Chronic Stress : జాబ్ చేసే మహిళల్లోనే ఈ సమస్య అధికం..
Chronic Stress : ఉద్యోగాలు చేసే మహిళలలే దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. కాగా ఈ సమస్య నుంచి బయటపడటానికి నచ్చిన పని చేస్తే చాలంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు.
Chronic Stress : పురుషులకు ఏ మాత్రం తగ్గకుండా మహిళలు కూడా వివిధ రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే మగవారితో పోల్చితే ఉద్యోగాలు చేసే ఆడవారే దీర్ఘకాలిక ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నట్టు పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. కాగా పురుషులతో పాటే సమాన స్థాయిలో ఉండే మహిళలు కొన్ని కొన్ని సార్లు వెనకబడటం మనం చూస్తున్నదే. దీనికి కారణాలు అనేకం. ఒక వైపు కుటుంబ బాధ్యతలు, మరో వైపు వృత్తి పరమైన బాధ్యతలు ఎక్కువ అవడం మూలంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని చిన్న, పెద్ద కంపెనీలల్లో ఆడవారికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. ఎలా అంటే.. ఆడవారికి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. అంతకు మించి ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎంతో నేర్పుగా, ఒర్పుగా ఉంటారు. పరిస్థితులను అప్పటికప్పుడు చక్కదిద్దే సామర్థ్యం వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక ఒత్తిడి నుంచి వీలైనంత తొందరగా బయటపడితే వారు వారి వృత్తిలో మరింత ముందుకు వెళతారు. ఒత్తిడిని వివిధ పద్దతుల ద్వారా జయించొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మనసుకు నచ్చిన పని చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఇట్టే బయటపడొచ్చు. అంత టైమెక్కడుంది అంటారేమో.. మీరనుకుంటే కాస్త సమయం దొరకదా. ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఒక అరగంట పాటు పాటలు వినడమో, బుక్ చదవడమో,సినిమాలు చూడటమో, ఏదైనా రాయడమో.. లాంటివి చేయడం వల్ల మీ ఒత్తిడి ఇట్టే మటుమాయం అవుతుంది.
వర్క్ చేసే ప్లేస్ లో వ్యతిరేక భావనతో అస్సలు ఉండకూడదు. ముఖ్యంగా మీరు చేస్తున్న పనిని ప్రేమించండి. ఇదెంత పని చిటికెలో చేసేయగలననే పాజిటీవిటీని కలిగి ఉండండి. అంతేకాదు మీ కొలిగ్స్ తో సన్నిహితంగా, సరదాగా ఉండండి. ఈ సరదాలో పడి బాస్ చెప్పిన పనిని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు చేసే పనిలోనే ఆనందాన్ని వెతుక్కోండి. అప్పుడే మీరు ఒత్తిడికి గురికాకుండా ఉంటారు.
నెలల తరబడి ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటే లైఫ్ బోరింగ్ గా అనిపిస్తుంది. అటువంటప్పడు మీ మనసుకు నచ్చిన మంచి టూరిస్ట్ ప్లేస్ కు వెళ్లి ఎంజాయ్ చేయండి. డిఫరెంట్ ప్లేసెస్ ను చూడటం వల్ల మనసుకు సరికొత్త ఆనందం కలుగుతుంది. ఇలా చేస్తే మీరు తిరిగి ఆఫీసుకు వచ్చినప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా లోకాన్ని చుట్టే పని పెట్టుకోండి.
యోగా, వ్యాయామాలు, రన్నింగ్, వాకింగ్ వంటి వాటి ద్వారా కూడా ఒత్తిడినుంచి బయటపడొచ్చు. వీటి వల్ల ఒత్తిడి తగ్గడమే కాదు.. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా వీటి వల్ల మీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల మీరు ఒత్తిడి నుంచి ఈజీగా బయటపడతారు.