- Home
- National
- Rains Alert : ఇవేం వానల్రా నాయనా..! ఈ దక్షిణాది రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, తెలుగు రాష్ట్రాల సంగతి?
Rains Alert : ఇవేం వానల్రా నాయనా..! ఈ దక్షిణాది రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, తెలుగు రాష్ట్రాల సంగతి?
నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనాలు, ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో మూడ్రోజులు ఈ వర్షాలు కొనసాగుతాయని… దక్షిణాది రాష్ట్రాల్లో అయితే కుండపోత వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు
Weather : తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి (ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్ మెంట్) ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణికి నైరుతి రుతుపవనాల ప్రభావం తోడవడంతో వర్షాలు దంచికొడతాయని హెచ్చరించారు. ఇవాళ(సోమవారం) ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయట... అందుకే ఎల్లో అలర్ట్ జారీ చేసింది IMD.
ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో సోమవారం మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని... కొన్నిచోట్ల వర్షాలు లేకున్నా ఆకాశం మేఘాలతో కమ్మేసి వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లో ఇవాళ ఇప్పటికే చిరుజల్లులు ప్రారంభమయ్యాయి.
ఏపీలోకి నేడు రుతుపవనాల ఎంట్రీ
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఇవాళ (మే 26) ఆంధ్ర ప్రదేశ్ ను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో ముందుగా ఎంట్రీ ఇవ్వనున్న రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. దీంతో ఏపీలో వర్షాలు మరింత జోరందుకోనున్నాయి. రుతుపవనాల రాక నేపథ్యంలో తీరంవెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలుంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్ధ హెచ్చరించింది.
ఏపీలో దంచికొట్టనున్న వానలు
ఈ రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులున్నాయట. దీంతో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా సోమవారం కూడా భారీ వర్షాలు తప్పవంటున్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, ,కృష్ణా,ఎన్టీఆర్, కర్నూలు,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకటించింది.
రేపు అల్లూరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,కర్నూలు,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. pic.twitter.com/8Qkaf01Umy
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 25, 2025
కేరళలో రెడ్ అలర్ట్
ఇదిలావుంటే దేశవ్యాప్తంగా కూడా జోరుగా వానలు కురుస్తున్నాయి... దక్షిణాది రాష్ట్రాల్లో అయితే మరింత ఎక్కువగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ అయితే కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండి. కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు.
Weather Warning for 26th May 2025#mausam #weatherupdate #WeatherAlert #WeatherWarning #ForecastUpdate #StaySafe #WeatherForecast #WeatherNews #reel #trendingreel #viralreel #Monsoon2025 #Monsoon #MonsoonForecast @moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/qhY6D8qrCo
— India Meteorological Department (@Indiametdept) May 25, 2025
తమిళనాడులో కుండపోత వర్షాలు
తమిళనాడులో కూడా ఇలాగే నేడు భారీ వర్ష సూచన నేపథ్యంలో 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం ఊటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి... అందుకే ఇక్కడ 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నేడు, రేపు ఊటీలో పలు పర్యాటక ప్రాంతాలు మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు... పర్యాటకులే కాదు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది.
కర్ణాటకలో కూడా రెడ్ అలర్ట్
కర్ణాటకలో కూడా ఇదే పరిస్ధితి ఉంది. ఇప్పటికే రాజధాని బెంగళూరును వర్షాలు ముంచెత్తాయి... ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఐటీ సీటీలో ఆందోళన మొదలయ్యింది. అలాగే కర్ణాటకలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు, బలమైన ఈదురుగాలులు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ రాష్ట్రానికి కూడా ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది.