Independence Day 2025: భిన్నత్వంలో ఏకత్వ భారతం.. రాష్ట్రాల్లో స్వాతంత్య్ర సంబరాలిలా!
Independence Day 2025: స్వాతంత్య్ర దినోత్సవం అంటే కేవలం జాతీయ ఉత్సవం మాత్రమే కాదు. దేశ సంస్కృతిక వైవిధ్యానికి ప్రతిబింబం కూడా. ఢిల్లీలో జరిగే దేశభక్తి పరేడ్‌లు జాతీయ గౌరవాన్ని చాటుతుంటే, వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంప్రదాయాల జాతీయతను చాటుతాయి.

ఎర్రకోటపై త్రివర్ణం ఎగిరే రోజు వచ్చింది!
2025 ఆగస్టు 15న భారతదేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని జెండా ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సైనిక కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక ఆచారాలు, పథకాలు, జాతీయ గీతాల మేళతో దేశమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఇవి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
పతంగులు, లంగర్‌లు, లైటింగ్ ఉత్సవం
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో గాలిపటాలు ఎగురవేస్తారు. పంజాబ్‌లోని గురుద్వారాల్లో లంగర్ సేవలు నిర్వహించబడుతున్నాయి. బీహార్‌లో పాట్నా గాంధీ మైదానంలో ప్రత్యేక లైటింగ్, సీసీటీవీ, నీటి సరఫరా, సీటింగ్ ఏర్పాట్లతో భద్రతా పరంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్రాల ప్రత్యేకతలతో దేశం ఉత్సాహంగా స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటోంది.
సంస్కృతిక నృత్యాలతో స్వాతంత్య్ర శోభ
పశ్చిమ బెంగాల్, ఒడిశా రాజధానుల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. జెండా వందనాలు, జానపద నృత్యాలు, దేశభక్తి ప్రదర్శనలు, అలాగే స్వాతంత్య్ర పోరాటంలో ప్రాంతీయ సహకారాన్ని హైలైట్ చేసే సాంస్కృతిక ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
అస్సాంలో రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో దేశభక్తి ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి.తూర్పు రాష్ట్రాల సంప్రదాయాల్లో దేశభక్తి కళలు కలగలిపి ప్రజల మనసులను కదిలిస్తున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో స్వాతంత్య్ర వేడుకలిలా..
కేరళలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పడవ పోటీలు (Boat Races) ప్రధాన ఆకర్షణ. కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో, సంగీత దిగ్గజాలు, స్థానిక బ్యాండ్‌ల ప్రదర్శనలతో ఫ్రీడమ్ జామ్ కచేరీ జోష్‌ను పెంచుతోంది.
తమిళనాడులో పాఠశాలలు, సంస్థల్లో జెండా వందనం, దేశభక్తి ప్రసంగాలు, ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆగస్టు 15ను ఘనంగా జరుపుకుంటున్నారు.
మహారాష్ట్రలో త్రివర్ణ కాంతులతో
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గేట్‌వే ఆఫ్ ఇండియా, మెరైన్ డ్రైవ్ లాంటి ప్రదేశాలు త్రివర్ణ దీపాలతో వెలిగిపోతుండగా, సాంస్కృతిక పరేడ్‌లు, ప్రజా కార్యక్రమాలు సందడిగా సాగుతున్నాయి. ముంబైలో జెండా వందనాలు, ప్రదర్శనలు, సమాజ సమావేశాలు దేశభక్తిని మరింత ఉల్లాసంగా చాటుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జనాల్లో దేశభక్తి ఉత్సాహం ఉరకలేస్తోంది.
డిజిటల్ జోష్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గ్రామాల్లో కూడా ఘనంగా జరుగుతాయి. పాఠశాలలు, మైదానాల్లో జెండా వందనం, దేశభక్తి గీతాల ఆలపన, నాటకాలు, జానపద నృత్యాల ప్రదర్శనలతో ఆగస్టు 15ను ఉత్సాహంగా జరుపుకుంటారు. కబడ్డీ, తాడు లాగడం, సామూహిక భోజనాలు, చెట్ల పెంపకం వంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను బలపరుస్తాయి.
ఇదిలా ఉంటే.. టెక్నాలజీ, సోషల్ మీడియా కూడా దేశభక్తికి ప్రాణం పోస్తుందనే చెప్పాలి. టెలివిజన్, రేడియో, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఢిల్లీ ఎర్రకోటలోని జెండా వందన వేడుకలు ప్రత్యక్ష ప్రసారంగా దేశమంతా చూడగలుగుతోంది.
#IndependenceDay, #JaiHind వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రజలు ఫోటోలు, సందేశాలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ దేశభక్తిని వ్యక్తపరుస్తారు. ఇదే భారత స్వాతంత్య్ర దినోత్సవం ప్రత్యేకత.