Potato: బంగాళాదుంపలు అధికంగా తింటే శరీరంలో జరిగేది ఇదే
Potato: బంగాళాదుంపలతో రకరకాల వంటకాలు వండుకోవచ్చు. దీనివల్ల ఎంతో మంది ఒకసారి వేపుడు, ఇంకోసారి కూర, మరోసారి బిర్యానీ ఇలా వారంలో అయిదారు సార్లు తింటూ ఉంటారు. బంగాళాదుంపలు అధికంగా తింటే ఏమవుతుందో తెలుసుకోండి.

బంగాళాదుంపలు అధికంగా తింటే...
మన రోజువారీ ఆహారంలో ఎక్కువగా కనిపించే కూర బంగాళాదుంపే. సాంబార్‌లోనో, కూరలోనో, మిక్స్ వెజ్‌లోనో, ఫ్రైస్ రూపంలోనో ప్రతి ఇంట్లో ఇది తప్పనిసరిగా తినే ఆహారం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైనది బంగాళాదుంప వంటకాలే. పెళ్లి, వేడుకలు ఏవైనా సరే బంగాళాదుంప వంటకాలు ఉండాల్సిందే. అయితే వీటిని అధికంగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయి
బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని తెలిసిందే. ఇది శరీరానికి తక్షణ శక్తినిచ్చే పదార్థం. కానీ వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మధుమేహం ఉన్న వ్యక్తులు బంగాళాదుంపలను అదుపు లేకుండా తింటే షుగర్ లెవెల్స్ వేగంగా పెరిగి సమస్యలు కలిగించే ప్రమాదం ఉంది. బంగాళాదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. అంటే శరీరంలోకి వెళ్లిన వెంటనే గ్లూకోజ్‌ను విడుదల చేసే స్వభావం వీటికి ఎక్కువ. ఈ కారణంగా దీన్ని అధిక మోతాదులో తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యకు కూడా దారితీస్తుందని చెబుతున్నారు.
బరువు పెరిగిపోతారు జాగ్రత్త
బంగాళాదుంపలు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇందులో స్టార్చ్ ఎక్కువగా ఉండటమే బరువు పెరిగేందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఉడికించిన బంగాళాదుంప కన్నా వేయించిన ఆలూ ఫ్రైస్, ఆలూ బజ్జీలు, చిప్స్ వంటి వంటకాలు శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. వీటిలో ఉన్న నూనె, ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్ కారణంగా గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. రక్తపోటు పెరిగే అవకాశమూ ఉంది. బంగాళాదుంపలను రోజూ అధికంగా తినేవారిలో పొట్ట సమస్యలు కూడా కనిపిస్తాయి. ఇందులోని స్టార్చ్ పూర్తిగా జీర్ణం కావడానికి సమయం పడటం వల్ల గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. జీర్ణక్రియ సున్నితంగా ఉండే వారికి ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది.
మొటిమలు వచ్చేస్తాయి
బంగాళాదుంపలను అధికంగా తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు తగ్గిపోతాయి. బంగాళాదుంపలో ఉండే విటమిన్ C, పొటాషియం లాంటి కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. వీటిని అధికంగా తీసుకుంటే అవసరమైన విటమిన్లు, ఫైబర్, మినరల్స్ అందవు. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గటం, చర్మం ఆయిలీ అవ్వటం, కొందరికి మొటిమలు రావడం వంటి సమస్యలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే బంగాళాదుంపను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. వీటిని వేయించిన రూపంలో కాకుండా ఉడికించిన లేదా తక్కువ నూనెలో వేయించి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.ఫైబర్‌ను పొందేందుకు బంగాళాదుంపలను ఇతర కూరగాయలతో కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది.
వీరు తినకూడదు
బంగాళాదుంపలు రుచికరమైనవే అయినప్పటికీ వీటిని అధికంగా తింటే ఆరోగ్యంలో అనేక మార్పులు వస్తాయి. అందువల్ల వీటిని తినడం చాలా వరకు తగ్గించాలి. లేదా వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తినాలి. ఆరోగ్యకరమైన వంట పద్ధతుల్లోనే వీటిని వండాలి. అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలతో చేసిన ఆహారాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది.

