Indian Pakistan War : పాక్ తో యుద్దానికి భారత్ సిద్దమవుతోందా? ఈ సంకేతాలు అవేనా?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కూడా చాలా అగ్రెసివ్ గా నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదులనే కాదు వారికి సహకరించిన పాకిస్థాన్ ను కూడా వదిలిపెట్టకూడదనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఇప్పటికే పాక్ పై అనేక ఆంక్షలు విధించగా మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఇందులో కీలకమైన నిర్ణయాలివే అంటూ ప్రచారం జరుగుతోంది. అవేంటో చూద్దాం.

India Pakistan War
India Pakistan : పహల్గాం ఉగ్రవాదుల దాడి తర్వాత ఇండియా-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కశ్మీర్ లో అమాయక పర్యాటకులను మతం పేరిట అతి కిరాతకంగా హతమార్చారు ఉగ్రవాదులు... అయితే ఇందులో పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ బలంగా నమ్ముతోంది. ఎందుకంటే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నది పాక్ పౌరులే. దీంతో సిందునది జలాల ఒప్పందం, పాక్ పౌరుల వీసాల రద్దు, వాఘా బార్డర్ మూసివేత వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది భారత్. ఇలా పాకిస్థాన్ తో యుద్దం చేయకుండానే భవిష్యత్ ను అందకారం చేసే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది మోదీ సర్కార్.
అయితే పాకిస్థాన్ కూడా భారత చర్యలకు కౌంటర్ గా రియాక్ట్ అవుతోంది. భారత విమానాలు పాక్ గగనతలంనుండి ప్రయాణించకుండా ఆంక్షలు, సిమ్లా ఒప్పందం రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంటోంది. అంతేకాదు బార్డర్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది... భారత సైనికులపై పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడుతోంది. గురువారం అర్ధరాత్రినుండి బార్డర్లో అలజడి రేగింది... పాక్ వైపునుండి విరామం లేకుండా కాల్పులు జరుగుతున్నాయని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. వీరిని భారత ఆర్మీ సమర్ధవంతంగా ఎదుర్కొంటోందని వెల్లడించారు.
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా ఇలా దుస్సాహసం చేస్తోంది దాయాది దేశం. దీనికి భారత్ కూడా ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌తో యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేయాలని భారత ప్రభుత్వం గట్టిగా ఆలోచిస్తోందట. ఇప్పటికే ఉన్నతస్థాయిలో దీనిపై చర్చలు జరుగుతున్నాయి... త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎల్వోసి మరియు అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్తాన్ తన వాగ్దానాలను నెరవేర్చకపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
Pahalgam Terrorist Attack
యుద్ధ విరమణ ఒప్పందం రద్దుకు సన్నాహాలు
అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను మరింత ఒంటరిగా చేసే దిశగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది భారత్. ఇలా ఫిబ్రవరి 2021లో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భారత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
లష్కరే తొయిబా, జైషే మహ్మద్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి ఉగ్రవాద సంస్థలకు పాక్ ఆశ్రయం కల్పిస్తోంది... దీంతో ఈ ఉగ్ర సంస్థలు జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడి హింసకు పాల్పడుతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో స్నైపర్ దాడులు, కాల్పుల ద్వారా పాకిస్తాన్ చాలాసార్లు యుద్ధ విరమణను ఉల్లంఘించింది. 2023 నుండి 2024 మధ్య వీటి సంఖ్య పెరిగింది. ఇప్పుడు కూడా పహల్గాం దాడిలో పాకిస్థాన్ హస్తం ఉందనేది స్పష్టం తేలిపోయింది.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనూ పాక్ కవ్వింపు చర్యలు ఆపడంలేదు. దీంతో ఇక భారత్ కూడా సహించబోమంటోంది. అందుకే పాక్ తో చేసుకున్న యుద్ద విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
India Pakistan Conflict
అఖిలపక్షం అనంతరం కిరణ్ రిజిజు హింట్...
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం గురువారం అన్నిపార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ సమావేశానికి హాజరయ్యాయి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశానికి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ వంటి నాయకులు హాజరయ్యారు.
అయితే ఈ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ "పహల్గాం దాడి, దానిపై క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ తీసుకున్న చర్యల గురించి రక్షణ మంత్రి వివరించారు. ఇది చాలా విచారకరమైన సంఘటన... ఇది దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటుంది'' అన్నారు. ఈ కఠిన నిర్ణయాల్లో పాక్ తో యుద్దవిరమణ ఒప్పందం రద్దు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
India Pakistan
పాక్ పై భారత్ విధించిన ఆంక్షలివే :
పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు ఏప్రిల్ 27, 2025 లోపు రద్దు చేయబడ్డాయి. వైద్య వీసాలు ఏప్రిల్ 29, 2025 వరకు చెల్లుతాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులు వారి వీసా గడువు ముగిసేలోపు వెళ్లిపోవాలని సూచించారు.
భారత్ దౌత్య సంబంధాలను తగ్గించింది, పాకిస్తాన్ రక్షణ ప్రతినిధులను బహిష్కరించింది ఇస్లామాబాద్‌లోని తన దౌత్య సిబ్బందిని తగ్గించింది. అలాగే వాఘా బార్డర్ ను మూసివేసింది. దశాబ్దాల నాటి సింధు నదుల ఒప్పందం నిలిపివేయబడింది, ఇది రెండు దేశాల మధ్య నీటి పంపిణీ ఒప్పందాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.
భారత పౌరులు పాకిస్తాన్‌కు ప్రయాణించవద్దని, ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నవారు వెంటనే భారతదేశానికి తిరిగి రావాలని కోరారు.