హోలీకి ఈ రంగులతో మాత్రం ఆడుకోకండి. లేదంటే సమస్యలు తప్పవు..
హోలీ ఎంతో ఆనందంగా చిన్నా, పెద్దా అంటూ తేడా లేకుండా ఆడుకునే పండుగ. ఈ పండుగను భారతదేశం అంతటా జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీ పండుగను మార్చి 25న జరుపుకోబోతున్నాం. ఇప్పటికే చాలా మంది హోలీని ఆడటానికి అన్ని ఏర్పాట్లను కూడా చేసి ఉంటారు. ఒకరిపై ఒకరు రంగులను జల్లుకుంటూ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈ హోలీ ఆడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
హోలీ రంగుల పండుగ. రకరకాల రంగులను ఒకరికొకరు రాసుకుంటూ ఈ పండుగను ఎంతో సరదాగా జరుపుకుంటారు. కానీ కొన్నిసార్లు హోలీ ఆడేటప్పుడు లేదా ఆ తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువగా కెమికల్స్ ఉన్న రంగులనే ఉపయోగిస్తాం. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కెమికల్ కలర్స్ మన స్కిన్, కళ్లకే కాదు, ఊపిరితిత్తులు, పొట్టకు సంబంధించిన సమస్యలను కూడా కలిగిస్తుంది. అసలు కెమికల్ కలర్స్ ను వాడటం వల్ల ఎలాంటి సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కళ్లకు సంబంధించిన సమస్యలు
కెమికల్స్ కలర్స్ లో ముఖ్యంగా సిలికా, సీసాన్ని కలుపుతారు. ఇలాంటి కలర్స్ కళ్లలో పడితే కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల కళ్లలో దురద పెట్టడంతో పాటుగా కళ్లు ఎర్రబడతాయి. బయటే కాదు డేంజరస్ రసాయనాలు కలిగిన రంగులు కూడా కంటి కనుపాపలను దెబ్బతీస్తాయి.
చర్మ సమస్యలు
కెమికల్స్ కలిసిన రంగులతో హోలీ ఆడటం వల్ల చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. అలాగే చర్మం మంట కలుగుతుంది. దురద పెడుతుంది. చర్మం ఎర్రగా మారుతుంది. కొంతమందికి రంగులకు కూడా అలెర్జీ ఉంటుంది. దీని వల్ల చర్మంపై చిన్న చిన్న మొటిమలు కనిపిస్తాయి.
శ్వాసకోశ సమస్యలు
పాదరసం, గాజు, సిలికా వంటి ప్రమాదకర రసాయనాలను హోలీ రంగుల్లో కలుపుతారు. ఇలాంటి రంగులతో ఆడుకోవడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అలాగే శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తాయి. ఇది శ్వాస సమస్యలు, దగ్గుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
holi
జీర్ణశయాంతర సమస్యలు
హోలీ ఆడుతున్నప్పుడు నోట్లోకి కూడా రంగు వెళుతుంటుంది. కానీ హోలీ రంగులను మింగడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దీనివల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, కడుపు సంక్రమణ ప్రమాదం బాగా పెరుగుతుంది.
holi
హోలీ ఆడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హోలీకి నేచురల్ రంగులను మాత్రమే ఉపయోగించండి. మీరు గులాబీ, చామంతి, మందార పువ్వులతో ఇంట్లోనే చాలా ఈజీగా నేచురల్ కలర్స్ ను తయారుచేయొచ్చు.
మీ కళ్లను రంగుల నుంచి రక్షించడానికి కళ్లద్దాలను పెట్టుకోండి.
రసాయన రంగుల నుంచి మీ ముఖాన్ని, చర్మాన్ని రక్షించడానికి నూనెను అప్లై చేయండి.
అనుకోకుండా కళ్లోకి లేదా నోట్లోకి రంగు పోతే వెంటనే మంచి నీళ్లతో కడుక్కోండి.