Big story: 78 ఏళ్లు ఒక ఎత్తు.. వచ్చే 22 ఏళ్లు మరో ఎత్తు. మన భవిష్యత్తు ఏం కానుంది?
శుక్రవారం (ఆగస్టు 15)తో భారతదేశం స్వాతంత్ర రాజ్యంగా అవతరించి 78 ఏళ్లు గడించింది. మరి ఇన్నేళ్లలో దేశంలో ఎలాంటి మార్పులు జరిగాయి.? మోదీ గారు వచ్చే 22 ఏళ్లలో భారత్‌ను ఎలాంటి తీరాలకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. భారత్ ఎలా మారనుంది.?

స్వతంత్ర భారతంలో ఎదురైన తొలి సవాళ్లు
దాదాపు 200 ఏళ్లు భారతదేశాన్ని నిరంకుశంగా పాలించిన బ్రిటీషర్లు మన సంపదను వీలైనంత వరకు దోచుకున్నారు. దీంతో 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత నాయకులకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఆ సమయానికి ప్రపంచ జనాభాలో 1/7 వంతు భారతదేశంలోనే నివసిస్తారు. కారీ వారి సగటు ఆదాయం, అమెరికన్ల సగటు ఆదాయం కన్నా 15 రెట్లు తక్కువగా ఉంది. 3/4 వంతు జనాభా వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవనం సాగించారు. పాత పద్ధతులు, పాడుబడ్డ పరికరాలతోనే వ్యవసాయం చేసిన రోజులవి. భూమిలేని కూలీలు, ఆర్థిక భరోసా లేని కౌలు రైతులు, చిన్నచిన్న పొలాలతో జీవనం సాగించే రైతులు బతికేందుకు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. అప్పటికీ భారతదేశంలో అక్షరాస్యత రేటు కేవలం 14 శాతం మాత్రమే. సగటు ఆయుష్షు 32 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం అనేది భారత నాయకుల పెద్ద లక్ష్యంగా మారింది.
KNOW
మొదటి వ్యూహం – భారీ పరిశ్రమలపై దృష్టి
1950లలో ప్రభుత్వం ఒక ప్రత్యేక ఆర్థిక వ్యూహాన్ని ఎంచుకుంది. ఫైవ్ ఇయర్ ప్లాన్లు ద్వారా వేగవంతమైన పారిశ్రామికరణ. ప్రభుత్వ రంగంలో భారీ ఉక్కు, రసాయనాలు, యంత్రాలు, రైళ్లు, విద్యుత్ వంటి పరిశ్రమలను స్థాపించడం. స్వయం సమృద్ధితో పాటు విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. “విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అంటే బానిసలుగా మారడం” అని భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు. వినియోగ వస్తువుల తయారీ (దుస్తులు, సబ్బులు, ఫర్నిచర్) చిన్న పరిశ్రమలకు వదిలేశారు. ఇవి ఎక్కువ శ్రామిక శక్తి ఉపయోగించే పరిశ్రమలు కావడంతో, ఉద్యోగాలు సృష్టించగలవని ప్రభుత్వం నమ్మింది.
ప్రైవేట్ రంగానికి అడ్డుకట్ట
ప్రైవేట్ రంగం పెరగకుండా ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ సిస్టమ్‌ను అమలు చేశారు. ఒక ఫ్యాక్టరీ కొత్త ఉత్పత్తి చేయాలన్నా, సామర్థ్యం పెంచాలన్నా, ఇతర చోటుకు మార్చాలన్నా, తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్స్ అవసరం. దీనివల్ల వ్యాపార స్వేచ్ఛ తగ్గింది. దీన్నే తర్వాత “లైసెన్స్ రాజ్” అని ప్రతిపక్షాలు ఎగతాళి చేశాయి. భూమిని పెద్ద జమీందారుల నుంచి కౌలు రైతులకు పంచాలనే ప్రణాళిక. చిన్న రైతులను సహకార సంఘాలుగా ఏర్పాటు చేసి, కలిపి పరికరాలు అందించడం ప్రారంభించారు. కానీ కేవలం 5% భూమి మాత్రమే పంచారు. సహకార వ్యవసాయం సరిగ్గా పనిచేయలేదు. ఫలితంగా, ఆహార ఉత్పత్తి జనాభా పెరుగుదలకే సరిపడింది, అదనపు భద్రత రాలేదు. దీంతో 1960లలో పెద్ద ఆహార సంక్షోభం రావడంతో, అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.
