నీళ్లు వాడకుండానే సోఫా మురికిని వదిలించేయవచ్చు.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి చాలు
సోఫాకు మురికి పట్టేయడం సహజం. అయితే ఆ మురికిని ఎలా వదిలించాలో ఎంతో మందికి తెలియదు. నీళ్లు పెట్టి కడగితే సోఫా పాడవుతుందని భావిస్తారు. నిజానికి నీరు వాడకుండా కూడా సోఫాను క్లీన్ చేయవచ్చు.

సోఫాను ఇలా క్లీన్ చేయండి
ఇంట్లో సోఫాపై కొద్ది రోజుల్లోనే దుమ్ము, మరకలు చేరుతుంటాయి. పిల్లలు తినే ఆహార పదార్థాలు, టీ, కాఫీ మరకలు, చెమట కారణంగా సోఫా త్వరగా మురికిగా మారుతుంది. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ సోఫాలపై పడిన మరకలను తొలగించడం కొంచెం కష్టమే. వాటిని శుభ్రం చేయడానికి ఎక్కువ నీళ్లు వాడితే లోపల ఉండే ఫోమ్ తడిసిపోయి దుర్వాసన వచ్చే ప్రమాదం ఉంది. అయితే నీళ్లు ఎక్కువగా వాడకుండానే సోఫాను శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా సోఫా కింద లేదా వెనుక ఉండే కేర్ లేబుల్‌ను పరిశీలించాలి. ఏ రకమైన క్లీనింగ్ పద్ధతి ఉపయోగించాలో అందులో ఉంటుంది. ఆ తర్వాత సోఫా కుషన్లను తొలగించి వాక్యూమ్ క్లీనర్‌తో దుమ్ము, వెంట్రుకలు, ఆహార పదార్థాల చిన్న ముక్కలను తొలగించాలి. మూలల్లో పేరుకున్న దుమ్మును తొలగించడానికి వాక్యూమ్ క్లీనర్‌కు ఉండే సన్నని నాజిల్ ఉపయోగపడుతుంది.
బేకింగ్ సోడాను వాడండి
సోఫాపై నీళ్లు వాడకుండా శుభ్రం చేయాలంటే బేకింగ్ సోడా చక్కగా ఉపయోగపడుతుంది. ముందుగా సోఫాపై బేకింగ్ సోడాను పలుచగా చల్లి సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మెత్తటి బ్రష్‌తో నెమ్మదిగా శుభ్రం చేసి వాక్యూమ్ క్లీనర్‌తో పొడిని పూర్తిగా తొలగించాలి. దీంతో దుమ్ము, స్వల్ప దుర్వాసన తగ్గుతుంది. మార్కెట్లో లభించే ఫ్యాబ్రిక్ డ్రై క్లీనింగ్ పౌడర్‌ను కూడా ఉపయోగించవచ్చు. అయితే సోఫా రంగు మారకుండా ఉండేందుకు ముందుగా కనిపించని చిన్న భాగంలో పరీక్షించాలి. టీ, కాఫీ మరకలు పడితే వెంటనే పొడి వస్త్రంతో అద్దినట్లు ఒత్తి మరకను తొలగించాలి. గట్టిగా రుద్దకూడదు. నూనె మరకలపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి కొంతసేపటి తర్వాత వాక్యూమ్ చేయవచ్చు.
ఈ పనులు చేయకండి
సోఫాను శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. బ్లీచ్, బలమైన డిటర్జెంట్లు, గరుకైన బ్రష్‌లు ఉపయోగించకూడదు. వీటివల్ల సోఫా రంగు వెలిసిపోయే అవకాశం ఉంది. వెల్వెట్, స్వేడ్ వంటి సున్నితమైన ఫ్యాబ్రిక్లను చాలా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. సోఫాపై ఎక్కువ నీళ్లు పోయడం, మరకలను బలంగా రుద్దడం మంచిది కాదు. అవసరమైతే కొద్దిగా తేమ ఉన్న మైక్రోఫైబర్ వస్త్రంతో చిన్న భాగాలుగా తుడవాలి. తర్వాత పొడి టవల్‌తో తేమను తొలగించి ఫ్యాన్ గాలి తగిలేలా చూడాలి. ప్రతివారం ఒకసారి వాక్యూమ్ చేయడం, మరకలు పడిన వెంటనే శుభ్రం చేయడం అలవాటు చేసుకుంటే సోఫా ఎక్కువ కాలం కొత్తదానిలా కనిపిస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి లోతైన శుభ్రంగా చేయించుకోవడం మంచిది.













