ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నళ్లు రాకూడదంటే ఈ చిన్న సింపుల్ ట్రిక్స్ చాలు
ఉల్లిపాయలు లేనిదే ఏ కూర పూర్తి కాదు. అయితే ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు కళ్లు మండిపోతా కన్నీళ్లు వస్తాయి. ఒక్కోసారి ఆ మంట భరించడం కష్టంగా ఉంటుంది. అలా కన్నీళ్లు రాకుండా, మంట రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి.

ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లనీళ్లు ఎందుకు?
భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ లేనిదే ఏ కూర పూర్తి కాదు. వేపుళ్లు, కూరలు, సాంబారు, బిర్యానీలలో ఉల్లిపాయ లేనిదే పూర్తి కాదు. ప్రతి వంటకంలోనూ ఉల్లిపాయ మంచిది. అయితే రుచిని అందించే ఈ ఉల్లిపాయను కట్ చేసే సమయంలో మాత్రం ప్రతి ఒక్కరి కళ్ల నుంచి నీళ్లు కారడం సర్వసాధారణం. చాలామంది ఈ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఉల్లిపాయలను కోసేటప్పుడు వాటిలోని కణాలు చిట్లి 'సిన్-ప్రొపాంథియల్-ఎస్-ఆక్సైడ్' అనే ఒక రకమైన సల్ఫర్ ఆధారిత రసాయన వాయువు గాల్లోకి విడుదలవుతుంది. ఈ వాయువు మన కంటిలోని సహజ తేమతో కలిసినప్పుడు స్వల్ప మోతాదులో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల కంటి నాడీ వ్యవస్థ చికాకుకు గురై తీవ్రమైన మంట పుడుతుంది. ఆ మంట నుంచి కంటిని రక్షించుకోవడానికి మన శరీరం సహజ రక్షణ చర్యగా కన్నీళ్లను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్లు రాకుండా ఉంటాయి.
ఉల్లిపాయ కోసేటప్పుడు చిట్కాలు
ఉల్లిపాయలు తరిగే సమయంలో కన్నీళ్లు రాకుండా ఉండటానికి మంచి మార్గం ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెట్టడం. ఉల్లిపాయను కట్ చేయడానికి 10 నుంచి 15 నిమిషాల ముందు రిఫ్రిజిరేటర్‌లో లేదా బాగా చల్లగా ఉన్న ఐస్ నీటిలో ఉంచాలి. ఉల్లిపాయ చల్లబడటం వల్ల సల్ఫర్ వాయువును విడుదల చేసే ఎంజైమ్‌ల రసాయన చర్య వేగం గణనీయంగా మందగిస్తుంది. ఫలితంగా గాల్లోకి తక్కువ పరిమాణంలో గ్యాస్ వెలువడి కళ్ల మంట తగ్గుతుంది. అలాగే మనం ఉపయోగించే కత్తి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. చాలామంది మొద్దుబారిన కత్తులతో ఉల్లిపాయలను కోస్తుంటారు. మొద్దు కత్తి ఉల్లిపాయ పొరలను సులభంగా కోయడానికి బదులు వాటి కణాలను ఎక్కువగా నలిపివేస్తుంది. దీనివల్ల రసాయన వాయువు తీవ్ర స్థాయిలో విడుదలవుతుంది. అందుకే బాగా పదునైన కత్తిని ఉపయోగిస్తే కణాలు సున్నితంగా తెగిపోయి, కంటికి హాని చేసే వాయువు విడుదల దాదాపు సగానికి తగ్గిపోతుంది.
ఇలా కట్ చేయండి
ఉల్లిపాయను కోసే విధానం కూడా కన్నీళ్లను అడ్డుకోవడంలో ఉపయోగపడుతుంది. ఉల్లిపాయకు చెందిన వేరు భాగంలో సల్ఫర్ రసాయనాల సాంద్రత అత్యంత ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి ఉల్లిపాయను తరిగేటప్పుడు ముందుగా పైభాగాన్ని మాత్రమే కట్ చేసి, పొట్టు తీసి, ముక్కలు కోసుకుంటూ వచ్చి చివరిగా వేరు భాగాన్ని వేరు చేయాలి. దీనివల్ల చాలావరకు గ్యాస్ ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా వంటగదిలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ కింద లేదా టేబుల్ ఫ్యాన్ గాలి తగిలేలా ఉల్లిపాయలు కోయడం వల్ల ఆ ఘాటైన వాయువులు నేరుగా మీ కళ్ల వైపు రాకుండా గాలికి కొట్టుకుపోతాయి. అలాగే ఉల్లిపాయను మధ్యకు కోసిన తర్వాత కొద్దిగా చల్లని నీటిలో ముంచి తరగడం వల్ల గ్యాస్ నీటిలో కలిసిపోయి గాల్లోకి వ్యాపించదు. ఈ సులువైన జాగ్రత్తలు పాటిస్తే రోజూ ఎలాంటి కన్నీళ్లు లేకుండా, కంటి మంట రాకుండా ఉల్లిపాయలను కోసుకోవచ్చు.

