Free LPG Cylinder : ఈ దీపావళికి ఫ్రీగా గ్యాస్ సిలిండర్ .. ఎలా పొందాలో తెలుసా?
Free LPG Cylinder : దీపావళి పండక్కి ప్రభుత్వం ఉచితంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను అందించేందుకు సిద్దమయ్యింది. బుధవారం (అక్టోబర్ 15) నుండే వీటిని పంపిణీ చేయనున్నారు. ఎలా పొందాలో తెలుసా?

దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు
Free LPG Cylinder : ఈ దీపావళికి ఉత్తర ప్రదేశ్ ప్రజలకు యోగి సర్కార్ సరికొత్త కానుక అందించబోతోంది… కోట్లాదిమంది తల్లుల ముఖాల్లో చిరునవ్వులు పూయించబోతోంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు ఉపశమనం కల్పిస్తూ రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం లోక్‌భవన్ ఆడిటోరియంలో ఈ పథకాన్ని ప్రారంభించి, అర్హులైన మహిళలకు ఉచిత సిలిండర్లు అందజేస్తారు. పేదలు, మహిళలు, గ్రామీణ కుటుంబాలకు స్వచ్ఛమైన ఇంధనం, ఆర్థిక మద్దతు అందించే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
1.86 కోట్ల కుటుంబాలకు లబ్ధి
ప్రధానమంత్రి ఉజ్వల యోజన మే 2016లో ప్రారంభమైంది. గ్రామీణ, పేద కుటుంబాలను కట్టెలు, బొగ్గు లేదా పిడకల వంటి సంప్రదాయ ఇంధనాల నుంచి విముక్తి కల్పించి, వారికి ఎల్పీజీ వంటి స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించడమే దీని ఉద్దేశం. ఈ పథకం గ్రామీణ భారతదేశంలోని వంటగదులను పొగ నుంచి విముక్తి చేసింది. మహిళలు, పిల్లల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలను తగ్గించింది. ఈ పథకం విజయవంతమైన అమలులో ఉత్తరప్రదేశ్ ముందుంది. ఇప్పటివరకు 1.86 కోట్ల కుటుంబాలకు ఉజ్వల కనెక్షన్లు ఇచ్చారు.
రెండు దశల్లో సిలిండర్ల పంపిణీ
ఉజ్వల లబ్ధిదారులకు ఏటా రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పంపిణీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండు దశల్లో జరుగుతుంది
మొదటి దశ: అక్టోబర్ 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు
రెండో దశ: జనవరి 2026 నుంచి మార్చి 2026 వరకు
ఈ పథకం విజయవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం రూ.1500 కోట్ల నిధులను కేటాయించింది యోగి సర్కారు.
ఆధార్ ధృవీకరించిన లబ్ధిదారులకు ప్రాధాన్యత
ఈ పథకం మొదటి దశలో ఆధార్ ధృవీకరించిన లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.23 కోట్ల ఉజ్వల లబ్ధిదారుల ఆధార్ వెరిఫికేషన్ పూర్తయింది. మూడు ఆయిల్ కంపెనీలు - ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం - ద్వారా పంపిణీ జరిగేలా చూస్తున్నారు. పంపిణీలో జాప్యం జరగకుండా ఉండేందుకు రూ.346.34 కోట్ల ముందస్తు మొత్తాన్ని ఆయిల్ కంపెనీలకు అందించింది ప్రభుత్వం.
ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఎలా పొందాలి?
లబ్ధిదారులు మొదట తమ సొంత ఖర్చుతో సబ్సిడీతో సహా ప్రస్తుత ధరకు సిలిండర్ రీఫిల్ కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత 3 నుంచి 4 రోజుల్లోగా సబ్సిడీ మొత్తాన్ని ఆయిల్ కంపెనీలు వారి ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతాలో తిరిగి జమ చేస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మిగతా మొత్తం వేర్వేరుగా లబ్ధిదారుల ఖాతాలకు పంపబడుతుంది. 5 కిలోల సిలిండర్లు ఉన్నవారు కావాలనుకుంటే 14.2 కిలోల సిలిండర్లను కూడా పొందవచ్చు. ఒకే ఎల్పీజీ కనెక్షన్ ఉన్నవారికి కూడా ఈ పథకం ప్రయోజనం అందుతుంది.
ఆధార్ ధృవీకరణ కోసం ప్రత్యేక ప్రచారం
ఇంకా ఆధార్ ధృవీకరణ పూర్తికాని లబ్ధిదారుల వెరిఫికేషన్‌ను పరిపాలన, ఆయిల్ కంపెనీల సహకారంతో వేగవంతం చేస్తున్నారు. లబ్ధిదారులు త్వరగా తమ ఆధార్‌ను ధృవీకరించుకునేలా కంపెనీలు వారికి ఎస్ఎంఎస్‌లు పంపుతున్నాయి. దీనికోసం ఒక ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పంపిణీదారుల వద్ద అదనపు ల్యాప్‌టాప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పంపిణీ కేంద్రంలో బ్యానర్లు, ఫ్లెక్సీలు, క్యాంపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. సౌలభ్యం కోసం రోస్టర్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థను అమలు చేశారు.
ఫిర్యాదుల పరిష్కారం, కఠిన పర్యవేక్షణ వ్యవస్థ
పథకం సమర్థవంతమైన నిర్వహణ, పర్యవేక్షణ కోసం రెండు స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో ఆహార కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమిటీ పథకాన్ని క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వారానికోసారి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. దీంతో పాటు, వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా యాక్టివేట్ చేశారు.
గ్యాస్ పూర్తి పరిమాణంలో ఉండేలా ఆదేశాలు
వినియోగదారులకు పూర్తి పరిమాణంలో (14.2 కిలోలు) గ్యాస్ అందేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు యూపీ అధికారులు. ఏదైనా సిలిండర్ బరువు తక్కువగా ఉంటే, పంపిణీదారుడు తన సొంత ఖర్చుతో సిలిండర్‌ను మార్చి ఇవ్వాలని హెచ్చరించారు. పారదర్శకత ఉండేలా తూనికలు, కొలతల శాఖ, జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు.
మహిళలకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం
ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద కుటుంబాలకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించే చర్య. ఇది గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన ఇంధన వాడకాన్ని ప్రోత్సహిస్తుంది, పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ పథకం మహిళలకు ఆర్థిక ఉపశమనం ఇవ్వడమే కాకుండా, వారి జీవితాల్లో సౌకర్యం, ఆరోగ్యం, సాధికారతను కూడా తెస్తుంది.