Long Hair: జుట్టు వేగంగా పొడవు పెరగాలా? అయితే ఈ చిన్న పనులు చేయండి
Long Hair: జుట్టు వేగంగా పొడవు పెరగాలని కోరుకుంటున్నారా? అయితే ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇందుకోసం పెద్దగా ఖర్చుపెట్టక్కర్లేదు కూడా. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సరి.

పొడవైన జుట్టు కోసం
చాలామంది పొడవైన, ఒత్తైన జుట్టు కావాలని కోరుకుంటారు. కానీ జుట్టు పెరుగుదల నెమ్మదిగా ఉండటం, మధ్యలోనే తెగిపోవడం, చివర్లు చిట్లిపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. జుట్టు ఒక్క రాత్రిలో పొడవుగా మారదు. అయితే కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు వీలవుతుంది. సాధారణంగా నెలకు సుమారు 1.25 సెంటీమీటర్ల మేర జుట్టు పెరుగుతుంది. మన ఆహారం, వయసు, హార్మోన్లు, జన్యుపరమైన అంశాలు ఈ పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. అందుకే జుట్టు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
వీటిని తినండి
జుట్టు ఆరోగ్యంగా, వేగంగా పెరగాలంటే ముందుగా ఆహారంలో తగినంత ప్రొటీన్ ఉండాలి. గుడ్లు, పప్పులు, శనగలు, చేపలు, పాలు, నట్స్ తీసుకోవాలి. ఐరన్, జింక్, విటమిన్ డి కూడా జుట్టు ఆరోగ్యానికి అవసరం. పాలకూర, ఆకుకూరలు, పండ్లు, గింజలు ఆహారంలో చేర్చుకోవాలి. రెండోది తలకు మసాజ్ చేయడం. వారానికి రెండు మూడు సార్లు వేళ్లతో మృదువుగా ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. కొబ్బరి నూనె, బాదం నూనె వాడొచ్చు. ఇలా చేయడం వల్ల తలకు విశ్రాంతి లభిస్తుంది. మూడోది హెయిర్ డ్రయ్యర్, స్ట్రెయిటెనర్, కర్లింగ్ పరికరాలను తరచూ వాడకూడదు. వీటి నుంచి వచ్చే వేడి జుట్టును పొడిబారేలా చేసి, మధ్యలో తెగిపోయేలా చేస్తుంది. వీలైనంత వరకు సహజంగా ఆరనివ్వాలి.
చివర్లు కత్తిరించాలి కానీ..
నాలుగోది జుట్టు చివర్లు చిట్లిపోతే ఎప్పటికప్పుడు కొద్దిగా కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల చిట్లిన భాగం పైకి వ్యాపించకుండా ఉంటుంది. అయితే జుట్టు చివర్లు కత్తిరించడం వల్ల వేగంగా పెరుగుతుందని అనుకోవద్దు. ఐదోది జుట్టును మరీ గట్టిగా కట్టుకోవడం మానేయాలి. బిగుతైన పోనీటెయిల్స్, జడలు వేయడం వల్ల జుట్టు కుదుళ్లపై ఒత్తిడి పెరిగి రాలిపోయే ప్రమాదం ఉంది. అలాగే తరచూ హెయిర్ కలరింగ్, బ్లీచింగ్, రసాయన చికిత్సలు చేయించుకోవడం తగ్గించాలి. ఈ ఐదు అలవాట్లు పాటిస్తే జుట్టు విరిగిపోవడం తగ్గి ఆరోగ్యంగా ఉండేందుకు సాయం అవుతుంది. జుట్టు అకస్మాత్తుగా ఎక్కువగా రాలిపోతుంటే చర్మవ్యాధుల నిపుణుడిని సంప్రదించాలి.













