Swimming benefits: ఈత కొడితే ఇన్ని సమస్యలు తగ్గుతాయా..?
Swimming benefits: రోజుకు ఒక గంట పాటు ఈత (Swimming) కొట్టినా చాలు ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Swimming benefits: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. పిల్లలతో పాటుగా పెద్దలు కూడా ఈత కొట్టడానికి వెళుతుంటారు. మండుతున్న ఎండలకు, తీవ్రమైన ఉక్కపోతలను తట్టుకోలేక స్విమ్మింగ్ చేసేవారు చాలా మందే ఉన్నారు. సరదాకు, ఎండవేడిని తట్టుకోలేక ఇలా ఈత కొట్టడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న సంగతి మీకు తెలుసా.
అవును ఈత మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని కార్డియో వ్యాయామం (Cardio exercise)అని కూడా అంటారు. ఈ ఈత అధిక బరువు (Overweight)ను కూడా తగ్గిస్తుంది.
అంతేకాదు స్విమ్మింగ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటుగా కండరాలను కూడా బలంగా తయారుచేస్తుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం పదండి..
శరీరానికి పూర్తి వ్యాయామం అవుతుంది.. ఈత కొట్టడం మన మన శరీరానికి పూర్తి వ్యాయామం అవుతుంది. ముఖ్యంగా స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు మన కాళ్లు కదులుతూనే ఉంటాయి. అంతేకాదు చేతులు, భుజాలు కూడా కదులుతాయి. దీంతో ఇవి బలంగా మారుతాయి. కండరాలు బలంగా తయారవుతాయి.
రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతుంది.. ఈతకొట్టడం వల్ల మన బాహ్య శరీరమే కాదు.. శరీరం లోపల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు (Respiratory diseases),గుండె సంబంధిత సమస్యలు (Heart problems) కూడా తగ్గుతాయి. దీనివల్ల గుండె ఫిట్ గా ఉంటుంది. అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఈతకొట్టడం వల్ల డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది.
నొప్పులు తగ్గుతాయి.. ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారు సైతం శరీర నొప్పులు, కీళ్లనొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపుడతున్నారు. అయితే ఈత కొట్టడం వల్ల ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈత కొట్టడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఈత ఎముకలను కూడా బలంగా తయారుచేస్తుంది. అయితే గోరు వెచ్చని నీళ్లలో ఈత కొడితే కీళ్లల నొప్పులు త్వరగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.. స్విమ్మింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు దీనివల్ల ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి కూడా. ముఖ్యంగా స్విమ్మింగ్ వల్ల ఎక్కువ సేపు ఊపిరిని బిగబట్టే కెపాసిటీ కూడా పెరుగుతుంది. స్మిమ్మింగ్ ఆస్తమా పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఒత్తిడి తగ్గుతుంది.. ఈత ఒత్తిడినే కాదు.. మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది. ఈత కొట్టడం వల్ల బాడీ బాగా అలుస్తుంది. అంతేకాదు ఇది మనల్ని రిలాక్స్ చేస్తుంది కూడా. దీంతో నిద్రకూడా బాగా పడుతుంది.