ఓట్స్ మంచివే.. కానీ వీళ్లు మాత్రం తినకూడదు
ఓట్స్ మంచి హెల్తీ ఫుడ్. వీటిని తినడం వల్ల బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యంగా ఉండటం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయినా కానీ ఇవి కొంతమందికి అస్సలు మంచివి కావు. వీటిని అస్సలు తినకూడదు.

ఓట్స్
హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ఒకటి. దీన్ని డైటింగ్ చేసేవారే కాదు ప్రతి ఒక్కరూ తింటారు. ఇది టేస్టీగా లేకపోయినా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఓట్స్ ను తింటే బరువు తగ్గుతారు. జీర్ణ సమస్యలు ఉండవు. గుండె ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. అయితే ఓట్స్ తో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నా.. వీటిని మాత్రం కొంతమంది అస్సలు తినకూడదు. వాళ్లు ఎవరు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓట్స్ ను ఎవరు తినకూడదు?
జీర్ణ సమస్యలు
కొంతమందికి జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇలాంటి వారు ఓట్స్ ను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీకు గనుక కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, అపానవాయువు వంటి జీర్ణ సమస్యలు ఉంటే గనుక ఓట్స్ ను తినకండి. ఎందుకంటే ఈ ఓట్స్ జీర్ణం కావడానికి జీర్ణ వ్యవస్థ బాగా కష్టపడాల్సి వస్తుంది. అందుకే బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓట్స్ ను తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
గ్లూటెన్ అసహనం
మనం మార్కెట్ లో కొనే ఓట్స్ లో గ్లూటెన్ పుష్కలంగా ఉంటుంది. అయితే మీకు ఉదరకుహర వ్యాధి ఉన్నా, గ్లూటెన్ కు అలెర్జీ ఉన్నా ఓట్స్ ను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ గ్లూటెన్ జీర్ణవ్యవస్థలో మంటను కలిగిస్తుంది. అలాగే ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడేస్తుంది.
ఐరన్ లోపం
ఐరన్ లోపంతో బాధపడేవారు కూడా ఓట్స్ ను తినకూడదు. ఎందుకంటే ఓట్స్ లో పుష్కలంగా ఉండే ఫైటిక్ యాసిడ్ శరీరంలో ఇనుము శోషణకు ఆటంకం కలిగిస్తుందది. అందుకే మీ శరీరంలో రక్తం తక్కువగా ఉన్నా, ఐరన్ లోపం ఉన్నా ఓట్స్ ను తినకపోవడమే మంచిది. ఓట్స్ ను తింటే మీ సమస్య ఎక్కువ అవుతుంది.
మూత్రపిండాల వ్యాధి
మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు కూడా ఓట్స్ ను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఓట్స్ లో పొటాషియం, భాస్వరం ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీ సమస్యలను మరింత పెంచుతాయి. అందుకే ఓట్స్ ను కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. ఒకవేళ తినాలనుకున్నా డాక్టర్ సలహా ఖచ్చితంగా తీసుకోవాలి.
ఎక్కువగా తినకండి
ఓట్స్ ను తింటే చాలు ఫాస్ట్ గా బరువు తగ్గొచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది తప్పు. మీరు ఒకేదానిపై ఆధారపడి బరువు తగ్గితే మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. మీరు ఓట్స్ ను మాత్రమే తింటే మీ శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు అందవు. దీంతో మీరు బలహీనంగా అవుతారు. బాగా అలసిపోతారు.