- Home
- National
- Richest Village: 17 బ్యాంకులు, రూ. 7 వేల కోట్లు ఎఫ్‌డీలు.. ఆసియాలోనే ధనిక గ్రామం మాధాపర్ విశేషాలు
Richest Village: 17 బ్యాంకులు, రూ. 7 వేల కోట్లు ఎఫ్‌డీలు.. ఆసియాలోనే ధనిక గ్రామం మాధాపర్ విశేషాలు
Richest Village: సహజంగా గ్రామాల్లో నివసించే వారి ఆదాయాలు తక్కువగా ఉంటాయనే భావనలో ఉంటాము. అయితే భారత దేశంలోని ఓ గ్రామం మాత్రం ఆసియాలోనే ధనిక గ్రామంగా పేరు గాంచింది. ఇంతకీ ఏంటా గ్రామం.? దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం – మాధాపర్
భారతదేశంలో గ్రామాలు అంటే వ్యవసాయం, సాధారణ జీవితం అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉన్న మాధాపర్ గ్రామం ఈ ఆలోచనను పూర్తిగా మార్చేస్తోంది. ఈ గ్రామాన్ని ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా పిలుస్తారు. కారణం… ఇక్కడి సంపద.
రూ.7 వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు
భుజ్ పట్టణానికి సమీపంలో ఉన్న మాధాపర్ గ్రామ ప్రజలు బ్యాంకుల్లో పెట్టిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల విలువ రూ.7,000 కోట్లకు పైగా ఉంది. ఒక చిన్న గ్రామానికి ఇది ఊహించలేని మొత్తం. ఇదే మాధాపర్ ప్రత్యేకతను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకొచ్చింది.
ఒక గ్రామంలో 17 బ్యాంకులు
మాధాపర్ గ్రామంలో ఏకంగా 17 బ్యాంక్ శాఖలు ఉన్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, పీఎన్‌బీ, యూనియన్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఒక గ్రామంలో ఇన్ని బ్యాంకులు ఉండటం అరుదైన విషయం. ఇంకా కొత్త బ్యాంకులు కూడా ఇక్కడ బ్రాంచ్‌లు పెట్టాలని ఆసక్తి చూపుతున్నాయి.
సంపద వెనుక అసలు కారణం
ఈ గ్రామ సంపదకు ప్రధాన కారణం ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలు. మాధాపర్‌లో నివసించే వారిలో పెద్ద సంఖ్యలో ప్రజలు విదేశాల్లో స్థిరపడ్డారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌తో పాటు ఆఫ్రికా దేశాల్లో గుజరాతీలు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు. ముఖ్యంగా కన్‌స్ట్రక్షన్ రంగంలో వీరి ఆధిపత్యం ఎక్కువ. విదేశాల్లో సంపాదించిన డబ్బును అక్కడ పెట్టుబడి పెట్టకుండా స్వగ్రామంలోని బ్యాంకుల్లో జమ చేయడానికే వారు ఇష్టపడుతున్నారు.
నగర స్థాయి సౌకర్యాలు
మాధాపర్ గ్రామంలో సుమారు 32 వేల మంది జనాభా ఉంది. దాదాపు 20 వేల ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ బంగ్లాలు, విశాలమైన రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లు, సరస్సులు, ఆలయాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. విదేశాల్లో నివసిస్తున్నా గ్రామంతో అనుబంధాన్ని వదలని ప్రజలు విద్యా, ఆరోగ్య, సామాజిక కార్యక్రమాలకు కూడా భారీగా విరాళాలు ఇస్తున్నారు.

