PM Dhan Dhanya Krishi Yojana : ఏమిటీ పథకం? తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన జిల్లాలేవి?
PM Dhan Dhanya Krishi Yojana : రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. అన్నదాతలకు ఆర్థిక భరోసా అందించే మరో పథకం ఇవాళ్టి నుండి అమల్లోకి వస్తోంది.

రైతుల కోసం మోదీ సర్కార్ మరో కొత్త పథకం...
PM Dhan Dhanya Krishi Yojana : కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది... స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (అక్టోబర్ 11న) పీఎం ధన్-ధాన్య కృషి యోజన పథకాన్ని రైతుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులతో వర్చువల్ గా ముచ్చటించనున్నారు. ఇప్పటికే పీఎం కిసాన్ వంటి పథకాలతో రైతులకు ఆర్థిక భరోసా అందిస్తున్న కేంద్రం ఈ కొత్త పథకం ద్వారా మరింత సాయం అందించనుంది.
ఏమిటీ పీఎం ధన్-ధాన్య కృషి యోజన పథకం?
భారత్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం... సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా వ్యవసాయమే దేశానికి వెన్నెముక. అందుకే ఓవైపు అభివృద్ధి, సాంకేతికతపై దృష్టి పెడుతూనే మరోవైపు వ్యవసాయ విప్లవాన్ని సృష్టించే నిర్ణయాలు తీసుకుంటోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఇందులో భాగంగానే వివిధ కారణాలతో వ్యవసాయంలో బాగా వెనకబడిన జిల్లాల్లో పరిస్థితులను మెరుగుపర్చేందుకు తీసుకువస్తున్న పథకమే పీఎం ధన్-ధాన్య కృషి యోజన.
వ్యవసాయంలో బాగా వెనకబడిన జిల్లాల్లో ఈ కొత్త పథకం అమలుచేస్తారు... ఇందుకోసం దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపికచేశారు. ఈ జిల్లాల్లో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం పీఎం ధన్-ధాన్య కృషి యోజన పథకం కింద రూ.24,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2025 నుండి 2031 వరకు అంటే ఆరు నెలల్లో వ్యవసాయంలో వెనకడిన ఈ జిల్లాల రూపురేఖలు మార్చాలని.. ప్రస్తుతం వ్యవసాయోత్పుత్తుల్లో టాప్ లో నిలిచే జిల్లాల సరసన వీటిని చేర్చాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ పథకం ద్వారా దాదాపు రెండుకోట్ల మంది రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం కేంద్రం చెబుతోంది.
ఈ పథకం కింద ఏం చేస్తారు?
ఈ పథకానికి ఎంపికైన జిల్లాల్లో ధన్ ధాన్య సమితులను ఏర్పాటుచేసి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తారు. ఇందులో ఆ జిల్లా రైతులందరికీ ప్రాతినిధ్యం కల్పిస్తారు... పంటల దిగుబడి పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి, మత్స్య పరిశ్రమను కూడా ఈ పథకంతో అనుసంధానిస్తారు... దీంతో రైతులకు ఆర్థికంగా మేలు చేయడమే కాదు గ్రామాల్లో జీవనోపాధి పెంచేలా ఈ పథకం ఉపయోగపడుతుంది.
వ్యవసాయం కోసం రైతులకు సులభంగా రుణ సదుపాయం కల్పించే చర్యలు తీసుకోవడం కూడా ఈ ధన్-ధాన్య యోజన పథకంలో భాగమే. అలాగే పంటల నిల్వ, మార్కెటింగ్ సదుపాయాన్ని మెరుగుపరుస్తారు. ప్రస్తుతం వ్యవసాయంలో రసాయనాలు, ఎరువుల వాడకం ఎక్కువైన నేపథ్యంలో సహజ, సేంద్రియ వ్యవసాయానికి డిమాండ్ పెరుగుతోంది... ఇందుకు తగినట్లుగా రైతులను చైతన్యం చేయడం కూడా ఈ పథకం ద్వారా చేపడతారు. ఇలా వ్యవసాయపరంగా వెనకబడిన జిల్లాల్లో రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడం ఈ పీఎం ధన్-ధాన్య కృషి యోజన పథకం ముఖ్యఉద్దేశం.
తెలుగు రాష్ట్రాల నుండి పీఎం ధన్-ధాన్య కృషి యోజన పథకానికి ఎంపికైన జిల్లాలివే...
ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకానికి దేశంలోని 100 జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయనున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది జిల్లాలున్నాయి... అంటే తెలుగు రైతులకు కూడా ఈ పథకం ద్వారా లబ్ది జరగనుంది… ఆయా జిల్లాల్లో వ్యవసాయ పరిస్థితులు మెరుగుపడతాయి.
తెలంగాణలోని నారాయణపేట, జోగులాంబ గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలు ఈ పథకానికి ఎంపికయ్యారు. ఇక ఏపీ నుండి అనంతపురం, శ్రీసత్యసాయి, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య జిల్లాలను ఎంపికచేశారు. రాబోయే ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఖర్చుచేసే రూ.24,000 కోట్లలో ఈ ఎనిమిది జిల్లాలకూ వాటా ఉంటుంది.
దీపావళికి ముందే పీఎం కిసాన్ డబ్బులు?
పీఎం ధన్-ధాన్య యోజన పథకాన్ని ప్రారంభించడమే కాదు త్వరలోనే దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో మరోవిడత పీఎం కిసాన్ డబ్బులు జమ చేసేందుకు మోదీ సర్కార్ సిద్దమయ్యింది. దీపావళికి ముందే రైతులకు పీఎం కిసాన్ డబ్బులు వేయాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే వరద ప్రభావిత రాష్ట్రాల్లో ముందుగానే రైతులకు పెట్టుబడి సాయం డబ్బులు అందించింది కేంద్రం. దీంతో మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ పీఎం కిసాన్ డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. దీపావళి పండగ నేపథ్యంలో రైతు ఇళ్లలో ఆనందాలు నింపేందుకు పీఎం కిసాన్ డబ్బులు జమచేయనుంది కేంద్రం.