భారత్‌లోని టాప్ 10 ధనిక దేవాలయాలు ఇవే
Top 10 Richest Temples In India: భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ప్రతిఒక్కటీ దానికంటూ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. అయితే, భారత్ లో టాప్ 10 ధనిక దేవాలయాలు, వీటి వద్ద ఉన్న సంపద ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

అత్యంత ధనిక ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయంగా భారత్
Top 10 richest temples in India: భారతదేశం విశ్వాసానికి ప్రతీకగా నిలిచే వేలాది దేవాలయాలకు నిలయంగా ఉంది. వీటిలో కొన్ని ఆలయాలు కేవలం ఆధ్యాత్మికతకే కాకుండా, అపార సంపదను కూడబెట్టుకున్న ప్రపంచ ప్రసిద్ధ ధనిక కేంద్రాలుగా ఉన్నాయి.
భక్తుల విరాళాలు, భూములు, బంగారం, వజ్రాలు, వెండి వంటి ఆస్తులతో ఈ దేవాలయాలు దేశ ఆర్థిక, సాంస్కృతిక చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. భారత్ లోని టాప్ 10 ధనిక దేవాలయాలు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.
KNOW
1. శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం
కేరళ లోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా గుర్తింపు పొందింది. ఇక్కడ భూగర్భ గదుల్లో ఉన్న బంగారం, వజ్రాలు, ముత్యాలు, ప్రాచీన ఆభరణాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఈ ఆలయ ఆస్తుల అంచనా విలువ లక్షల కోట్లు. ఒక్క మహావిష్ణువు బంగారు విగ్రహం విలువే దాదాపు రూ. 500 కోట్లుగా అంచనా వేశారు.
2. తిరుమల తిరుపతి దేవస్థానం
భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భక్తులను ఆకర్షించే ఆలయాలలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వస్తారు. స్వామి వారికి భారీగా విరాళాలు సమర్పిస్తారు.
తిరుమల ఆలయం వద్ద రూ. 2.5 నుంచి 3 లక్షల కోట్ల ఆస్తులు, 10 టన్నులకుపైగా బంగారు నిల్వలు ఉన్నట్లు అంచనా. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
3. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం
కేరళలో ఉన్న గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం కూడా దేశంలోని ధనిక దేవాలయాల్లో ఒకటి. విష్ణుమూర్తి కోలువైన ఈ ఆలయానికి రూ. 1,737 కోట్ల బ్యాంకు డిపాజిట్లు, 271 ఎకరాల భూములు ఉన్నాయి. బంగారం, వెండి, విలువైన రత్నాలు ఈ ఆలయ సంపదలో ప్రధానమైనవి.
4. వైష్ణోదేవి ఆలయం
జమ్మూకాశ్మీర్ లో 5,200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని సంవత్సరానికి కోటికి పైగా భక్తులు దర్శించుకుంటారు. గత రెండు దశాబ్దాల్లో 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి, రూ.2,000 కోట్ల నగదు విరాళాలు లభించాయి. ప్రస్తుతం వార్షిక విరాళాల విలువ సుమారు రూ. 500 కోట్లకు పైనే.
5. షిరిడీ సాయి బాబా ఆలయం
19వ శతాబ్దపు ఆధ్యాత్మిక గురువైన సాయిబాబా సన్నిధానం కూడా ధనిక దేవాలయాల్లో ఒకటిగా ఉంది. దీని మొత్తం ఆస్తి విలువ రూ. 1,800 కోట్లకు పైగా ఉంది. ఆలయంలో 380 కిలోల బంగారం, 4,428 కిలోల వెండి ఉంది.
6. గోల్డెన్ టెంపుల్
సిక్కు మతానికి అత్యంత పవిత్ర ఆలయం గోల్డెన్ టెంపుల్. ప్రతి సంవత్సరం సుమారు రూ. 500 కోట్లు విరాళాల రూపంలో వస్తాయి. ఆలయం పైభాగంలో సుమారు 400 కిలోల బంగారం వాడారు. రోజూ లక్షల మందికి ఉచిత భోజనం అందించడం ఈ ఆలయం ప్రత్యేకత.
7. సిద్ధివినాయక ఆలయం
ముంబైలో ఉన్న సిద్ధివినాయక ఆలయం మొత్తం ఆస్తి విలువ రూ. 1500 కోట్లలకు పైగా అంచనా. 2024–25 ఆర్థిక సంవత్సరంలోనే భక్తులు రూ. 133 కోట్లు విరాళాలు సమర్పించారు. ఆలయ విగ్రహం 4 కిలోల బంగారంతో అలంకరించారు.
8. జగన్నాథ ఆలయం
ఒడిశాలోని జగన్నాథ ఆలయం ఆస్తుల విలువ దాదాపు రూ.1000 కోట్లు పైగా ఉన్నాయి. ఆలయం వద్ద 30,000 ఎకరాల భూములు ఉన్నాయి. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది.
9. సోమనాథ్ ఆలయం
జ్యోతిర్లింగాలలో మొదటిదైన ఈ ఆలయంలో గర్భగుడిలో 130 కిలోల బంగారం, గోపురంపై మరో 150 కిలోల బంగారం ఉంది. పలు దఫాలుగా దోపిడీకి గురైనప్పటికీ, ప్రస్తుతం ఈ ఆలయం తన వైభవాన్ని తిరిగి పొందింది. రూ. 700 కోట్లకు పైగా సంపదను కలిగి ఉంది.
10. కాశీ విశ్వనాథ ఆలయం
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శివక్షేత్రాలలో అత్యంత పవిత్రమైనది కాశీ విశ్వనాథ ఆలయం. రూ. 800 కోట్లకు పైగా సంపదను కలిగి ఉందని అంచనా. ఈ ఆలయం 2023–24లో రూ. 83.34 కోట్ల ఆదాయం సంపాదించింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 42% వృద్ధి.