తెలంగాణలో కేసీఆర్ సీన్ తక్కువే : కేంద్రంలో కమల వికాసమే..
టైమ్స్ నౌ సంస్థ దేశవ్యాప్తంగా జరగబోయే లోక్ సభ ఎన్నికల మీద చేసిన సర్వే చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే ఢంకా బజాయిస్తుందని తేల్చింది. తెలంగాణలో కేసీఆర్ కు గడ్డుకాలంగా తెలిపింది.

న్యూఢిల్లీ : ఇది ఎన్నికల కాలం. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. విభిన్న సర్వేలు వెలుగు చూస్తున్నాయి. ‘టైమ్స్ నౌ’ చేసిన సర్వే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ సర్వే ప్రకారం దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే.. అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఏ) జాతీయస్థాయిలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని.. ఇది ఖాయమని తేల్చి చెప్పింది.
ఈ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను ఎన్డీఏకు 296 నుంచి 326 సీట్లు రావచ్చని తేల్చింది. ఇక విపక్ష ఇండియా కూటమికి 160-190 స్థానాలు వస్తాయని ఈ సర్వేలో తేలింది. ప్రధాన, ప్రతిపక్ష కూటముల్లోని రెండు ప్రధాన పార్టీలు సొంతంగానే అధిక సీట్లు కైవసం చేసుకొంటాయని తేల్చింది.
ఎన్డీఏలోని ప్రధాన పక్షమైన బిజెపి.. తన సొంతంగా 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని, విపక్ష ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ అయినా కాంగ్రెస్ 62 -80 స్థానాలు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. అయితే, ఓట్ల శాతం పరంగా ఈ తేడా అంత ఎక్కువగా ఉండదని… ఎన్డీఏకు 42.60శాతం ఓటు రాగా, ఇండియాకు 40.20 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేల్చిందని తెలుపుతోంది.
ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల విషయానికి వస్తే.. ఏపీలోని అధికార వైసిపి ఢంకా బజాయిస్తుందని.. క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ సర్వే తేల్చింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా.. దాదాపు మొత్తం వైసిపి పరం అవుతాయని వెల్లడించ్చింది. వైసీపీకి 24-25 లోక్ సభ స్థానాలు లభిస్తాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో వైసీపీ 49.8% ఓట్లతో 22 లోక్సభ స్థానాలలో గెలిచింది. అయితే ఈ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీ ఓట్ల శాతం కూడా పెరుగుతుందని ఈ సర్వే చెబుతోంది. మొత్తంగా 51.3% ఓట్లతో అన్ని లోక్సభ స్థానాలను వైసిపి తన ఖాతాలో వేసుకుంటుందని తేల్చింది.
ycp plenary
టైమ్స్ నౌ సర్వే ప్రకారం2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వైసిపి ఓట్ల శాతం 1.05 శాతం పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వానికి నానాటికి ప్రజాదరణ పెరుగుతోందని.. దానికి పెరిగిన ఓట్ల శాతమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక తెలంగాణకు వచ్చేసరికి.. బీఆర్ఎస్ విషయంలో రాష్ట్రంలో ప్రజాధరణ తగ్గినట్టుగా ఈ సర్వే తెలిపింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 9-11 లోక్సభ సీట్లు మాత్రమే వస్తాయని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది.
ఎన్డీఏ కు తెలంగాణలో 2-3సీట్లు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 3-4 సీట్లు వస్తాయని, ఇతరులకు ఒక సీటు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా టైమ్స్ నౌ సర్వే అంచనా వేసింది.