EPFO: పీఎఫ్ డబ్బుతో LIC ప్రీమియం కట్టొచ్చు.. ఎలాగో తెలుసా.?
EPFO: చాలా మంది ఎల్ఐసీలో పాలసీ తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులతో ప్రీమియం చెల్లించలేకపోతుంటారు. అలాంటి వారి కోసమే ఈపీఎఫ్ఎఫ్ఓ ఒక శుభ వార్త చెప్పింది. PF ఖాతా నుంచే LIC ప్రీమియం చెల్లించే అవకాశం ఇచ్చింది.

PF ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించే వెసులుబాటు
EPFO స్కీమ్‌లోని పారా 68(DD) ప్రకారం, అర్హత ఉన్న సభ్యులు తమ EPF ఖాతాలోని బ్యాలెన్స్ నుంచి LIC ప్రీమియాన్ని చెల్లించవచ్చు. జేబులో డబ్బులు లేకపోయినా పాలసీ ల్యాప్స్ కాకుండా ఉండేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా చట్టబద్ధమైన ప్రక్రియ.
ఈ సదుపాయం ఎవరికి వర్తిస్తుంది?
ఈ వెసులుబాటు అందరికీ కాదు. కొన్ని షరతులు తప్పనిసరి.
* మీరు EPFO యాక్టివ్ మెంబర్ అయి ఉండాలి
* మీ PF ఖాతాలో కనీసం రెండు నెలల జీతానికి సమానమైన మొత్తం ఉండాలి
* ప్రీమియం చెల్లించే LIC పాలసీ మీ పేరుమీదే ఉండాలి
* భార్య, భర్త, పిల్లల పేర్లపై ఉన్న పాలసీలకు ఇది వర్తించదు
* ఈ అవకాశం కేవలం LIC పాలసీలకే ఉంటుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కాదు
ఇంట్లో నుంచే చేసే సులభమైన ప్రక్రియ
ఇప్పుడు PF సంబంధిత పనులన్నీ ఆన్‌లైన్‌లో చేయవచ్చు. ఈ సదుపాయం కోసం ఫారం–14 సమర్పించాలి. EPFO అధికారిక వెబ్‌సైట్‌లో UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. KYC సెక్షన్‌లో LIC పాలసీ ఆప్షన్ ఎంచుకోవాలి. పాలసీ నంబర్, అవసరమైన వివరాలు నమోదు చేయాలి. వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ PF ఖాతా LIC పాలసీకి లింక్ అవుతుంది. ఆ తర్వాత ప్రతి ప్రీమియం తేదీకి ఆటోమేటిక్‌గా PF ఖాతా నుంచి డబ్బు కట్ అవుతుంది.
ఈ విధానం వల్ల లాభాలు
ఈ సదుపాయం వల్ల తాత్కాలిక ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పాలసీ కొనసాగుతుంది. పాలసీ ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉండదు. ఆలస్య రుసుము భయం ఉండదు. అప్పులు చేయాల్సిన అవసరం రాదు. ప్రీమియం తేదీ మర్చిపోతే కూడా సమస్య ఉండదు.
ఉపయోగించే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం
PF డబ్బు అనేది మీ రిటైర్మెంట్ భద్రత. అందులో నుంచి డబ్బు తీస్తే భవిష్యత్‌లో వచ్చే మొత్తం తగ్గుతుంది. చిన్న మొత్తం ఇప్పుడే తీసుకున్నా, దీర్ఘకాలంలో పెద్ద నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సదుపాయాన్ని అలవాటుగా కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

