Shabari prasadam: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటికే శబరిమల ప్రసాదం
Shabari prasadam: అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇండియా పోస్ట్ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. అరవణ పాయసం, అప్పం వంటి ప్రసాదాలను సన్నిధానం నుంచే నేరుగా ఇంటికి తెప్పించుకునే అవకాశం కల్పిస్తోంది.

అయ్యప్ప భక్తులకు ఇండియా పోస్ట్ ప్రత్యేక సేవలు
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రసాదాల పంపిణీలో కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది. అరవణ పాయసం, అప్పం వంటి ప్రసాదాలను ఇకపై సన్నిధానం నుంచే నేరుగా ఇంటికి తెప్పించుకునే అవకాశం కల్పిస్తున్నారు.
నవంబర్ 17 నుంచి ప్రత్యేక బుకింగ్ కేంద్రం
మండల-మకరవిళక్కు యాత్రా సీజన్‌ను పురస్కరించుకుని నవంబర్ 17 నుంచి ఈ సేవ ప్రారంభం కానుంది. శబరిమల సన్నిధానంలోని దేవస్వం బోర్డు ప్రసాద విక్రయ కేంద్రాల సమీపంలో ఇండియా పోస్ట్ ప్రత్యేక పార్శిల్ బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తోంది.
24 గంటల పాటు పార్శిల్ బుకింగ్ సదుపాయం
భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక కౌంటర్ నిరంతరం 24 గంటల పాటు పనిచేయనుంది. స్పీడ్ పోస్ట్ పార్శిల్ సేవల ద్వారా ప్రసాదాలను సురక్షితంగా ప్యాక్ చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తుల చిరునామాలకు పంపిస్తారు.
దేశంలో ఎక్కడికైనా ఇంటికే ప్రసాదం
సన్నిధానంలో ప్రసాదాలు కొనుగోలు చేసిన భక్తులు వాటిని తమ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. బుకింగ్ సమయంలో చిరునామా వివరాలు అందిస్తే చాలు.. ప్రసాదాలు నేరుగా ఇంటికే చేరుతాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లోనూ ఈ ప్రసాదాలను బుక్ చేసి భారత్‌లోని ఏ ప్రాంతానికైనా పంపించుకునే అవకాశం కల్పించారు.
రద్దీ సమయంలో భక్తులకు ఎంతో ఊరట
మండల-మకరవిళక్కు సీజన్లో శబరిమలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రసాదాల రవాణా ఇబ్బందులు తగ్గడంతో పాటు భక్తులకు సమయం, శ్రమ ఆదా కానుంది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, ఇండియా పోస్ట్ సంయుక్తంగా తీసుకొచ్చిన ఈ సదుపాయం సురక్షితమైన ప్యాకేజింగ్, నమ్మకమైన డెలివరీతో భక్తులకు మరింత సౌకర్యాన్ని అందించనుంది.













