దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరం ఏంటో తెలుసా.? వరుసగా 8 ఏళ్లు ఇదే సిటీ..
పరిసరాల పరిశుభ్రత.. చిన్న తనం నుంచి దీని ప్రాముఖ్యత గురించి వివరిస్తుంటారు. మన చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకే ప్రభుత్వాలు సైతం స్వచ్ఛత వైపు అడుగులు వేస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం సైతం స్వచ్ఛ భారత్ పేరుతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. అయితే భారత దేశంలో అత్యంత పరిశుభ్రంగా ఉండే నగరం ఏదో ఎప్పుడైనా ఆలోచించారా.? ఒకటి కాదు రెండు ఏకంగా 8 ఏళ్లుగా ఈ నగరమే అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఏంటా నగరం.? ఎలా సాధ్యమైంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

CLEAN INDORE
భారతదేశంలో 8 ఏళ్లుగా అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందుతోంది ఇండోర్. దేశంలోని పెద్ద పట్టణాలతో పోలిస్తే ఇది పెద్దగా గుర్తింపు సంపాదించుకొని ఈ నగరం పరిశుభ్రత విషయంలో మాత్రం అగ్రగామిగా నిలిచింది. ఈ ఘనత సాధించడానికి అక్కడి పురపాలక సంస్థ పెద్ద ఎత్తున శుభ్రతపై అవగాహన కల్పించడం, పౌరుల సహకారంతో చక్కటి విధానాలను అమలు చేయడం వంటి చర్యలు తీసుకుంది.
“ఇండోర్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తే ఇది మన ఇండియాలో ఉందో లేదో అనిపిస్తుంది. అంత శుభ్రంగా ఉంటుంది,” అని ఇండోర్‌కి తరచూ ఉద్యోగ రీత్యా వెళ్తున్న కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ నితిషా అగర్వాల్ అన్నారు. లండన్‌కు చెందిన గార్డియన్ పత్రికలో ఈ నగరానకి సంబంధించిన కథనాన్ని ప్రచురించారు. ఇండోర్ నగరంలో శుభ్రత ఎలా సాధ్యపడిందో తెలుసుకునేందుకు గార్డియన్ రచయిత అమృత్ ధిల్లన్ పలువురు స్థానికులను కలిశారు. నితిషా అగర్వాల్ చెప్పిన "ఇది భారత్‌లో ఉందా?" అనే వ్యాఖ్య ఎలాంటి అతిశయోక్తి కాదు. ఎందుకంటే భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తరభారతంలో, అనేక నగరాలు చుట్టూ పొర్లే చెత్త కుప్పలతో కనిపించడం పరిపాటి.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కూడా అప్పటిదాకా అలానే ఉండేది. నగరంలో రోడ్లపక్కన చెత్తలో శునకాలు, పందులు, ఆవులు తిరుగుతూ ఉండేవి. కార్లు వెళ్తూ చెత్తను రోడ్డుపై పడేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతీ రోజూ రాత్రి 850 మంది కార్మికులు పనిచేస్తున్నారు. చెత్త వాహనాలు ప్రతీ వీధిలో తిరుగుతూ ఐస్‌క్రీం వాన్ల మాదిరిగా అనౌన్స్ చేస్తూ వస్తాయి. ఆ శబ్దం విన్న ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి వాహనాల్లో వేస్తారు.
ప్రతి చెత్త వాహనాన్ని జిపిఎస్ ద్వారా మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. దీంతో చెత్త వాహనాలు సరైన సేవలను అందిస్తున్నాయో లేదో అన్న విషయాన్ని అధికారులు ఇట్టే కనిపెట్టగలరు. చిన్న చిన్న వీధుల్లో కూడా రంగు రంగుల చెత్త బిన్లు పెట్టారు. అంతేకాదు ఎవరు చెత్త వేస్తున్నారో గుర్తించేందుకు సీసీటీవీలు కూడా అమర్చారు. ఇలా ఇండోర్ నగరం దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.