- Home
- National
- India Pakistan Border: సైలెంట్‌గా చైనా నుంచి భారీ ఆయుధాలు దింపిన పాకిస్థాన్.. ఇండియన్ ఆర్మీ టార్గెట్‌గా కుట్ర?
India Pakistan Border: సైలెంట్‌గా చైనా నుంచి భారీ ఆయుధాలు దింపిన పాకిస్థాన్.. ఇండియన్ ఆర్మీ టార్గెట్‌గా కుట్ర?
India Pakistan Border: భారత్ సరిహద్దులో పాకిస్థాన్ చైనాకు చెందిన 250 SH-15 హావిట్జర్ ఆటోమేటిక్ ఆర్టిలరీ గన్స్ మోహరించింది. 72 కిమీ దూరం దాడి చేయగల ఈ ఆయుధాలతో ఇండియన్ ఆర్మీపై పాకిస్థాన్ కుట్రకు తెరలేపిందా? అసలు విషయాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

భారత్ సరిహద్దులో 250 చైనా హావిట్జర్లు.. సరిహద్దుల్లో మళ్ళీ యుద్ధ వాతావరణం
పాకిస్థాన్ మళ్లీ సరిహద్దుల్లో తన కుట్రలను వేగవంతం చేసిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. భారత్‌తో ఉన్న తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో మిలిటరీ బలాన్ని భారీగా పెంచుతోంది. ఇందుకోసం చైనా తయారు చేసిన 250 ‘SH-15’ ట్రక్ మౌంటెడ్ సెల్ఫ్-ప్రొపెల్డ్ హావిట్జర్ ఆటోమేటిక్ ఆర్టిలరీ గన్స్ ను మోహరించడం ప్రారంభించింది. పాకిస్థాన్ ఆర్మీ ఈ 155mm ఆర్టిలరీ సిస్టమ్‌లను భారత్ సరిహద్దులోని కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉత్తరం నుండి దక్షిణం వరకు పక్కా ప్లాన్‌తో అమర్చుతోందని వర్గాలు వెల్లడించాయి.
ఆపరేషన్ సింధూర్ దెబ్బతోనే ఈ నిర్ణయమా?
మే 2025లో భారత ముప్పై దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) సంయుక్తంగా 'ఆపరేషన్ సింధూర్' పేరుతో కౌంటర్-టెర్రరిజం ఆపరేషన్ నిర్వహించాయి. ఆ సమయంలో లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) దాటి వెళ్లి, పాకిస్థాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో పాక్ ఉగ్రవాద నెట్‌వర్క్‌తో పాటు పాక్ ఆర్టిలరీ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి, తమ భూతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి రావుల్పిండి కేంద్రంగా పాక్ సైన్యం వేగంగా ఆధునీకరణ చర్యలు చేపట్టింది.
SH-15 హావిట్జర్ ప్రత్యేకతలు ఇవే
చైనా ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ 'నోరిన్కో' (NORINCO) ఈ SH-15 ఆటోమేటిక్ ఆర్టిలరీ గన్స్ ను తయారు చేసింది. చైనా సైన్యం (PLA) ఉపయోగిస్తున్న PCL-181 మోడల్‌కు ఇది ఎగుమతి వెర్షన్. 6x6 ఆర్మోర్డ్ శాన్సీ ట్రక్ ఛాసిస్‌పై దీనిని అమర్చారు.
• స్పీడ్, మూవ్‌మెంట్: ఇది రోడ్డుపై గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఎలాంటి క్లిష్టమైన కొండ ప్రాంతాల్లోనైనా చాలా వేగంగా పొజిషన్ మార్చుకోగలదు.
• దాడి చేసే దూరం: సాధారణ 155mm నాటో ప్రామాణిక మందుగుండు సామగ్రితో 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ఖచ్చితత్వంతో ఛేదించగలదు.
• మాగ్జిమం రేంజ్: రోకెట్-అసిస్టెడ్ V-LAP గోళ్లను ఉపయోగిస్తే 53 నుండి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను కూడా నేలమట్టం చేయగలదు.
• ఆటోమేషన్: ఇందులో ఆటోమేటెడ్ ఫైర్-కంట్రోల్ సిస్టమ్, హైడ్రాలిక్ స్టెబిలైజింగ్ స్పాడ్స్ ఉన్నాయి. నిమిషానికి 6 రౌండ్లు ఫైర్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. శత్రువుల కౌంటర్-బ్యాటరీ సిస్టమ్ గుర్తించే లోపే ఇది అక్కడి నుంచి తప్పించుకోగలదు.
పాకిస్థాన్ ప్లాన్ ఏంటి? రక్షణ నిపుణులు ఏమంటున్నారు?
దాదాపు 250 SH-15 ఆటోమేటిక్ ఆర్టిలరీ గన్స్ ను లభించడంతో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన పలు ఆర్టిలరీ రెజిమెంట్లు పూర్తి స్థాయిలో లెటెస్ట్ టెక్నాలజీకి మారుతున్నాయి. దీనివల్ల పాకిస్థాన్ సాంప్రదాయ సుదూర దాడి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని డిఫెన్స్ నిపుణులు భావిస్తున్నారు. ఈ మోహరింపు వల్ల సరిహద్దులోని భారత మిలిటరీ స్థావరాలు, లాజిస్టిక్ రూట్లు పాక్ రేంజ్‌లోకి వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ వద్ద కె-9 వజ్ర (K-9 Vajra) వంటి ట్రాక్డ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ, పాక్ దగ్గర ఉన్న ఈ వీల్డ్ హావిట్జర్లు వేగంగా కదిలే వెసులుబాటును ఇస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
చైనా - పాకిస్థాన్ సైనిక బంధం
ఈ ఆయుధాల మోహరింపు చైనా, పాకిస్థాన్‌ల మధ్య పెరుగుతున్న సైనిక బంధాన్ని స్పష్టంగా చూపుతోంది. కేవలం ఆయుధాల సరఫరానే కాకుండా, ఉమ్మడి సైనిక విన్యాసాలను కూడా ఉధృతం చేశాయి. నెట్‌వర్క్ కమాండ్ అండ్ కంట్రోల్, జాయింట్ ఆర్మ్స్ ఆపరేషన్స్‌లో పట్టు సాధించేందుకు ఇరుదేశాల దళాలు కలిసి పనిచేస్తున్నాయి.
ఇదే సమయంలో, శనివారం రావుల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) 99వ వార్షికోత్సవాన్ని పాకిస్థాన్ ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పాల్గొని చైనా-పాక్ బంధాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్, డిఫెన్స్ అటాచ్ మేజర్ జనరల్ వాంగ్ ఝాంగ్ తో పాటు పాక్ త్రివిధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పాక్ ఇలా భారీ స్థాయిలో చైనా ఆయుధాలపై ఆధారపడటం దాని వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని, ప్రాంతీయ భద్రతకు సవాలుగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