పరిశ్రమల్లో విజయాలు – కానీ సమస్యలూ
1960 నాటికి భారత్‌లో ఉక్కు, రసాయనాలు, యంత్రాలు ఉత్పత్తి వేగంగా పెరిగింది. అయితే అనేక ప్రభుత్వ సంస్థలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉద్యోగాల సృష్టిలో విఫలమయ్యాయి, ఎందుకంటే అవి శ్రామిక శక్తి ఆధారంగా కాక, మూలధనం ఆధారంగా ఉండేవి. ఉదాహరణకు హాల్దియా ఎరువుల కర్మాగారం – 21 సంవత్సరాలు నడిచినా ఒక్క కిలో ఎరువు కూడా ఉత్పత్తి కాలేదు, కానీ ఉద్యోగులు వేతనాలు, బోనస్‌లు పొందారు.
ద్రవ్యోల్బణం, బ్లాక్ మార్కెట్
ప్రభుత్వ వ్యయం పెరగడంతో డబ్బు ముద్రించడం మొదలుపెట్టింది. ధరల నియంత్రణ విధించడంతో బ్లాక్ మార్కెట్ పుట్టింది.ధాన్యం వ్యాపారం కూడా ప్రభుత్వం జాతీయీకరించే ప్రయత్నం చేసింది కానీ విఫలమైంది. ఎక్కువ నిధులు పరిశ్రమలకు వెళ్ళడంతో ఆరోగ్యం, విద్య వెనుకబడ్డాయి. చైనా, కొరియా లాంటి దేశాలు ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టగా, భారత్ వెనుకబడిపోయింది.
1966–1980 మధ్యకాలంలో
ప్రతి వ్యక్తి ఆదాయం సంవత్సరానికి 1% కన్నా తక్కువ పెరిగింది. అయితే ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రజల అసంతృప్తి పెరిగింది. ఆ తర్వాత 1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. బలవంతపు భూమి పంపిణీ, బలవంతపు స్టెరిలైజేషన్ లాంటి చర్యలు తీసుకున్నారు. అయితే 1980లలో మార్పు వచ్చింది. ఇందిరా గాంధీ నియంత్రణలను కొంత సడలించారు. రాజీవ్ గాంధీ మరింత లిబరలైజేషన్ చేశారు. కొంత పరిశ్రమలకు లైసెన్స్ మినహాయింపు ఇచ్చారు. ఫలితంగా పరిశ్రమల వృద్ధి జరిగింది.
1991లో ఆర్థిక సంస్కరణలు
ఆధునిక భారతానికి 1991 ఆర్థిక సంస్కరణలే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతుంటారు. లైసెన్స్ రాజ్ అంతమైంది. 1991లో విదేశీ మారక సంక్షోభం కారణంగా పన్నులు, దిగుమతి సుంకాలు తగ్గించారు. ధరల నియంత్రణలు తొలగించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగానికి అమ్మారు. విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచారు. ఆ తర్వాత నుంచి లిబరలైజేషన్, ప్రైవటైజేషన్, గ్లోబలైజేషన్ అనే ప్రధాన సిద్ధాంతాలను అమలు చేశారు.
సంస్కరణల ఫలితాలు
ఆర్థిక వృద్ధి రేటు 6% పైగా పెరిగింది. పేదరికం 1993లో 50% నుండి 2009లో 34%కి తగ్గింది. 1991లో భారత్‌కి ప్రపంచ వాణిజ్యంలో వాటా 0.4%గా ఉండగా 2006 నాటికి 1.5%కి పెరిగింది. విదేశీ మారక నిల్వలు $350 బిలియన్ దాటాయి. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అంతకు ముందు ఒక ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ కావాలంటే నెలలు నెలలు వేచి చూడాల్సింది. కానీ పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలతో రోజుల్లోనే కనెక్షన్ వచ్చే రోజులు వచ్చాయి. బుక్ చేసుకున్న రోజుల వ్వవధిలోనే గ్యాస్ సిలిండర్, బజాజ్ చేతక్ వంటి బండ్లు డెలివరీ అయ్యాయి. ఇలా భారత్ క్రమంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా ఎదిగింది.
