- Home
- National
- India Pakistan Ceasefire: భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ.. అంటే ఏమిటి? ఇప్పుడు ఏం జరుగుతుంది?
India Pakistan Ceasefire: భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ.. అంటే ఏమిటి? ఇప్పుడు ఏం జరుగుతుంది?
India Pakistan Ceasefire: భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాదాపు ఇరు దేశాల మధ్య యుద్ధం ముగిసినట్టే. అసలు ఏంటి ఈ కాల్పుల విరమణ? ఇప్పుడు ఏం జరుగుతుంది? గత చరిత్ర, ఉల్లంఘనలు సహా ఆసక్తికర విషయాలు మీకోసం.

India Pakistan Ceasefire: భారత్-పాకిస్తాన్ మధ్య కీలక పరిణామం జరిగింది. తీవ్ర దాడుల మధ్య ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. రెండు దేశాలు సరిహద్దుల్లో కాల్పుల విరమణ (Ceasefire) అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ‘సీజ్ ఫైర్’ అనే పదం మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. సాధారణంగా సీజ్ ఫైర్ అంటే యుద్ధ లేదా మిలిటరీ చర్యలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఆపడం. ఇది దేశాల మధ్య శాంతిని తీసుకువచ్చే ఒక కీలక ఒప్పందం.
సాధారణంగా రెండు దేశాలు పరస్పరం అంగీకారంతో సరిహద్దుల్లో కలహాలు, కాల్పులు ఆపాలని నిర్ణయించుకుంటే దాన్ని కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) అంటారు. ఇది అవసరమైతే కౌన్సిల్ లేదా అంతర్జాతీయ సంస్థల జోక్యం లేకుండానే జరిగే ఒక ఒప్పందం. సీజ్ ఫైర్ అమలులో ఉన్న సమయంలో ఒక దేశం కాల్పులకు పాల్పడితే, దాన్ని సీజ్ ఫైర్ ఉల్లంఘనగా పరిగణిస్తారు.
భారత్-పాక్ కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) చరిత్రలో కీలక ఘట్టాలు
1947లో భారత-పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి కాశ్మీర్ యుద్ధాన్ని ఆపేందుకు, ఐక్యరాజ్యసమితి (UN) జోక్యం చేసింది. 1949లో రెండు దేశాల అంగీకారంతో జమ్మూ కాశ్మీర్‌లో ఓ ప్రత్యేక రేఖను ఏర్పాటు చేశారు. దీనినే ‘సీజ్ ఫైర్ లైన్’ (Ceasefire Line)గా కూడా పేర్కొన్నారు. అప్పటి భారత, పాకిస్తాన్ సైనికాధికారులు కలిసి దీన్ని ఆమోదించారు.
2003 మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రయత్నంలో మరోసారి సీజ్ ఫైర్
1990 దశకంలో భారత్ LOC వద్ద ఫెన్సింగ్ నిర్మాణం ప్రారంభించగా, పాకిస్తాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అనంతరం అమెరికా, యూరోప్ దేశాల ఒత్తిడితో నవంబర్ 2003లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో భారత్ పాకిస్తాన్ మధ్య మరొక సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం నవంబర్ 25, 2003 నుండి అమలులోకి వచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ సీజ్ ఫైర్ 450 మైళ్ళ పొడవైన LOC, అంతర్జాతీయ సరిహద్దు,సియాచిన్ గ్లేసియర్ ప్రాంతాలపై వర్తించనుంది. ఒక వారంపాటు జరిగిన చర్చల అనంతరం ఇరు దేశాల ఆర్మీ అధికారుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) ఉల్లంఘనలు
కాల్పుల విరమణ ఒప్పందాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ తరచూ సీజ్ ఫైర్‌ను ఉల్లంఘిస్తూనే ఉంది. చాలా సార్లు భారత్ అంతర్జాతీయంగా పాక్ ను ఎండగట్టింది. కాల్పులు, అక్రమ ప్రవేశాలు వంటి చర్యలు సీజ్ ఫైర్‌కు భంగం కలిగిస్తున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఇరు దేశాలు పరస్పరం అపవాదాలు ఆపాలని, సైనిక దళాలను వెనక్కు తీసుకోవాలని సీజ్ ఫైర్ ఒప్పందాల్లో పేర్కొన్నప్పటికీ, స్థిరంగా అమలుకావడం లేదనేది వాస్తవం.
ఇప్పుడు భారత్-పాక్ సీజ్ ఫైర్ శాంతిని తీసుకువస్తుందా?
తీవ్ర ఉద్రిక్తతలు, దాడుల తర్వాత ఊహించని విధంగా భారత్-పాకిస్తాన్ లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరు దేశాలు త్వరలోనే చర్చలు కూడా జరపనున్నాయి. ప్రస్తుత అంగీకారం భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య శాంతికి దోహదపడుతుందా? లేదా గతంలానే ఇది కూడా తాత్కాలిక ప్రయత్నంగా నిలుస్తుందా? అనేది కాలమే నిర్ణయించాలి.