- Home
- National
- Free Train: భారత్‌లోని ఈ రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు.. టికెట్ అవసరం లేదు, ఎక్కడంటే
Free Train: భారత్‌లోని ఈ రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు.. టికెట్ అవసరం లేదు, ఎక్కడంటే
Free Train: రైలు ప్రయాణం అంటే టికెట్ తప్పనిసరి అని తెలిసిందే. కానీ రైలు మాత్రం ప్రయాణికుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా గత 75 ఏళ్లుగా సేవలందిస్తోంది. ఇంతకీ ఏంటా ట్రైన్, ఎక్కడ నడుస్తుంది.? ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఉచిత రైలు ఎక్కడ నడుస్తుంది?
ఈ రైలు పంజాబ్ రాష్ట్రం నాంగల్ – భాఖ్రా మధ్య నడుస్తుంది. మొత్తం దూరం సుమారు 13 కిలోమీటర్లు. ఇప్పటికీ ఈ రైలు డీజిల్ ఇంజిన్‌తోనే నడుస్తోంది. పాత తరహా చెక్క బోగీలను ఉపయోగిస్తుండటం ఈ రైలు ప్రత్యేకత.
అసలు కారణం ఏంటి?
ఈ ఉచిత రైలు సేవ 1948లో ప్రారంభమైంది. ఆ సమయానికి భాఖ్రా నాంగల్ డ్యామ్ నిర్మాణం జరుగుతోంది. కార్మికులు, ఇంజినీర్లు, భారీ యంత్రాలు డ్యామ్ ప్రాంతానికి చేరుకోవడానికి ఈ రైలును ఉపయోగించారు. డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఈ సేవ అవసరంగా మారింది.
డ్యామ్ పూర్తయ్యాక కూడా ఉచితంగా
డ్యామ్ నిర్మాణం తర్వాత భాఖ్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు (BBMB) ఈ రైలును ఉచితంగానే కొనసాగించాలని నిర్ణయించింది. దీనికి ప్రధాన కారణాలు భాఖ్రా డ్యామ్ చుట్టూ పర్యాటకాన్ని పెంచడం, దేశం నలుమూలల నుంచి వచ్చే వారు డ్యామ్‌ను సులభంగా చూడగలగడం కోసమే.
ఈ రైలు ఖర్చులు ఎవరు భరిస్తున్నారు?
ఇండియన్ రైల్వేలా ఈ రైలు టికెట్ల ఆదాయంపై ఆధారపడదు. మొత్తం నిర్వహణ ఖర్చును BBMB భరిస్తోంది. ఈ రైలును ఆదాయ వనరుగా కాకుండా ప్రజలకు అవసరమైన సేవగా చూస్తోంది. ఈ రైలు BBMB ఉద్యోగులు, స్కూల్, కాలేజ్ విద్యార్థులు, పరిసర గ్రామాల ప్రజల కోసం నిత్య ప్రయాణ సాధనంగా మారింది.

