- Home
- National
- Monalisa : అందం అమ్మాయైతే ఇలాగే వుంటుందేమో! ఈ పిల్లికళ్ళ ముద్దుగుమ్మ స్వస్థలం, ఇతర డిటెయిల్స్
Monalisa : అందం అమ్మాయైతే ఇలాగే వుంటుందేమో! ఈ పిల్లికళ్ళ ముద్దుగుమ్మ స్వస్థలం, ఇతర డిటెయిల్స్
మోనాలిసా... పేరుకు తగ్గ అందం ఆమెది. అందుకే ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో రోడ్డుపై మాలలు అమ్ముకునే ఆమె అందం ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. ఇంతకూ ఈ మోనాలిసా ఎక్కడమ్మాయో తెలుసా?

Monalisa
Kumbhmela Viral Girl : 'అందం అమ్మాయైతే నీలా వుందే అన్నట్లుందే..' ఈ లిరిక్స్ ఈమెకు సరిగ్గా సరిపోతాయి. అందాల ఆరబోత లేదు... మేకప్ అంటే ఏంటో కూడా తెలిసివుండదు... ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోడ్డుపైనే ఆమె జీవితం. దుమ్మూ దూళిలోనే ఆమె నిత్యం వుండేది. అయినా ఈ దేవుడే ఆమెను అప్సరసలా తీర్చిదిద్దాడు... కాబట్టి ఇవన్నీ ఆమె చంద్రబింబంలాంటి ముఖారవిందాన్ని ఏం చేయలేకపోయాయి. ఆమె అందానికి కోట్లాదిమంది ఫిదా అయిపోతున్నారు.
ఇంతలా పొగుడుతోంది ఏ సినిమా హీరోయిన్ గురించో, మోడల్ గురించో కాదు... రోడ్డుపై రుద్రాక్ష, ఇతర మాలలు అమ్ముకునే ఓ సాధారణ అమ్మాయి గురించి. ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో కనిపించిన ఈ నిరుపేద ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చేతినిండా వివిధ రకాల మాలలను (రుద్రాక్ష, ముత్యాలతో చేసినవి) వేసుకుని రోడ్డుపై అమ్ముతూ కనిపిస్తున్న ఆ అమ్మాయి అందానికి ప్రతిఒక్కరు ఫిదా అవుతున్నారు.
చిత్రవిచిత్రమైన బాబాలు, నాగసాధువులు, తపోశక్తి కలిగిన మునులు, కాషాయం కట్టిన సన్యాసులు... ఇలా ఎంతోమంది ప్రయాగరాజ్ కుంభమేళాలో కనిపిస్తున్నారు. కానీ అందరికంటే ఈ మాలలమ్మే అమ్మాయే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఆమె సహజ సౌందర్యాన్ని వర్ణిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు... ఆమె వీడియోలతో రీల్స్ చేస్తున్నారు. ప్రజలకు కూడా ఈ అమ్మాయి అందం ఎంతగానో ఆకట్టుకుంటోంది... అందువల్లే ఇలా ఈమె వీడియో పెట్టగానే అలా మిలియన్స్ వీవ్స్, వేల కామెంట్స్ వస్తున్నాయి.
Monalisa
ఇంతకీ కుంభమేళా వైరల్ అమ్మాయి ఎవరు?
పిల్లి కళ్లు, ముక్కుకు పుడక, అందమైన నవ్వు... ఈ సహజ సౌందర్యానికే ప్రతిఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇలా ప్రయాగరాజ్ కుంభమేళాలో మాలలు అమ్ముకునే అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే... ఆమె పేరు మోనాలిసా భోంస్లే. ఆమె స్వస్థలం మధ్య ప్రదేశ్ లోని ఇండోర్. అక్కడినుండి కుటుంబసభ్యులతో కలిసి ప్రయాగరాజ్ కుంభమేళాకు వచ్చింది.
మోనాలిసాది నిరుపేద కుటుంబం. తండ్రితో పాటు కుటుంబసభ్యులంతా రుద్రాక్ష, ముత్యాల హారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఎక్కడ కుంభమేళాలు, హిందూ ధార్మిక వేడుకలు జరిగినా వీరు అక్కడికి వెళ్లి మాలలు అమ్ముతుంటారు. మరీముఖ్యంగా సన్యాసులు, సాధుసంతులు ఎక్కువగా హారజయ్యే ప్రాంతాల్లో ఈ కుటుంబం ఎక్కువగా వుంటుంది.
ఇలా సంచార జీవితం గడిపే ఈ కుటుంబం మహా కుంభమేళా ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్ చేరుకుంది. అక్కడ మోనాలిసా మాలలు అమ్మడం ప్రారంభించింది... ఈ క్రమంలో ఎవరో ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆమె సహజ అందం నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ ఇండియన్ బ్యూటీగా మారిపోయింది మోనాలిసా. పేరుకు తగ్గ అందం ఆమెదంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
Monalisa
ఆమె అందం ఎంతపని చేసింది...
సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారడంతో మోనాలిసాకు ఫ్యాన్స్ ఎక్కువయిపోయారు. ఆమెను నేరుగా చూసేందుకు ప్రయాగరాజ్ కుంభమేళా పర్యాటకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రధాన మీడియా ఛానల్స్ ప్రతినిధులు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆమె వీడియోల కోసం ఎగబడుతున్నారు. దీంతో మోనాలిసా వ్యాపారం చేసుకోలేకపోతోంది.
చివరికి పరిస్థితి ఎలా మారిందంటే ఆమె ఎక్కడుంటే అక్కడ ప్రజలు గుమిగూడి రద్దీ ఏర్పడుతోంది. అలాగే యువతి కుటుంబం నివాసముండే టెంట్ వద్దకు వందలాదిమంది వస్తున్నారు. ఇలా ఆమె అందం పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది.
ఇలా మోనాలిసాను చూసేందుకు వస్తున్నవారు కేవలం సెల్పీలు, వీడియోలకే పరిమితం అవుతున్నారు. ఆమెవద్ద మాలలు కొనేవారికంటే ఇలా ఊరికే చూసేందుకు వచ్చేవారే ఎక్కువయిపోయారు. దీంతో వ్యాపారం దెబ్బతినడమే కాదు కూతురు ఇబ్బంది పడుతోందని గమనించిన తండ్రి ఆమెను స్వస్థలానికి పంపించినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ప్రయాగరాజ్ కుంభమేళా ద్వారా ఓ నేచురల్ బ్యూటీ ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఆమెకు సోషల్ మీడియాలో వస్తున్న ఫాలోయింగ్ సినీతారలు కూడా కుళ్లుకునేలా వుంది. మరి ఈ ఫేమ్ ఆమెను ఎక్కడికి చేరుస్తుందో చూడాలి. ఇంతలా ఫేమస్ అయినా ఆమె సినిమావాళ్ల కంటపడి వుంటుంది...మరీ మోనాలిసా తేనెకళ్లను వెండితెరపై చూసే అవకాశం ఏమైనా వుంటుందా? అన్నది భవిష్యత్ తేలుస్తుంది.
ఇవి కూడా చదవండి
ఐఐటీ సన్యాసులు... కార్పోరేట్ జాబ్స్ వదిలి కాషాయం కట్టిన ఐఐటియన్లు వీరే
కుంభమేళా నుండి మీ ఇంటికి తీసుకెళ్లాల్సిన 5 వస్తువులివే ... వీటితో ఏం చేయాలంటే..