Fact Check: ఢిల్లీ ఆందోళనల్లో పాల్గొన్న వారి పాస్‌పోర్టులు రద్దు చేయనున్నారా.?
Fact Check: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆందోళనలో పాల్గొన్న వారి పాస్‌పోర్టులను రద్దు చేయనున్నారన్న వార్తలపై పోలీసులు స్పందించారు.

ఖండించిన ఢిల్లీ పోలీసులు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, సందేశాల్లో ఎలాంటి నిజం లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఆందోళనల్లో పాల్గొన్న వ్యక్తుల పాస్‌పోర్టులను రద్దు చేసే నిర్ణయం తీసుకున్నామన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు.
ఈ మేరకు ఢిల్లీ పోలీసుల అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా ఫ్యాక్ట్‌చెక్ పోస్టు విడుదల చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక వర్గాలు వెల్లడించే సమాచారాన్నే విశ్వసించాలని సూచించారు.
# Fact Check
The viral claim is misleading. No such decision has been announced to cancel the passports of CJP protestors. Citizens are advised not to share or amplify misleading posts and to rely only on official information.@VIKRAMPRATAPSIN— DCP New Delhi (@DCPNewDelhi) July 23, 2026
పెలెట్ గన్స్, పెప్పర్ స్ప్రేపై కూడా క్లారిటీ
నిరసనల సమయంలో పోలీసులు పెలెట్ గన్స్ ఉపయోగించారనే ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దీనిపైనా ఢిల్లీ పోలీసులు స్పందించారు. భద్రతా సిబ్బంది పెలెట్ గన్స్ వినియోగించారన్న ఆరోపణలు నిరాధారం అని పేర్కొన్నారు. అంతేకాకుండా, జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకారులపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారనే ప్రచారాన్ని కూడా పోలీసులు తోసిపుచ్చారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తాయని, వాటిని షేర్ చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
'చలో పార్లమెంట్' నిరసనల్లో ఉద్రిక్త పరిస్థితులు
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన 'చలో పార్లమెంట్' కార్యక్రమం సందర్భంగా పార్లమెంట్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు కొందరు నిరసనకారులు ప్రయత్నించగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పోలీసులు గుంపును చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్ కూడా నిర్వహించారు. ఈ ఘటనల్లో కొందరు నిరసనకారులు, పోలీసు సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
సోషల్ మీడియా ప్రచారాలపై జాగ్రత్తగా ఉండాలని సూచన
నిరసనల అనంతరం పలు వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటి నిజానిజాలపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మరోసారి ప్రజలకు కీలక సూచన చేశారు.
ధృవీకరించని సమాచారం, ఎడిట్ చేసిన వీడియోలు లేదా తప్పుడు పోస్టులను షేర్ చేయడం వల్ల అపోహలు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అధికారిక ప్రకటనలు, విశ్వసనీయ వనరుల ద్వారా వచ్చిన సమాచారాన్నే నమ్మాలని కోరారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పాస్‌పోర్ట్ రద్దు, పెలెట్ గన్స్ వినియోగం, పెప్పర్ స్ప్రే వంటి ప్రచారాలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదని స్పష్టం చేశారు.

