Bike Taxi: ఓలా, రాపిడో, ఉబర్ యాప్స్‌ను తొలగించండి.. గూగుల్‌కు ప్రభుత్వం నోటీసులు
Bike Taxi: ప్రముఖ బైక్ ట్యాక్సీ యాప్‌లు అయిన ఉబర్, ఓలా, రాపిడో వంటి వాటిని తొలగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యాపిల్, గూగుల్ కంపెనీలకు నోటీసులు పంపింది. రాష్ట్రంలో అక్రమంగా బైక్ టాక్సీలు నడుస్తున్నాయనే ఆరోపణలతో ఈ చర్యలు ప్రారంభమయ్యాయి.

బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని ప్రభుత్వ ఆరోపణ
మహారాష్ట్ర సైబర్ శాఖ మే 15న జారీ చేసిన నోటీసుల్లో, ఈ యాప్‌ల ద్వారా నడుస్తున్న బైక్ టాక్సీ సేవలు రాష్ట్ర చట్టాలకు వ్యతిరేకమని పేర్కొంది. సరైన ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రయాణికుల రవాణా సేవలు అందిస్తున్నారని ఆరోపించింది. మోటార్ వెహికిల్స్ చట్టం, ట్రాన్స్‌పోర్ట్ శాఖ నియమాలను ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని నోటీసుల్లో స్పష్టం చేసింది. అందుకే యాప్ స్టోర్ల నుంచి ఈ యాప్‌లను తొలగించాలని కోరింది.

మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన
ప్రభుత్వం ప్రధానంగా మహిళల భద్రత అంశాన్ని ప్రస్తావించింది. డ్రైవర్ల వెరిఫికేషన్ సరిగా లేదని, భద్రతా వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయని తెలిపింది. అత్యవసర సహాయ వ్యవస్థలు కూడా సరైన స్థాయిలో లేవని ఆరోపించింది. ఇటీవల ఒక మహిళ బైక్ టాక్సీ సేవ ఉపయోగించిన సమయంలో జరిగిన ఘటనలో ఆమె మరణించిందని, దీనిపై క్రిమినల్ కేసు నమోదైందని అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఇలాంటి మరికొన్ని కేసులు నమోదైనట్లు కూడా వెల్లడించారు.
ఈవీ పాలసీ అమలు చేయలేదని మంత్రి ఆరోపణ
మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బైక్ టాక్సీలకు పూర్తిగా వ్యతిరేకం కాదన్నారు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలతో మాత్రమే సేవలు అందించాలని ప్రభుత్వం ఇప్పటికే పాలసీ తీసుకువచ్చిందని చెప్పారు. అయితే ఓలా, ఉబెర్, రాపిడో సంస్థలు ఈ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. తాత్కాలిక అనుమతులు ఇచ్చినా ఇప్పటివరకు అవసరమైన పత్రాలు సమర్పించలేదని తెలిపారు. ప్రస్తుతం రోడ్లపై నడుస్తున్న వేలాది బైక్ టాక్సీలలో చాలా వరకు పెట్రోల్ వాహనాలేనని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఈవీ విధానానికి ఇది విరుద్ధమని అన్నారు.
రాపిడోపై కొత్త ఆరోపణలు
మంత్రి ప్రతాప్ సర్ణాయక్ రాపిడోపై మరో కీలక ఆరోపణ చేశారు. ఆర్టీవో అధికారులు తనిఖీలు చేసి జరిమానా విధిస్తే, ముందుగా డ్రైవర్లు ఫైన్ చెల్లించాలని, తరువాత రసీదు ఇస్తే కంపెనీ డబ్బు తిరిగి ఇస్తుందని రాపిడో చెబుతోందని అన్నారు. ఇలా చేయడం ద్వారా అక్రమ బైక్ టాక్సీలను కొనసాగించేందుకు కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
యాప్‌లనే నిలిపివేయాలని ప్రభుత్వ నిర్ణయం
అక్రమ బైక్ టాక్సీలను ఆపాలంటే యాప్‌లపైనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌లను తొలగించాలని సైబర్ శాఖ ద్వారా లేఖలు పంపింది. అయితే ప్రస్తుతం ఈ యాప్‌లలో ఉన్న క్యాబ్, ఆటో, ఫుడ్ డెలివరీ సేవలపై ఎలాంటి నిషేధం లేదు. బైక్ టాక్సీ సేవలపైనే ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మంత్రి సర్ణాయక్ మాట్లాడుతూ.. “యాప్‌ను నిలిపేస్తే అక్రమ టాక్సీలు కూడా ఆగిపోతాయి” అని స్పష్టం చేశారు.

