Yoga Day 2022: ఈ ఆసనాలతో మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!
Yoga Day 2022: మెదడును ఆరోగ్యంగా ఉంచి.. మెమోరీ పవర్ ను పెంచడానికి యోగాసనాలు ఎంతో సహాయపడతాయి.

శరీరం సరిగ్గా పనిచేయాలంటే మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. అలాగే క్లిష్టమైన పరీక్షలను ఎదుర్కోవడానికి మెమోరీ పవర్ చాలా అవసరం.అయితే జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి యోగాసనాలు ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం ఎలాంటి ఆసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పద్మాసనం: పద్మాసనం కండరాల ఉద్రిక్తతను తగ్గించి.. మీ మనస్సును శాంతపరిచే ఒక సాధారణ భంగిమ. ఇది మీ శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది.
మొదటగా.. మీ వీపు నిటారుగా ఉంచి కాళ్లను ముందుకు చాచి నేలపై కూర్చోండి. ఇప్పుడు మీ ఎడమ మోకాలిని వంచండి అలాగే ఎడమ కాలి వేళ్లను కుడి తొడపై ఉంచండి. కుడి మోకాలిని వంచి, కుడి కాలి వేళ్లను ఎడమ తొడపై ఉంచండి. మీ పాదాల అడుగుభాగం పైకి అభిముఖంగా ఉండాలి. మీ అరచేతులను మీ మోకాళ్లపై ఉంచండి. ఆ తర్వాత కళ్లను మూయండి. మీ మైండ్ ను రిలాక్స్ చేయండి. శ్వాసను బాగా తీసుకోండి. మీరు శ్వాసపై శ్రద్ధ వహించాలి. ఈ భంగిమలో సుమారు ఐదు నిమిషాల పాటు ఉండండి. ఆ తర్వాత ఒరిజినల్ పొజిషన్ కు రండి.
సర్వాంగాసన: సర్వాంగాసనాన్ని అన్ని ఆసనాలకు తల్లిగా కూడా పిలుస్తారు. ఈ ఆసనం ఏకాగ్రత మెరుగుపరుస్తుంది. ఇది పురాతన, అత్యంత చికిత్సా యోగా భంగిమల్లో ఒకటి. ఇది మీ మెదడు, కడుపుకు పోషణ అందిస్తుంది.
నేలపై వీపుపై పడుకోవడం ద్వారా ప్రారంభించండి. మీ పాదాలను కలిపి ఉంచండి. చేతులను పక్కకు పెట్టండి. ఇప్పుడు మీ శరీరంతో పాదాలను 90-డిగ్రీల కోణం వరకు ఎత్తండి. మోచేతులు వంచి మీ అరచేతులను నడుము క్రింద ఉంచి, పిరుదులను పైకి లేపి, కాళ్ళను ముందుకు తీసుకువెళ్ళండి. మీ కాళ్ళు, శరీరం సరళరేఖలో ఉండాలి. ఈ భంగిమలో కొన్ని నిమిషాల పాటు ఉండండి.
పాశ్చిమోత్తనాసనం: పశ్చిమోత్తనాసనం ఏకాగ్రతను పెంచే ఉత్తమ భంగిమలలో ఒకటి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం తలనొప్పిని కూడా నయం చేస్తుంది.
మీ కాళ్లను నేలపై ముందుకు చాచి, చేతులను ప్రక్కన ఉంచడం ద్వారా ప్రారంభించండి. మీ వీపు నిటారుగా ఉండాలి. పాదాలు కలిసి ఉండాలి. ఇప్పుడు మీ చేతులను పైకి లేపండి. అలాగే నడుము నుంచి ముందుకు వంగండి. మీ తల మోకాళ్లను తాకే వరకు..మీ ఛాతీ తొడపై ఉండే వరకు వంగండి. కాలి వేళ్లను తాకడానికి ప్రయత్నించండి. ఈ భంగిమను కొన్ని నిమిషాలు ఉంచి ఆ తర్వాత అసలు స్థానానికి తిరిగి రండి.