Alcohol with Empty Stomach: ఖాళీ పొట్టతో మద్యం తాగితే మీ శరీరంపై పడే ప్రభావం ఇదే
ఆధునిక కాలంలో ఆల్కహాల్ (Alcohol) తాగే వారి సంఖ్య అధికంగానే ఉంది. కొంతమంది ఆహారం కన్నా మద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఖాళీ పొట్టతో మద్యం తాగడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.

మద్యంతో ప్రమాదం
మద్యం ఆరోగ్యానికి హానికరం.. అని ఎంత చెబుతున్నా కూడా ఆ మద్యానికి బానిసలవుతున్న వారి సంఖ్య ఎక్కువే. మద్యం ఎంత మొత్తంలో తీసుకున్నా.. అది శరీరానికి హాని చేస్తుంది. అయితే కొంతమంది ఆహారం కన్నా మద్యానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. ఖాళీ పొట్టతో మద్యం తాగుతూ ఉంటారు. అలాంటి వారి శరీరంపై అది తక్షణ ప్రభావాన్ని చూపిస్తుంది.
మత్తు ఎక్కేస్తుంది
ఖాళీ పొట్టతో మద్యం తాగితే అది చాలా త్వరగా రక్త ప్రవాహంలోకి కలిసిపోతుంది. దీని ఫలితంగా మీకు మత్తు త్వరగా ఎక్కుతుంది, స్పృహ కూడా కోల్పోతారు. ఇది చాలా చెడు ఫలితాలను అందిస్తుంది.
పొట్ట లైనింగ్ పోతుంది
ఖాళీ పొట్టతో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల విషపూరిత సమ్మేళనాలు పొట్టలో ఏర్పడతాయి. ఇవి పొట్టలోని పై పొరలను దెబ్బతీస్తాయి. దీనివల్ల వారికి అల్సర్లు, గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటివి ఎక్కువ అయిపోతాయి. దీర్ఘకాలికంగా ఇలా ఖాళీ పొట్టతో తాగితే పొట్టకు చెందిన తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది.
చక్కెర స్థాయిలు పడిపోతాయి
ఖాళీ పొట్టతో మద్యం తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా అతివేగంగా పడిపోతాయి. అలాగే బలహీనంగా అనిపిస్తుంది. తల తిరుగుతున్నట్టు అనిపించి మూర్చ కూడా వస్తుంది. ఇక డయాబెటిక్ రోగులు మద్యం తాగితే చక్కెర స్థాయిలో అకస్మాత్తుగా పడిపోతాయి.
డీహైడ్రేషన్
ఆల్కహాల్ వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. తలనొప్పి కూడా విపరీతంగా వస్తుంది. ఖాళీ పొట్టతో దీన్ని తీసుకుంటే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. వికారం ఎక్కువైపోయి ఆహారం తినబుద్ది వేయదు. దీనివల్ల మీరు సన్నగా మారి మీ పని మీరు చేసుకోవాలని పరిస్థితికి వచ్చేస్తారు.
కాలేయ వ్యాధులు
ఆల్కహాల్ ఎక్కువగా ప్రభావం చూపేది కాలేయం పైనే. ఎందుకంటే మీరు తాగిన మద్యాన్ని ప్రాసెస్ చేసేది కాలేయమే. ఎప్పుడైతే ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తాగారో అప్పుడు కాలేయం అతిగా యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల కాలేయంపై ఒత్తిడి పెరిగిపోతుంది. దీర్ఘ కాలంగా ఇలాగే జరిగితే తీవ్రమైన కాలేయ సమస్యలు రావచ్చు. ఫ్యాటీ లివర్ సమస్య సిర్రోసిస్ సమస్య, కాలేయం ఫెయిలవ్వడం వంటివి జరుగుతాయి.