మోదీ ప్రధాని అయ్యాక వచ్చిన మార్పులు ఏంటి.?
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భారత ముఖచిత్రం క్రమంగా మారడం ప్రారంభమైంది. 2014కి ముందు యూపీఏ ప్రభుత్వం అవినితీ కుంభకోణాలతో దేశ ప్రజలు విసుగుచెంది బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ తీసుకున్న కొన్ని సాహసోపేత నిర్ణయాలు దేశ గతిని మార్చాయని నిపుణులు చెబుతుంటారు. వీటిలో ప్రధానంగా..
* 2014–2022 మధ్యలో తలసరి జిడిపి (PPP పద్ధతిలో) దాదాపు 40% పెరిగింది.
* సుమారు US$5,000 నుంచి US$7,000 దాటింది. ఇది భారత కుటుంబాల కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పేందుకు సంకేతం.
డీమానిటైజేషన్ ప్రభావం
మోదీ తీసుకున్న అత్యంత సాహసోపేత నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు ఒకటి. అయితే ఇది ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోగా దేశార్థికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడిందని కొందరి వాదన. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు కారణంగా నగదు కొరత ఏర్పడింది. 2016లో తలసరి వృద్ధి 6.98% ఉండగా 2017లో 5.56%కు తగ్గింది. తర్వాత మళ్లీ స్థిరపడే దిశలో వెళ్లింది.
మౌలిక వసతుల కల్పన పెరిగింది
గ్రామీణ రహదారుల నిర్మాణం వేగం పెరిగింది. దేశంలో చాలా ప్రాంతాల్లో హైవేలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ట్రాన్స్‌పోర్టేషన్ పెరిగింది. చిన్న చిన్న పట్టణాలు సైతం కలుపుతూ పెద్ద పెద్ద రహదారులు అందుబాటులో వచ్చాయి. ఇది కూడా ఆర్థికాభివృద్ధికి దోహదపడిందని చెప్పాలి.
ప్రజలకు సంక్షేమ పథకాలు
నరేంద్ర మోదీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. ప్రత్యక్ష నగదు బదిలీల రూపంలో గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్లు, రైతులకు ఆర్థిక సాయం వంటి ఎన్నో పథకాలను అమలు చేశారు. జన్‌ధన్ ఖాతా ద్వారా ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండేలా ప్రణాళికలు రచించారు. ఆయుష్మాన్ భారత్‌తో ప్రజలపై వైద్య భారం తగ్గింది. కరోనా సమయంలో ఆహార సబ్సిడీ బిల్లు దాదాపు ఐదు రెట్లు పెరిగింది. పేదలకు ఉచితంగా బియ్యం అందించారు. ఈ పథకాన్ని కేంద్రం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది.
మారుతోన్న గ్రామాలు
గ్రామాల విద్యుదీకరణ 2014లో 88% ఉండగా 2020లో 99.6% దాటింది. బ్యాంక్ ఖాతాలున్న వారి శాతం 48.3% నుంచి 71.1%కు పెరిగింది. ఈ కార్యక్రమాల వలన అట్టడుగు వర్గాలకు ఆర్థిక లాభం చేకూరింది. మద్దతు BJPకి చేరింది.
భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎలా మారింది?
ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశం అవతరించింది. ఇప్పటి వరకు 4వ స్థానంలో కొనసాగుతున్న జపాన్‌ను వెనక్కి నెట్టి భారత్ ఆస్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మరో 2.5- 3 ఏళ్లలోపు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఆధార్, UPI, జన్ ధన్ ఖాతాలు కలిసివచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ సమర్థంగా నడుస్తోంది. రోడ్లు, విద్యుత్, లాజిస్టిక్స్ పై పెట్టుబడులు పెరగడం వల్ల ఉత్పాదకత మెరుగైంది.
సవాళ్లు లేవా అంటే.?
భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకెళ్తోంది ఇక ఎలాంటి సవాళ్లు లేవా.. అంటే కచ్చితంగా లేవని చెప్పలేం. ఇప్పటికీ నిరుద్యోగం ఒక సమస్యగానే ఉంది. యూత్‌కు ఇండస్ట్రీ అవసరాలకు సరిపోయే స్కిల్స్ ఉండడం లేదు. దేశంలో 10% జనాభా మాత్రమే ఆధునిక రంగంలో పనిచేస్తున్నారు. 90% మంది ఇప్పటికీ వ్యవసాయం, అసంఘటిత రంగంలోనే ఉన్నారు. తక్కువ నైపుణ్యం కలిగిన మిలియన్లకు ఉద్యోగాలు లేవు. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయి.
