దీపావళి గిఫ్ట్ ! మీ ఖాతాలోకి రూ. 2000
Diwali Gift 2000 Rupees: కేంద్ర ప్రభుత్వం దీపావళి గిఫ్ట్ అందించడానికి సిద్ధమైంది. మీ ఖాతాలో రూ.2000 జమ చేయనుంది. పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులు విడుదల చేయనుంది.

పీఎం కిసాన్ 21వ విడత: రైతుల ఖాతాల్లోకి రూ.2000
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు శుభవార్త అందించబోతోంది. దీపావళి గిఫ్ట్ అందించనుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan Samman Nidhi Yojana) కింద 21వ విడతగా రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, కొంతమంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే ఈ విడత చేరగా, మిగిలిన వారికి దీపావళి ముందు లేదా తర్వాత నిధులు జమ కానున్నాయి.
మూడు రాష్ట్రాల రైతులకు ముందే చెల్లింపులు
కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రత్యేక నిర్ణయం తీసుకుని మూడు రాష్ట్రాల రైతులకు ముందుగానే 21వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేసింది. సెప్టెంబర్ 26న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రైతులకు రూ.2000 చొప్పున జమ చేసింది. ఇటీవల వరదలు, పంటనష్టం కారణంగా నష్టపోయిన వారికి ఈ ఆర్థిక సాయం అందించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
మిగిలిన రాష్ట్రాల రైతులు కూడా త్వరలోనే తమ బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంకేతాలు ఇచ్చింది. రైతులు తమ పీఎం కిసాన్ అకౌంట్, బ్యాంకు వివరాలను సరిచూసుకోవాలని సూచించింది.
పీఎం కిసాన్ పథక లక్ష్యం, అర్హతలు ఏమిటి?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019లో ప్రారంభమైంది. దీని ప్రధాన ఉద్దేశ్యం రైతులకు ఆర్థిక సాయం అందించడం. రైతులు సంవత్సరానికి మూడు విడతలుగా రూ.6,000 పొందుతారు. ప్రతి విడత రూ.2,000 చొప్పున అందిస్తారు.
పథకం ప్రయోజనం పొందడానికి రైతు కనీసం 18 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. అలాగే వారు స్వంత భూమిని కలిగి ఉండాలి. అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తోంది ప్రభుత్వం.
పీఎం కిసాన్ గత విడతలో 9.71 కోట్ల మంది రైతులకు సాయం
పీఎం కిసాన్ యోజన 20వ విడతను ఆగస్టు 2న ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి విడుదల చేశారు. ఆ విడతలో 9.71 కోట్ల మంది రైతులకు రూ.20,500 కోట్లకుపైగా జమ చేశారు. ఒక్క బీహార్ రాష్ట్రంలోనే 75 లక్షల మంది రైతులు ఈ సాయం పొందారు.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఆగస్టు నుండి నవంబర్ మధ్యలోనే ఈ పథకం కింద నిధులను జమ చేస్తోంది. ఈసారి దీపావళి అక్టోబర్ 20న ఉండటంతో, రైతులకు పండుగ సందర్భంగా “దీపావళి గిఫ్ట్”గా 21వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.
అర్హత లేని రైతులకు సాయం నిలిపివేత
పథకంలో కొంతమంది రైతులు తప్పుగా నమోదు చేసుకున్నారని అధికార విభాగం గుర్తించింది. అర్హత లేని వారు తప్పుడు పత్రాలతో ఈ పథకాన్ని వాడుకుంటే వారి దరఖాస్తులను రద్దు చేస్తోంది. అవసరమైతే ఇప్పటికే పొందిన సాయాన్ని రికవరీ చేయనున్నట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
అలాగే పీఎం కిసాన్ యోజనలో చేరిన ప్రతి రైతు తప్పనిసరిగా ఈ-కేవైసీ, భూ ధృవీకరణ పూర్తి చేయాలి. ఈ రెండు ప్రక్రియలను పూర్తి చేయకుండా ఉన్న రైతులకు 21వ విడత ఆగిపోవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
పీఎం కిసాన్ పై తర్వాత అధికారిక ప్రకటన
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం లేదా వ్యవసాయ శాఖ నుండి 21వ విడత విడుదల తేదీపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే, సంబంధిత వర్గాల ప్రకారం దీపావళి అనంతరం తేదీని ప్రకటించే అవకాశం ఉంది. దీనితో దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు మరోసారి పండుగ సందర్భంగా ఆర్థిక ఊరట లభించనుంది.