Viral News: ఎంతకు తెగించారు.. ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌లో రిఫండ్ కోసం ఏం చేస్తున్నారో చూడండి
Viral News: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌లో వచ్చిన ఆహారం బాగాలేకపోతే రిఫండ్ కోరవచ్చనే విషయం తెలిసిందే. అయితే ఈ సేవలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా దీపేంద్ర గోయల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

దీపేంద్ర గోయల్ వ్యాఖ్యలతో వెలుగులోకి
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వినియోగం భారీగా పెరిగిన తర్వాత రిఫండ్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. జొమాటో, బ్లింకిట్ సీఈఓ దీపేంద్ర గోయల్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ వ్యవహారానికి అద్దం పడుతున్నాయి. ఫ్రీగా డబ్బులు తిరిగి పొందాలనే ఆశతో కొందరు కస్టమర్లు హద్దులు దాటుతున్నారని ఆయన వెల్లడించారు.
AI టెక్నాలజీతో నకిలీ ఫిర్యాదులు
ఇప్పుడు రిఫండ్ మోసాలు సాధారణంగా కాకుండా టెక్నాలజీ ఆధారంగా జరుగుతున్నాయి. కొందరు కస్టమర్లు AI టూల్స్ ఉపయోగించి ఆహారంలో పురుగులు, జుట్టు, గోర్లు ఉన్నట్టు చూపించే ఫోటోలు సృష్టిస్తున్నారు. ఈ ఫోటోలు నిజమైనవిగా కనిపించడం వల్ల మొదటి చూపులో తేడా గుర్తించడం కష్టంగా మారుతోంది. ఆ ఫోటోలను ఆధారంగా చూపిస్తూ రిఫండ్ కోరుతున్నారు.
‘కేక్ పాడైంది’ అంటూ పెరుగుతున్న ఫేక్ క్లెయిమ్స్
ఇటీవలి కాలంలో కేక్ డ్యామేజ్ అయ్యిందనే ఫిర్యాదులు 5 శాతం వరకు పెరిగాయని గోయల్ తెలిపారు. అంతర్గతంగా పరిశీలించినప్పుడు డెలివరీలో ఎలాంటి తప్పు లేదని తేలింది. చాలా సందర్భాల్లో కస్టమర్లే సరిగ్గా వచ్చిన కేక్ ఫోటోను AI ద్వారా పాడైనట్టు మార్చి యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ తర్వాత అసలు కేక్ తినేసి డబ్బులు కూడా తిరిగి పొందుతున్నారు.
డెలివరీ పార్టనర్ల వద్ద కూడా ఫ్రాడ్ కేసులు
మోసాలు కేవలం కస్టమర్ల వరకే పరిమితం కావడం లేదు. కొందరు డెలివరీ పార్టనర్లు కూడా తప్పుదారి పడుతున్నారు. ప్రతి నెలా సగటున 5,000 మంది డెలివరీ పార్టనర్లను ఫ్రాడ్ కారణంగా తొలగిస్తున్నట్టు దీపేంద్ర గోయల్ చెప్పారు. ఆహారం ఇవ్వకుండా యాప్‌లో డెలివర్ అయిందని చూపించడం, క్యాష్ ఆన్ డెలివరీలో చిల్లర లేదని చెప్పి తిరిగి రాకపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
‘కర్మ స్కోర్’తో మోసాలకు చెక్
ఈ సమస్యలకు పరిష్కారంగా జొమాటో ‘కర్మ స్కోర్’ అనే కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. కస్టమర్ గతంలో ఎన్ని సార్లు రిఫండ్ కోరాడు, అనుమానాస్పద ప్రవర్తన ఉందా అనే అంశాలను ఈ స్కోర్ ఆధారంగా పరిశీలిస్తారు. స్కోర్ తక్కువగా ఉంటే ఫిర్యాదులు వెంటనే అంగీకరించరు. ఇదే విధానం డెలివరీ పార్టనర్లకు కూడా వర్తిస్తుంది. నిజాయితీగా ఆర్డర్ చేసే కస్టమర్లు, నిజంగా పనిచేసే రైడర్లకు ఇబ్బంది కలగకూడదన్నదే ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు.

