Alcohol in Train: రైలులో మద్యం సేవిస్తూ దొరికిపోయారో ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసా?
Alcohol in Train: రైలులో ఆల్కహాల్ తాగడం వల్ల ఎలాంటి శిక్షలు పడతాయో ఎంతో మందికి తెలియదు. రైలులో మద్యం సేవించడం చట్టరీత్యా నేరం. దానికి చట్టాలు ఎలాంటి శిక్షలు విధిస్తాయో తెలుసుకోండి.

రైలులో మద్యం సేవించకూడదా?
భారత రైల్వేలలో ప్రతి రోజు కోట్లాదిమందికి ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ప్రజలకు సురక్షితంగా, సంతోషంగా ఉండటానికి కొన్ని నియమాలు, చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి రైలులో లేదా రైల్వే స్టేషన్‌లో మద్యం సేవించడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటివి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు.
ఏ సెక్షన్ ప్రకారం
రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 145 ప్రకారం ఎవరైనా మద్యం సేవించి రైలులో లేదా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అసభ్యంగా ప్రవర్తించినట్టు తేలితే లేదా మద్యం తాగితే వారు చట్టపరంగా శిక్షార్హులు అవుతారు. ఈ చట్టం కింద మద్యం సేవించడం మాత్రమే కాదు, దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినా కూడా నేరంగా పరిగణిస్తారు.
ఎలాంటి శిక్షలు?
ఈ చట్టం ప్రకారం మొదటిసారి తప్పు చేసిన వ్యక్తికి రూ.100 జరిమానా విధిస్తారు. కానీ అదే తప్పును మళ్లీ చేస్తే లేదా అసభ్య ప్రవర్తనతో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే ఒక నెల వరకు జైలు శిక్ష లేదా రూ.250 జరిమానా పడుతుంది. కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలూ విధించవచ్చు. మద్యం సేవించి హింసాత్మకంగా ప్రవర్తించినా, సిబ్బందిపై దాడి చేసినా, గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
ఈ పనులు కూడా చేయకూడదు
రైలులో ప్రయాణించే ప్రజలు అన్ని వర్గాలకు చెందినవారు. కుటుంబాలు, పిల్లలు, వృద్ధులు కూడా ఉంటారు. మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులు ఇతరుల భద్రతకు, సౌకర్యానికి ఇబ్బంది కలిగిస్తారు. అందుకే రైల్వే శాఖ కఠినమైన చట్టాలను అమలు చేస్తోంది. ఇటీవల పలు రైళ్లలో మద్యపానం చేసి గొడవలు చేసిన ఘటనలు నమోదవడంతో అధికారులు మరింతగా కఠినంగా ఉంటున్నారు. రైల్వే పోలీసులు, స్టేషన్ మాస్టర్లు కలసి ఎవరూ మద్యం తాగకుండా, గొడవలు పడకుండా కాపలా కాస్తూ ఉంటారు.
గుర్తుంచుకోవలసిన విషయాలు
రైల్వే ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రైలులో లేదా ప్లాట్‌ఫారంపై మద్యం సేవించడం నిషేధం. మద్యం తాగి రైలులో ఎక్కితే కూడా శిక్ష పడవచ్చు. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తన, గొడవలు, శబ్దం చేయడం వంటి చర్యలు కూడా నేరం. రైల్వే పోలీసులు ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిని వెంటనే అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది.