శబ్దాన్ని, వేడిని ఉత్పత్తి చేస్తాయి… దీని వలన శత్రు రాడార్లు, సెన్సార్లకు ఈ విమానం చాలా సులభంగా చిక్కుతుందని ఈజిప్ట్ వైమానికదళ అధికారి తెలిపారు.
Su-35 ఫైటర్ జెట్స్ ను ఈజిప్ట్ తిరస్కరించడాని మరో రీజన్...
Su-35 విమానాలు AWACS (ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్) మద్దతుతో బాగా పనిచేస్తాయి. కానీ ఈజిప్ట్ వైమానిక దళం స్వతంత్రంగా, వేగంగా చర్యలు తీసుకునే విధానాన్ని అనుసరిస్తోంది. దీంతో Su-35 తమకు సరిపోయే విమానం కాదని నిర్ణయించుకున్నట్లు ఈజిప్ట్ వైమానికదళ అధికారి వెల్లడించారు.
ఫ్రాన్స్ నుంచి ఈజిప్ట్ ఇప్పటికే రఫెల్ యుద్ద విమానాలను కొనుగోలు చేసింది. ఇవి అత్యాధునిక AESA రాడార్, SPECTRA ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలతో స్వతంత్రంగా వ్యవహరించగలవు. వీటికి బయటినుండి ఎలాంటి సాయం అందించాల్సిన అవసరం లేదు. అందుకే సుఖోయ్ కంటే Rafale యుద్ద విమానాలను ఈజిప్ట్ మెరుగైన ఎంపికగా భావించివుంటుంది.
ఈజిప్ట్ పై అమెరికా ఒత్తిడి...
రష్యా ఫైటర్ జెట్స్ ఢీల్ ను ఈజిప్ట్ రద్దు చేసుకోడానికి అమెరికా బెదిరింపులు కూడా ఓ కారణం. రష్యా వద్ద ఆయుధాలు కొనుగోలుచేస్తే CAATSA చట్టం కింద ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించడంతో ఈజిప్ట్ వెనక్కి తగ్గింది.
అమెరికా ప్రతి సంవత్సరం ఈజిప్ట్ కు రక్షణ సాయంగా 1 బిలియన్ డాలర్లను అందిస్తుంది… దీనిపై కూడా ప్రభావం పడే అవకాశాలుండటంతో రష్యా నుండి సుఖోయ్ యుద్దవిమానాల కొనుగోలు విషయంలో ఈజిప్ట్ వెనక్కి తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.
భారత్ కూడా సుఖోయ్ పై అందుకే వెనక్కి తగ్గుతోందా?
ఈజిప్ట్ సుఖోయ్ ఢీల్ పై వెనక్కి తగ్గడం అనేక అనుమానాలకు తావిస్తోంది. భారత్ ఇప్పటికే రష్యా టెక్నాలజీ కలిగిన Su-35 యుద్దవిమానాలను వాడుతోంది... అయితే ఇటీవల రష్యా ఫిప్త్ జనరేషన్ అత్యాధునిక Su-57 ఇస్తామని ఆఫర్ చేస్తోంది. కానీ భారత ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడంలేదు.
అయితే ఇప్పుడు ఈజిప్ట్ అధికారి వ్యాఖ్యలతో ఈ సుఖోయ్ యుద్దవిమానాలు అత్యాధునిక టెక్నాలజీ కలిగివున్నాయన్న రష్యా వాదనలో నిజమెంత? ఈజిప్ట్ చెబుతున్నట్లు ఇవి నిజంగానే ఆధునిక యుద్దాలకు పనికిరావా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

