ఎట్టకేలకు రెండు దేశాల అధ్యక్షుల సమావేశం ముగిసింది. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సుదీర్ఘంగా యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో ఇరుదేశాల అధినాయకుల సమావేశంపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఇంతకీ సమావేశంలో ఏం తేలిందంటే..?
అలాస్కా వేదికగా
అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగిన కీలక సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో అనేక అంశాలు చర్చకు వచ్చినప్పటికీ, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదు. ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ భేటీ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే పుతిన్ రష్యాలో మరో సమావేశం జరగనుందని ప్రకటించి చర్చలకు కొత్త మలుపు తిప్పారు.
అలాస్కానే ఎందుకు.?
ఈ చారిత్రక సమావేశానికి అమెరికా రాష్ట్రం అలాస్కాను ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది. అగ్రరాజ్యానికి భౌగోళికంగా, వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా ఉన్న ఈ ప్రాంతాన్ని గతంలో రష్యా (Russia) నుంచే కొనుగోలు చేయడం విశేషం. ఇక్కడ నుంచి చూస్తే రష్యా కనిపిస్తుందని స్థానిక నేతలు చెబుతుంటారు. అలాస్కాలో గతంలో అనేక మంది ప్రపంచ నేతలు పర్యటించినప్పటికీ.. తొలి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ నిలిచారు.
ట్రంప్ ఏమన్నారంటే.?
భేటీ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలలో ఇరువురూ చర్చించుకున్నామని, కొన్ని విషయాలలో అంగీకారం సాధించినప్పటికీ ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు మిగిలి ఉన్నాయని తెలిపారు. అధికారిక ఒప్పందానికి ఇంకా సమయం పడుతుందని, అన్ని సమస్యలు పరిష్కారమయ్యాకే అగ్రిమెంట్ సంతకం అవుతుందని స్పష్టం చేశారు. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని, పుతిన్‌తో మరోసారి సమావేశమవుతానని చెప్పారు.
జెలెన్‌స్కీ చేతుల్లో తుది నిర్ణయం
ఉక్రెయిన్ యుద్ధానికి శాంతి ఒప్పందం కుదరాలంటే జెలెన్‌స్కీ అంగీకారం కీలకమని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా శక్తివంతమైన దేశమని, పుతిన్–జెలెన్‌స్కీ భేటీ జరిగే అవకాశం ఉందని, అందులో తాను కూడా పాల్గొనవచ్చని వెల్లడించారు. అయితే పుతిన్‌తో చర్చించిన ప్రత్యేక అంశాలపై వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.
పుతిన్ కీలక వ్యాఖ్యలు
ఈ భేటీ గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ట్రంప్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనే తన నిజాయితీని వ్యక్తం చేశారు. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే ఉక్రెయిన్‌తో యుద్ధం వచ్చి ఉండేది కాదని మరోసారి అన్నారు. ఈ సమావేశాన్ని సమస్యల పరిష్కారానికి ఒక ఆరంభంగా పరిగణిస్తున్నానని చెప్పారు. అమెరికా–రష్యా సంబంధాలను వ్యాపార సంబంధాల్లా చూస్తానని వ్యాఖ్యానించిన ఆయన, వచ్చే సమావేశం మాస్కోలో జరగనుందని ప్రకటించారు.
అలాస్కా వేదికగా ఘన స్వాగతం
ఈ భేటీకి అమెరికా తరఫున ట్రంప్‌తో పాటు విదేశాంగ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ పాల్గొన్నారు. రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్, సలహాదారు యురి యుషకోవ్ హాజరయ్యారు. తొలుత కేవలం ట్రంప్–పుతిన్ మధ్యే చర్చలు జరుగుతాయని అనుకున్నప్పటికీ, ఇరు దేశాల ప్రతినిధులు కూడా చర్చల్లో భాగమయ్యారు. సమావేశానికి ముందు ఇద్దరు నేతలు యాంకరేజ్ చేరుకోగా, విమానాశ్రయంలో మీడియా ప్రశ్నలు అడిగినా సమాధానమివ్వకుండా నేరుగా సమావేశ స్థలానికి వెళ్లారు. భేటీ ముగిసినట్లు వైట్‌హౌస్, క్రెమ్లిన్‌లు అధికారికంగా ప్రకటించాయి.
