యుద్ధం తప్పదు.. పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి వ్యాఖ్యలు
పహల్గామ్ దాడుల తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ చేస్తూ కవ్వింపు చర్యలకు దిగుతూనే మరోవైపు భారత్ తమపై దాడి చేయనుంది అంటూ బూకాయిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pakistan Defence Minister Khawaja Asif (File Photo)
భారత్ – పాకిస్తాన్ మధ్య పరిస్థితులు రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు పలు దేశాలు కృషి చేస్తున్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం చల్లబడట్లేదని ఆయన పేర్కొన్నారు.
Khawaja Asif
ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఖవాజా ఆసిఫ్, “పహల్గాం ఘటన తర్వాత భారతదేశం క్షేత్రస్థాయిలో తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలు తగ్గేలా కనీస సూచనలు కనిపించడం లేదు.
శాంతికి భారత్ ఒప్పుకుంటుందనే ఆశా కనిపించడంలేదు. ఎలాంటి దాడులు జరిగినా, పాకిస్థాన్ కూడా తగిన రీతిలో ప్రతిస్పందిస్తుంది. దీనిపై ఎలాంటి సందేహం లేదు. పరిస్థితి భారత్ చర్యలపై ఆధారపడి ఉంటుంది,” అన్నారు.
అలాగే, “ఇరు దేశాల మధ్య సయోధ్యకు దేవుడే దారి చూపించాలని కోరుకుంటున్నా. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి,” అని చెప్పారు.
ఇదిలా ఉండగా, పహల్గాం దాడి తర్వాత భారత – పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్థాన్ సైన్యం వరుసగా ఆరు రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా వారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించి, ఎల్‌వోసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వద్ద కూడా దుశ్చర్యలు కొనసాగిస్తున్నారు.