డీఆర్డీవో: భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం
Air Defence Weapon System: డీఆర్‌డీవో (DRDO) ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ను విజయవంతంగా పరీక్షించింది. ఇది దేశ రక్షణ సామర్థ్యాలకు పెద్ద బలమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
స్వదేశీ రక్షణలో కీలక ముందడుగు
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) ఫ్లైట్ టెస్టులు విజయవంతంగా నిర్వహించింది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగిన ఈ పరీక్షలతో, బహుళస్థాయి గగన రక్షణ సామర్థ్యాలను భారత్ ప్రదర్శించింది.
KNOW
IADWS ఏమిటి?
IADWS అనేది బహుళస్థాయి రక్షణ వ్యవస్థ. ఇందులో మూడు ప్రధాన స్వదేశీ భాగాలు ఉన్నాయి. అవి స్వదేశీ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు (క్యూఆర్ఎస్ఏఎమ్), అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (వీఎస్‌హెచ్ఓఆర్ఏడీఎస్) క్షిపణులు, హై-పవర్ లేజర్-ఆధారిత ఎనర్జీ వెపన్ (డీఈడబ్ల్యూ)లు.
- క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (QRSAM): మధ్యస్థ దూరం వరకు గగనతల ముప్పులను ఎదుర్కోవడానికి రూపొందించారు.
- అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS): తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు, హెలికాప్టర్లను సమీప దూరంలోని టార్గెట్ల కోసం.
- లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (DEW): లేజర్ సాంకేతికతతో తక్కువ ఎత్తు గగనతల ముప్పులను నిర్వీర్యం చేయడానికి రూపొందించారు.
ఈ వ్యవస్థలోని అన్ని భాగాలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు.
మూడు వేర్వేరు టార్గెట్లపై పరీక్షలు
పరీక్షల సమయంలో మూడు వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి ధ్వంసం చేశారు. వీటిలో రెండు అధిక వేగంతో ప్రయాణించే అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (UAVs), ఒక మల్టీకాప్టర్ డ్రోన్ ఉన్నాయి. QRSAM, VSHORADS, లేజర్ ఆధారిత DEW ఆయుధాలు వేర్వేరు ఎత్తులు, దూరాల్లో లక్ష్యాలను విజయవంతంగా టార్గెట్ చేసి పూర్తిగా ధ్వంసం చేశాయి.
క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ గుర్తింపు, విధ్వంస వ్యవస్థ, కమాండ్ అండ్ కంట్రోల్, కమ్యూనికేషన్, రాడార్లు.. ఇలా అన్ని వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేశాయి. ఈ పరీక్షల డేటాను ఇన్‌టిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ పరికరాలు రికార్డు చేశాయి. పరీక్షల సమయంలో డీఆర్డీవో సీనియర్ శాస్త్రవేత్తలు, సాయుధ దళాల ప్రతినిధులు అక్కడే ఉన్నారు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏమన్నారంటే?
విజయవంతంగా ఐఏడీడబ్ల్యూఎస్‌ను అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో, సాయుధ దళాలు, రక్షణ రంగ ప్రతినిధులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఎక్స్‌లో.. “దేశానికి బహుళస్థాయి గగనతల రక్షణ సామర్థ్యం ఏర్పడిందని ఈ ప్రత్యేక పరీక్ష నిరూపించింది. ఇది కీలక సదుపాయాలను శత్రు గగనతల ముప్పుల నుండి రక్షించడానికి బలాన్ని ఇస్తుంది. DRDO, భారత సాయుధ దళాలు, సంబంధిత పరిశ్రమలకు అభినందనలు” అని అన్నారు.
రక్షణ శాఖ కార్యదర్శి, DRDO చైర్మన్ సమీర్ వి. కమత్ కూడా ఈ విజయానికి కృషి చేసిన బృందాలను అభినందించారు.
భారత గగన రక్షణ వ్యవస్థలో IADWS ప్రాధాన్యం
IADWS, ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థలో ఉన్న ఆకాశ క్షిపణి వ్యవస్థ, ప్రాజెక్ట్ కుశ (దూరప్రాంత గగనతల రక్షణ కోసం), రష్యన్ S-400 వ్యవస్థలతో కలిసి పనిచేస్తుంది. ఇవన్నీ కలిసినప్పుడు బలమైన లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్ గా మారుతుంది.
IADWS, భారత వైమానిక దళ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థతో అనుసంధానం కావడంతో రియల్ టైమ్ ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ పరీక్షల విజయంతో IADWSను భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టే దిశగా మార్గం సుగమమైంది.

