- Home
- National
- పెళ్లి కూతురికి 8 గ్రాముల బంగారం, పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..
పెళ్లి కూతురికి 8 గ్రాముల బంగారం, పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..
Tamil Nadu Budget 2026: తమిళనాడులో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో వరాల జల్లు కురిపించారు

పెళ్లికూతురికి 8 గ్రాముల బంగారం.. పట్టు చీర
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం 'అన్నన్ సీర్ తిట్టమ్' పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి పెళ్లికూతురికి 8 గ్రాముల బంగారు నాణెంతో పాటు ఒక పట్టు చీరను ప్రభుత్వం అందించనుంది. మహిళల ఆర్థిక భద్రతను పెంచడం, వివాహ సమయంలో కుటుంబాలపై పడే భారం తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమం అమలు కోసం బడ్జెట్‌లో రూ.812 కోట్లను కేటాయించింది.
ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన ప్రతి శిశువుకు బంగారు ఉంగరం
బడ్జెట్‌లో మరో ఆకర్షణీయమైన నిర్ణయంగా 'థాయ్ మమ్మన్ తంగ మోధిర తిట్టం' పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వనున్నారు. తల్లి, శిశు సంక్షేమాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచడమే ఈ పథకం ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం అమలుకు రూ.560 కోట్ల నిధులను కేటాయించారు.
విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. సైకిళ్లు.. AI శిక్షణ
విద్యారంగానికి కూడా ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. 'వెట్రి ల్యాప్‌టాప్ స్కీమ్' కింద అర్హులైన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించేందుకు రూ.2,000 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైకిళ్లు, హెల్మెట్లు, వాటర్ బాటిళ్లు అందించే ప్రత్యేక పథకాన్ని కూడా కొనసాగించనున్నారు.
అంతేకాకుండా 2031 నాటికి ఐదు లక్షల మంది యువతకు కృత్రిమ మేథ (AI) రంగంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులతో పాటు అధ్యాపకులకు కూడా ఈ శిక్షణ అందించనున్నారు. ఉద్యోగ అవకాశాలను పెంచే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.
విద్య, రైతులు, వృద్ధుల సంక్షేమానికి భారీ నిధులు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రూ.300 కోట్లు కేటాయించగా, ఉన్నత విద్యకు రూ.8,393 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో కొత్తగా ఐదు ఐటీఐలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ రంగానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. రైతుల సంక్షేమం కోసం రూ.14,984 కోట్లు, విద్యుత్ సబ్సిడీ కోసం రూ.7,432 కోట్లు మంజూరు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.38,000 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. వృద్ధుల కోసం తొలి దశలో 12 జిల్లాల్లో ఆధునిక వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భీమా పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
2036 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ మాట్లాడుతూ, 2036 నాటికి తమిళనాడును 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. పారదర్శక పాలన, విద్య, సాంకేతికత, పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమ పథకాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు.
అలాగే తూతుకుడి, తిరునెల్వేలి ప్రాంతాలను స్పేస్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ జోన్‌గా అభివృద్ధి చేయడం, దేశంలోనే తొలి AI & ఇన్నోవేషన్ సిటీని ఏర్పాటు చేయడం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కుటుంబ పెద్ద మహిళకు నెలకు రూ.2,500, ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి వంటి పథకాలపై ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన లేకపోవడం గమనార్హం.

