Naphthalene balls: దుస్తుల మధ్యలో నాప్తలీన్ బాల్స్ పెడుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
Naphthalene balls: బీరువా, కబోర్స్ లో దుస్తుల నుంచి మంచి వాసన రావాలని చాలా మంది నాప్తలీన్ బాల్స్ పెడుతూ ఉంటారు. వీటిని పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? కలిగే లాభాలు ఏంటి? వచ్చే నష్టాలు ఏంటి?

మీ కబోర్డ్ లో కూడా వీటిని పెడుతున్నారా?
ఇంట్లో కబోర్డ్స్, బీరువా ఎప్పుడూ మూసే ఉంటాయి. ఎక్కువ సేపు మూసి ఉండటం వల్ల వాటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలా దుర్వాసన రాకుండా ఉండేందుకు, కబోర్డ్స్ లో పురుగులు పట్టకుండా ఉండేందుకు దాదాపు అందరూ నాప్తలీన్ బాల్స్ వాడుతూ ఉంటారు. దీని వల్ల.. ఆ కబోర్డ్ తెరచిన ప్రతిసారీ.. మనకు మంచి వాసన వస్తూ ఉంటుంది. అంతేకాదు.. వీటిని వేయడం వల్ల మన దుస్తులు పాడవ్వవు కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ, ఈ నాప్తలీన్ బాల్స్ కబోర్డ్స్ లో పెట్టడం మంచి పద్దతేనా? కలిగే నష్టాలు ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....
నాప్తలీన్ బాల్స్ ఎలా పని చేస్తాయి..?
నాప్తలీన్ బాల్స్ సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఘన రూపం నుంచి నేరుగా ఆవిరి రూపంలోకి మారతాయి. రసాయనాలతో తయారైన ఈ బాల్స్ నుంచి.. ఘాటైన ఆవిరి వచ్చి.. బీరువా, కబోర్డ్స్ మొత్తం వ్యాపిస్తుంది. దీని వల్ల సిల్క్, ఉన్ని వంటి దుస్తులను పాడు చేసే చిన్న చిన్న పురుగులు, వాటి లార్వాలు దరిచేరవు. ఒకవేళ వచ్చినా ఈ వాసనకు చనిపోతాయి. దుస్తులు పాడవ్వకుండా కూడా ఉంటాయి.
ఈ నాప్తలీన్ బాల్స్ వాడటం వల్ల కలిగే నష్టాలు...
శ్వాసకోశ సమస్యలు, వికారం: నాఫ్తలీన్ బాల్స్ నుండి వచ్చే వాయువులు విషపూరితమైన రసాయనాలతో కూడుకుని ఉంటాయి. బీరువా తెరిచినప్పుడల్లా ఈ ఘాటైన వాసనను పీల్చడం వల్ల తలనొప్పి, కళ్లు-ముక్కు మంట, తలతిరగడం, వికారం, తీవ్రమైన అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి.
రక్తహీనత ప్రమాదం: ఈ బాల్స్ లోని రసాయనాలతో వచ్చే ఆవిరిని రోజూ పీల్చడం వల్ల శరీరంలోని ఎర్ర రక్త కణాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది తీవ్రమైన రక్తహీనతకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అవయవాలపై ప్రభావం: ఎక్కువ కాలం ఈ రసాయనాల ప్రభావానికి గురికావడం వల్ల కాలేయం , మూత్రపిండాలు, నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది.
చిన్న పిల్లలకు తీవ్ర ముప్పు: ఈ నాఫ్తలీన్ బాల్స్ చూడటానికి చిన్న తెల్లటి చాక్లెట్లు లేదా మిఠాయి బిళ్లల్లా కనిపిస్తాయి. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు వీటిని ఆటవస్తువుగా భావించి నోట్లో పెట్టుకున్నా లేదా మింగినా ప్రాణాలకే ప్రమాదం కావచ్చు.
పెంపుడు జంతువులకు ప్రమాదం: ఇంట్లో కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు ఉంటే, అవి పొరపాటున వీటిని నమిలినా తీవ్ర అనారోగ్యానికి గురవుతాయి.
దుస్తుల నాణ్యత తగ్గడం: నాఫ్తలీన్ బాల్స్ నేరుగా దుస్తులకు తగలడం వల్ల కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ రంగు మారడం లేదా పాడైపోవడం జరుగుతుంది. అంతేకాకుండా వీటి వాసన దుస్తులకు పట్టేస్తుంది. ఆ దుస్తులు ధరించినప్పుడు ఈ వాసన అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
ఈ నాప్తలీన్ బాల్స్ కి బదులు ఏం వాడాలి..?
మీ దుస్తులను పురుగులు పట్టకుండా కాపాడుకోవడానికి ప్రమాదకరమైన నాఫ్తలీన్ బాల్స్‌కు బదులుగా ఈ సహజసిద్ధమైన పద్ధతులను ఉపయోగించవచ్చు:
ఎండు వేపాకులు: బాగా ఎండబెట్టిన వేపాకులను ఒక పలచటి క్లాత్ లో మూటకట్టి కబోర్డులో పెడితే పురుగులు అసలు రావు.
లవంగాలు & దాల్చిన చెక్క: లవంగాలు, దాల్చిన చెక్కల సువాసనకు పురుగులు దూరంగా ఉంటాయి.
కర్పూరం బిళ్లలు: సహజమైన కర్పూరం బిళ్లలు అల్మారాలో మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా కీటకాలను నివారిస్తాయి.
లావెండర్ సాచెట్స్: లావెండర్ పూల పొడి లేదా డ్రైడ్ లావెండర్ సాచెట్స్ ఉపయోగించడం వల్ల బట్టలు మంచి సువాసనతో ఉంటాయి.
మీరు వేసుకునే దుస్తుల రక్షణ ఎంత ముఖ్యమో, మీ కుటుంబ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇప్పటికైనా రసాయనాలతో కూడిన నాఫ్తలీన్ బాల్స్‌కు స్వస్తి చెప్పి సహజమైన మార్గాలను ఎంచుకోండి.













