విద్యార్థులకు శుభవార్త.. రూ.6,000 పోస్టల్ స్కాలర్‌షిప్.. అప్లై చేసుకోండిలా..
Postal Scholarship : ఇండియన్ పోస్టల్ శాఖ ‘దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్‌షిప్’కోసం దరఖాస్తుల ఆహ్వానించింది. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు కేంద్రం రూ. 6,000 స్కాలర్‌షిప్ అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హతలు, ఎంపిక విధానం తెలుసుకుందాం..

దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్‌షిప్
పాఠశాలకు వెళ్తే విద్యార్థులకు భారతీయ తపాలాశాఖ ఓ శుభవార్త చెప్పింది. 2025–26 విద్యా సంవత్సరానికి “దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్‌షిప్’ కోసం దరఖాస్తుల ఆహ్వానించింది.
ఈ పథకం కింద ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారిని చదువులో ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్ అందిస్తోంది.
దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్‌షిప్ కు ఎంపికైన విద్యార్థులు ప్రతి నెలా రూ.500 చొప్పున, ఏడాదికి రూ.6,000 పొందుతారు. దేశవ్యాప్తంగా మొత్తం 40 మందిని ఎంపిక చేస్తారు. ప్రతి జోన్ నుంచి ఇద్దరికి ఈ అవకాశం లభిస్తుంది.
అర్హులెవరు?
దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్‌షిప్ కు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. . ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కింది తరగతిలో కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన విద్యార్థులకు 50 శాతం సాధించాలి. అలాగే.. పాఠశాలలోని ఫిలాటలీ క్లబ్‌లో సభ్యులుగా ఉండటం లేదా పోస్టాఫీసులో యాక్టివ్ ఫిలాటలీ డిపాజిట్ ఖాతా ఉన్న విద్యార్థులు అర్హులు.
ఎంపిక విధానం
దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్‌షిప్ కు ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది.
- మొదటి దశలో రాతపూర్వక క్విజ్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఇందులో చరిత్ర, సైన్స్, క్రీడలు, సోషల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
- రెండవ దశలో ఎంపికైన విద్యార్థులు ఫిలాటలీ ప్రాజెక్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత ఆధారంగా ఆయా రీజనల్ ఆఫీస్‌ల వారీగా ఎంపిక చేస్తారు. ఫిలాటెలీ (తపాలా బిళ్లల సేకరణ, అధ్యయనం) ప్రాముఖ్యతను పెంపొందించడం ఈ పరీక్షల ప్రధాన లక్ష్యం.
ఎలా అప్లై చేయాలంటే..
కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్‌షిప్ సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ పొందాలని అనుకునే విద్యార్థులు ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను సమీపంలోని పోస్టాఫీసు నుంచి పొందవచ్చు.
దరఖాస్తు నింపిన తర్వాత సంబంధిత సీనియర్ సూపరింటెండెంట్ (లేదా) సూపరింటెండెంట్ పోస్టాఫీసుకు రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. లేదా అన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. www.indiapost.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించాలి. దరఖాస్తు విధానం, అర్హతలు, ఇతర వివరాలు కూడా అదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
మరో అవకాశం
కేంద్ర ప్రభుత్వం పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా (YASASVI) పథకాన్ని కూడా అమలు చేస్తోంది. ఇందులో 9, 10వ తరగతులకు రూ.75,000, 11, 12వ తరగతులకు రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం అందుకోవచ్చు. మరిన్ని వివరాలకు NTA వెబ్‌సైట్ https://yet.nta.ac.in/ సందర్శించవచ్చు.
ఈ స్కాలర్‌షిప్ ద్వారా విద్యార్థులు చదువులో రాణించే అవకాశం పొందుతారని తపాలాశాఖ పేర్కొంది. ఈ రోజుల్లో ప్రతిభ ఉంటే చాలు, స్కాలర్‌షిప్ పథకాల ద్వారా విద్యార్థులు మంచి అవకాశాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.