ప్రధాని మోడీని కలిసిన శుభాంశు శుక్లా.. ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?
Shubhanshu Shukla Meets PM Modi: అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించి తిరిగివచ్చిన శుభాంశు శుక్లా, ప్రధాని నరేంద్ర మోడీని సోమవారం కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీతో శుభాంశు శుక్లా భేటీ
భారత అంతరిక్ష యాత్రికుడు, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. నాసా ఆధ్వర్యంలోని ఆక్సియమ్-4 మిషన్‌ను విజయవంతంగా ముందుకు నడిపి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకున్నారు. అక్కడ పలు పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి తిరిగివచ్చారు.
KNOW
అంతరిక్ష యాత్ర ప్రాముఖ్యతపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు
శుభాంశు శుక్లా విజయాన్ని ప్రధాని మోడీ ప్రశంసిస్తూ, భారతదేశం మానవ అంతరిక్ష యానంలో ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. ఆయన ఎక్స్ (X) లో రాసిన సందేశంలో, “శుభాంశు శుక్లాతో విస్తృతంగా చర్చించాను. అంతరిక్షంలో ఆయన అనుభవాలు, విజ్ఞానం-సాంకేతికత అభివృద్ధి, గగన్ యాన్ మిషన్ పురోగతి వంటి అంశాలపై చర్చించాం. ఆయన విజయంపై భారతదేశం గర్విస్తోంది” అని అన్నారు.
Had a great interaction with Shubhanshu Shukla. We discussed a wide range of subjects including his experiences in space, progress in science & technology as well as India's ambitious Gaganyaan mission. India is proud of his feat.@gagan_shuxpic.twitter.com/RO4pZmZkNJ
— Narendra Modi (@narendramodi) August 18, 2025
41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో భారత ప్రతినిధి
శుభాంశు శుక్లా ఆక్సియమ్-4 మిషన్‌తో అంతరిక్షానికి వెళ్లిన తొలి భారతీయుడు. దాదాపు 41 ఏళ్ల తర్వాత భారత్ నుంచి ఒక అంతరిక్ష యాత్రికుడు ISS కు చేరడం చారిత్రాత్మక ఘట్టమైంది. భారత వాయుసేనకు చెందిన టెస్ట్ పైలట్‌గా ఉన్న శుక్లా, మైక్రోగ్రావిటీలో మానవ శరీర శాస్త్రంపై పరిశోధనలు, కొత్త అంతరిక్ష సాంకేతిక పరికరాల పరీక్షలు నిర్వహించారు. ఇవి రాబోయే గగన్ యాన్ మిషన్‌కు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
ప్రధాని మోడీకి ప్రత్యేక బహుమతులు అందించిన శుభాంశు శుక్లా
శుభాంశు శుక్లా తనతో పాటు అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లిన భారత త్రివర్ణ పతాకాన్ని ప్రధానికి అందజేశారు. అలాగే ఆక్సియమ్-4 అధికారిక మిషన్ ప్యాచ్‌ను కూడా ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. శుక్లా ISS లో ఉన్న సమయంలో తీసిన భూమి చిత్రాలను కూడా పంచుకున్నారు. ప్రధాని మోడీ ఆయన విజయాన్ని జాతీయ గౌరవంగా అభివర్ణించారు.
భారత్ చేరుకున్న శుక్లాకు ఘన స్వాగతం
నాసా కెనెడీ స్పేస్ సెంటర్ (ఫ్లోరిడా) నుంచి జూన్ 25న ఆక్సియమ్-4 ప్రయాణమైంది. సుమారు మూడు వారాల యాత్ర అనంతరం జూలై 15న అంతరిక్ష నౌక కాలిఫోర్నియా తీరంలో సురక్షితంగా దిగింది. అనంతరం శుక్లా న్యూఢిల్లీ చేరుకోగా, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, భార్య కామ్నా శుక్లా స్వాగతం పలికారు.
భారత్ చేరుకునే ముందు శుక్లా ఎక్స్‌లో భావోద్వేగంతో స్పందించారు. “మిషన్ సమయంలో నా సహచరులు నా కుటుంబంలా మారిపోయారు. వారిని వదిలి రావడం బాధాకరం. కానీ నా కుటుంబాన్ని, స్నేహితులను, సహచర భారతీయులను మళ్లీ కలవబోతున్నందుకు ఆనందంగా ఉంది. అన్నీ ఒకేసారి అనుభవించడం కొత్త అనుభూతి.. ఇదే కదా జీవితం అంటే” అని ఆయన పేర్కొన్నారు.