Operation Olivia: తీర ప్రాంతాల్లో కోస్ట్ గార్డ్ అలర్ట్.. ఏంటీ ఈ ఆపరేషన్ ఒలీవియా?
Operation Olivia: ఒడిశా తీరంలో ఓలివ్ రిడ్లీ తాబేళ్ల రక్షణకు భారత కోస్ట్ గార్డ్ ‘ఆపరేషన్ ఒలీవియా’ను చేపట్టింది. ఇది నవంబర్ నుంచి మే వరకూ కొనసాగుతుంది.

ఓలివ్ రిడ్లీ తాబేళ్ల రక్షణకు భారత కోస్ట్ గార్డ్ ‘ఆపరేషన్ ఒలీవియా’
Operation Olivia: ప్రతి ఏడాది డిసెంబరు నుంచి మార్చి మధ్య కాలంలో లక్షలాది ఓలివ్ రిడ్లీ తాబేళ్లు ఒడిశా తీర ప్రాంతాల్లో గూళ్లు వేసేందుకు వస్తుంటాయి. ఈ సహజ ప్రక్రియను స్పానిష్‌లో ‘అరిబాడా’ అని పిలుస్తారు, అంటే ‘సముద్రం నుంచి రాక’ అని అర్థం. ఇప్పటివరకు సుమారు 3 లక్షల తాబేళ్లు గూళ్లు వేశాయని వాతావరణశాఖ వివరించింది. అయితే తాబేళ్లను అక్రమ వేట, తీరాల ధ్వంసం, వాతావరణ మార్పులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
తాబేళ్ల రక్షణ కోసం భారత కోస్ట్ గార్డ్ చర్యలు
ఈ పరిస్థితుల మధ్య, భారత కోస్ట్ గార్డ్ 'ఆపరేషన్ ఒలీవియా' ను చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా తాబేళ్ల రక్షణ కోసం అనేక చర్యలు తీసుకోనున్నారు. ఈ ఆపరేషన్ నవంబర్ నుంచి మే వరకూ కొనసాగుతుంది. తాబేళ్ల గూళ్లకు భద్రత కల్పించడం, అక్రమ మత్స్యకారులపై చర్యలు తీసుకోవడం, సముద్ర గస్తీలు నిర్వహించడం వంటి చర్యల్ని ఇందులో భాగంగా చేపడుతున్నారు.
ఆపరేషన్ ఒలీవియా కీలక చర్యలు
1. ఆకాశ, నావిక గస్తీలు:
కోస్ట్ గార్డ్ 5,387 నౌకా గస్తీలు, 1,768 హెలికాప్టర్ పర్యటనలు నిర్వహించి తాబేళ్ల కదలికలు గమనించి, అక్రమ వేటను అడ్డుకుంది.
2. సముదాయం సహకారం, అక్రమ వేట నిరోధం
ఇప్పటివరకు 366 అక్రమ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. తాబేళ్లు బయటపడేలా ప్రత్యేకంగా రూపొందించిన ‘టర్టిల్ ఎక్స్‌క్లూడర్ డివైస్’ (TEDs) వాడకాన్ని నిర్బంధంగా అమలు చేశారు. NGOలు, మత్స్యకారులతో కలిసి రక్షణ పనులు చేపట్టారు.
రుషికుల్య తీరంలో 6,98,718 తాబేళ్లు గూళ్లు
ఈ చర్యల ఫలితంగా 2025 ఫిబ్రవరిలో రుషికుల్య తీరంలో 6,98,718 తాబేళ్లు గూళ్లు వేశాయి, ఇది గత రికార్డును మించి నిలిచింది.
ఆపరేషన్ ఒలీవియా.. ఎదుర్కొంటున్న సవాళ్లు
తీరప్రాంతాలపై పర్యవేక్షణలో బలహీనత, ప్లాస్టిక్ కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా నివాస ప్రదేశాల మార్పు వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కోస్ట్ గార్డ్ ప్రకారం, దీర్ఘకాలికంగా తాబేళ్ల సంరక్షణకు బలమైన విధానాలు, సముదాయ సహకారం అవసరమని పేర్కొంది. “వయం రక్షామహ” (మేము రక్షిస్తాం) అనే నినాదంతో సముద్ర జీవుల రక్షణకు కట్టుబడి ఉన్నామని భారత కోస్ట్ గార్డ్ స్పష్టం చేసింది.