- Home
- National
- Trump: ఇండియా దగ్గర అమెరికాను మించిన డబ్బు ఉందా.? భారత్‌ను చూసి ట్రంప్ ఎందుకు భపడుతున్నారు.
Trump: ఇండియా దగ్గర అమెరికాను మించిన డబ్బు ఉందా.? భారత్‌ను చూసి ట్రంప్ ఎందుకు భపడుతున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ట్రంప్ దూకుడు మీద ఉన్నారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీశాయి. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల వెనకాల అసలు అర్థం ఏంటి.? నిజంగానే అమెరికాను భారత్ మించి పోనుందా.? ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రోజుకో వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను రద్దు చేస్తు అమెరికా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వృథా వ్యయం కట్టడి కోసం రూపొందించిన డోజ్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇదిలా ఉంటే ఈ రద్దుకు సంబంధించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫ్లోరిడాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికన్లు చెల్లిస్తున్న పన్ను డబ్బులను భారత్‌కు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. భారత్ వద్దే చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో అది ఒకటని, వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్‌ను చేరుకోలేదు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే భారత ప్రజలన్నా, ఆ దేశ ప్రధాని అన్న తనకు గౌరవమని, కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలా? అంటూ ప్రశ్నించారు.
PM Narendra Modi, US President Donald Trump. (Photo/X@narendramodi)
దీంతో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. భారత్ ఆర్థికంగా బలోపేతమవుతోందన్న కారణంతోనే ట్రంప్ ఇలా అన్నారా.? లేదా అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని అక్కడి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న దానిపై చర్చ నడుస్తోంది. మరి ఈ నేపథ్యంలో అసలు భారత్ ఆర్థికంగా అమెరికాకు పోటీనివ్వ ఉందా.? భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండనుంది.? లాంటి అంశాలను ఓసారి పరిశీలిద్దాం..
ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2022లో యూకేను అధిగమించి ఈ స్థానానికి చేరుకుంది. జీడీపీ పరంగా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారత్ నిలిచింది. ప్రస్తుతం భారత నామినల్ జీడీపీ సుమారు 3.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో జీడీపీ వృద్ధిరేటు 6 నుంచి 7 శాతంగా ఉంది. అలాగే భారత స్టాక్ మార్కెట్ సైతం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతోన్న మార్కెట్లలో ఒకటిగా ఉంది.
భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండనుంది.?
ఆర్థికరంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం 2027 నాటికి భారతదేశంలో జర్మనీని అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇక 2030 నాటికి జపాన్‌ను దాటి మూడో స్థానానికి చేరుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద 2050 నాటికి అమెరికా, చైనాల తర్వాత భారత్ అత్యంత సంపన్నమైన దేశంగా మారడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
దీనికి కారణాలు ఏంటి.?
ప్రపంచంలో అతి పెద్ద యువ జనాభా కలిగిన దేశంగా భారత్ నిలవనుంది. ఇదే మన దేశానికి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. అలాగే భారత్ టెక్నాలజీ రంగంలో కూడా శరవేగంగా దూసుకుపోతోంది. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ వంటి పథకాలు దేశంలో ఉత్పాదకత పెరగడానికి కారణమవుతున్నాయి. అదే విధంగా మధ్య తరగతి కుటుంబాల వినియోగ శక్తి కూడా పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోంది. స్థానికంగా వస్తువుల తయారీ పెరగడం, దిగుమతులపై తక్కువ ఆధారపడడంతో, ఎగుమతులు పెరుగుతుండడం భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అంశాలుగా చెప్పొచ్చు. ఇక భారత్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ రిజర్వ్స్‌లో కూడా దూసుకుపోతోంది. ప్రస్తుతం రిజర్వ్ భ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 6000 బిలియన్ డాలర్లకుపైగా విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలో టాప్ 5 ఫారెక్స్ రిజర్వ్ కలిగిన దేశాల్లో భారత్ ఒకటి కావడం విశేషం. ఐటీ, ఫార్మా రంగాల్లో కూడా భారత్ శరవేగంగా విస్తరిస్తోంది.
భారత్‌కు ఉన్న సవాళ్లు..
భారత్ ఆర్థికంగా ఎదుగుతున్న తరుణంలో కొన్ని సవాళ్లను సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటిలో ప్రధానమైనవి... ఆదాయాల్లో అసమానతలు. దేశంలో ఇంకా నిరూపేద వర్గానికి చెందిన వారు చాలా మంది ఉండడం. వీరికోసం ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అందించాల్సి రావడం. అలాగే రోజురోజుకీ పడిపోతున్న రూపాయి పతనం కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. అలాగే దేశంలో ఉద్యోగాల కొరత కూడా సమస్యగా చెప్పొచ్చు.
భారత్ ఎక్కువ పన్నులు వసూలు చేస్తుందని ట్రంప్ ఎందుకన్నారు.?
అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక టారిఫ్‌లు వేస్తోందని ఇప్పటికే ట్రంప్ చాలా సార్లు విమర్శించారు. హార్లే డేవిడ్‌సన్ బైకులపై భారత ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో కస్టమ్ డ్యూటీ వసూలు చేస్తోందన్న ట్రంప్ 2018లో భారత్‌పై ఈ విషయం బాగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఏకంగా కస్టమ్ డ్యూటీని 50 శాతం తగ్గేలా చేశారు. అలాగే అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్‌తో పాటు ఇతర మెడికల్ పరికరాలపై టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ పలుసార్లు ఆరోపించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ట్రంప్ భారత్‌కు 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను రద్దు చేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.