ఈరోజు కీలక పరిణామాలు.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే. స్కూళ్లు బంద్
ప్రతీ రోజూ లోకల్ టూ గ్లోబల్ ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీటిలో కొన్ని నేరుగా మన జీవితంపై ప్రభావం చూపుతాయి. ఈరోజు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అలాంటి కొన్ని ముఖ్యమైన వార్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నేడు తెలంగాణ బంద్
సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్లో ఓ యువకుడిపై మార్వాడీ దాడి చేశాడన్న నేపథ్యంలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ స్లోగన్ మరింత ఉధృతమవుతోంది. ఈ ఉద్యమంలో భాగంగా ఈరోజు తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ ( OU JAC ) పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ బంద్‌కు పలు వర్తక సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు మద్దతుగా నిలిచారు. తెలంగాణలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సైతం స్కూళ్లకు సెలవును ప్రకటించాయి.
విదేశీయులపై ట్రంప్ సర్కార్ నజర్
అమెరికాలో నివసిస్తున్న సుమారు 5.5 కోట్ల విదేశీయుల వీసా రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. వీసా నిబంధనలు అతిక్రమించారా లేదా అన్నది గుర్తించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. నేర కార్యకలాపాలు, ఉగ్రవాద సంబంధాలు, ఉగ్రవాద సంస్థలకు మద్దతు, వీసా గడువు ముగిసినా అక్కడే ఉండటం లేదా ప్రజాసురక్షకు ముప్పు కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని, వారిని స్వదేశాలకు పంపించే ప్రక్రియలో భాగంగానే ఈ దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈరోజు నుంచి ఈ ప్రాసెస్ వేగవంతం చేయనున్నారు.
కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బీహార్ లో NH-31లో 8.15 కి.మీ పొడవైన ఆంట – సిమారియా వంతెన ప్రాజెక్టును అలాగే.. కోల్‌కతాలో మెట్రో రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు బీహార్, కోల్‌కతాలో కీలకంగా మారనున్నాయి.. బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో దాదాపు 18 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు.
ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు, రాష్టానికి ఆర్థిక సహాయం అందించాలని సీఎం కోరనున్నారు. మధ్యాహ్నం 3.15కి నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్
ఆసియా కప్ 17వ ఎడిషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నమెంట్ కోసం కొన్ని దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్‌గా శుభమన్ గిల్ ఎంపికయ్యారు. ఇక ఈరోజు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల మధ్య 2వ వన్డే మ్యాచ్ జరగనుంది. భారతకాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు మ్యాచ్ జరగనుంది.