వచ్చే 22 ఏళ్లలో ఏం జరగనుంది.?
2047 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తికానుంది. ఈ నేపథ్యంలోనే 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంతో మోదీ ఉన్నారు. 2047 నాటికి దేశంలో పలు విప్లవాత్మక మార్పులు జరగనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సాంకేతికత నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు, శక్తి ఉత్పత్తి నుంచి జాతీయ భద్రత వరకు పలు రంగాలలో కొత్త లక్ష్యాలు ముందుంచారు. వీటిలో కొన్ని ప్రధానమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ సెమీకండక్టర్ చిప్
దశాబ్దాలుగా కేవలం ప్రణాళికలుగానే ఉన్న సెమీకండక్టర్ పరిశ్రమ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చనుంది. ఈ ఏడాది చివరి నాటికి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ చిప్ విడుదల కానుందని మోదీ తెలిపారు. 2047 నాటికి భారత్ ప్రపంచ చిప్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా మారడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
10 రెట్లు ఎక్కువ అణుశక్తి ఉత్పత్తి
భారత్‌లో ప్రస్తుతం ఉన్న అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 10 రెట్లు పెంచుతామని ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పటికే 10 కొత్త అణు రియాక్టర్లు నిర్మాణంలో ఉండగా, భవిష్యత్తులో శుద్ధ ఇంధన అవసరాలను తీర్చడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.
కొత్త తరహా GST సంస్కరణలు
ప్రజలకు దీపావళి కానుకగా జీఎస్టీ సవరణలు రానున్నాయి. ముఖ్య అవసరాలపై పన్నులు తగ్గించడంతో వినియోగదారులకు ఉపశమనం లభించనుంది. MSMEలు, చిన్న వ్యాపారులకు కూడా ఇది ఊరట కలిగించనుంది. దీని ద్వారా 2047 నాటికి వ్యాపార వాతావరణం మరింత సులభతరం అవుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెంచడంతో ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుందని భావిస్తున్నారు.
$10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
భారత్‌ను 2047 నాటికి $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేక రిఫార్మ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, పాలన ఆధునీకరణ, పెట్టుబడుల పెంపు, సాంకేతికత వినియోగాన్ని వేగవంతం చేయనున్నారు.
లక్ష కోట్ల ‘పీఎం వికసిత్ భారత్ ఉద్యోగ యోజన’
ఉద్యోగాల సృష్టి ప్రధాన లక్ష్యంగా కొత్త ‘పీఎం వికసిత్ భారత్ ఉద్యోగ యోజన’ ప్రారంభమవుతోంది. ఈ పథకంలో భాగంగా కొత్తగా ఉద్యోగం పొందిన యువతకు ప్రతినెలా రూ.15,000 అందించనున్నారు. 3 కోట్లకు పైగా యువత 2047 నాటికి దీని ద్వారా లాభపడతారని అంచనా.
‘సముద్ర మంథన్’ – ఇంధన స్వావలంబన
ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు నేషనల్ దీప్‌వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ (‘సముద్ర మంథన్’) ప్రారంభమవుతోంది. సముద్రంలో చమురు, గ్యాస్ అన్వేషణకు ప్రాధాన్యం ఇస్తారు. సౌరశక్తి, హైడ్రోజన్, హైడ్రోపవర్, అణుశక్తి విస్తరణతో 2047 నాటికి భారత్ పూర్తిగా ఇంధన స్వావలంబన సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
‘మేడ్ ఇన్ ఇండియా’ జెట్ ఇంజిన్
భారత్‌లోనే ఫైటర్ జెట్ల కోసం జెట్ ఇంజిన్ తయారీకి పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో టీకాలు, UPI డిజిటల్ పేమెంట్‌లాంటి సాంకేతిక విజయాలను సాధించినట్లే, ఇప్పుడు జెట్ ఇంజిన్ తయారీలో కూడా దేశం ముందడుగు వేయాలని మోదీ సూచించారు. ఇది శాస్త్రవేత్తలు, యువతకు భారీ సవాలుగా నిలుస్తుంది.