Liquor In Train: రైలులో మద్యం తీసుకెళ్లొచ్చా? లేదా ? రైల్వే రూల్స్ ఏంటీ?
Liquor In Train: రైల్వేలో మద్యం తీసుకెళ్లడంపై రాష్ట్రాల వారీగా నిబంధనలు భిన్నంగా ఉంటాయి. కొన్ని రాష్టాల్లో సీలు చేసిన మద్యం పరిమితంగా తీసుకెళ్లడానికి అనుమతించినా, మరికొన్ని రాష్ట్రాలో మద్యం రవాణాను నిషేధించారు. పైగా జరిమానాలు కూడా విధిస్తారు

రైలులో మద్యం తీసుకెళ్లొచ్చా ?
ఇండియన్ రైల్వేలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో తమతో పాటు వివిధ రకాల వస్తువులను తీసుకెళ్తున్నారు. అయితే ట్రైన్‌లో ప్రయాణించేటప్పుడు మద్యం తీసుకెళ్లొచ్చా? లేదా? అన్న విషయం ఎవరికీ తెలియదు. ఇండియన్ రైల్వేలో మద్యం తీసుకెళ్లడంపై రాష్ట్రాల వారీగా నిబంధనలు భిన్నంగా ఉంటాయి. ఆ నిబంధనలేంటీ? రైల్వే నిబంధనపై ఓ లూక్కేయండి.
రాష్ట్రాన్ని బట్టి రూల్స్ మారుతాయి!
భారతీయ రైల్వేల్లో మద్యం రవాణాకు సంబంధించి ఏకీకృత నిబంధనలు లేకపోయినా, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు రైలులో మద్యం తీసుకెళ్లవచ్చా? లేదా? అనేది మీరు ఎక్కడ నుంచి బయలుదేరుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రాష్ట్రానికీ తదితరంగా ఎక్సైజ్ చట్టాలు ఉండటంతో ఒక రాష్ట్రంలో అనుమతించినా.. మరొక రాష్ట్రంలో నేరంగా పరిగణించబడవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో పాటు కేసులు కూడా నమోదవుతున్నాయి.
ఈ నియమాలను గుర్తుంచుకోండి!
మీరు మద్యం అందుబాటులో ఉన్న రాష్ట్రం నుంచి మద్యం నిషేధం లేని రాష్ట్రానికి మద్యం తీసుకెళ్లే పెద్ద సమస్య ఉండకపోవచ్చు. అయితే, ఎంత మద్యం తీసుకెళ్లవచ్చు? అనే విషయంలో స్పష్టత తప్పనిసరి. అక్కడి నిబంధనలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకోవాలి. సాధారణంగా, రైల్వే లేదా ఇతర రవాణా మార్గాల్లో ఒకటి లేదా రెండు సీలైన బాటిళ్లను మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతించబడుతుంది. గరిష్ట పరిమితి 750 మిల్లీ లీటర్లు (1 బాటిల్) గా ఉంటుంది. అది కూడా మద్యం బాటిళ్లు సీలై ఉండాలి, ఖచ్చితంగా కొనుగోలు రసీదు ఉండాలి, లేదంటే అది చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది.
ఈ రాష్ట్రాల్లో మద్యంపై నిషేధం.. తప్పితే జైలే
మద్యపాన నిషేధం ఉన్న రాష్ట్రాలు: బీహార్, గుజరాత్, నాగాలాండ్, మిజోరం వంటి కొన్ని రాష్ట్రాల్లో మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ రాష్ట్రాల్లో, సీలు చేసిన సీసాలో మద్యం తీసుకెళ్లడం కూడా నేరంగా పరిగణించబడుతుంది. ఈ ప్రాంతాల్లో మద్యం తీసుకెళ్తున్నట్లు మీరు పట్టుబడితే జరిమానాలు, జైలు శిక్ష రెండూ విధించవచ్చు. ప్రయాణికులు చాలాసార్లు తమకు అనుమతి ఉందన్న అపోహతో లేదా రసీదు చూపిస్తూ తప్పించుకోవాలని చూస్తారు. కానీ, ఈ రాష్ట్రాల్లో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. బీ కేర్ పుల్.
నిబంధనలను ఉల్లంఘిస్తే..
ఇండియన్ రైల్వేలో ప్రయాణించేటప్పుడు మద్యం రవాణా, వినియోగంపై నిర్దిష్ట నిబంధనలు ఉండకపోయినా, ప్రత్యేక రాష్ట్రాల చట్టాలు దీనిపై చాలా కఠినంగా అమలులో ఉన్నాయి. వీటిని ఉల్లంఘిస్తే జరిమానాలు, జైలు శిక్షలు తప్పవు. ప్రయాణికుడు అనుమతించబడిన పరిమితిని మించి మద్యం తీసుకెళ్తున్నట్టు అయితే.. సదరు వ్యక్తికి రూ. 5,000 నుండి రూ. 25,000 వరకూ జరిమానా విధించవచ్చు. అవసరమైతే మద్యం అక్రమ రవాణా కింద కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది.
రైలులో మద్యం తాగితే..?
రైలులో మద్యం సేవించడం నేరంగా పరిగణించబడుతుంది. ఇది ఒక శిక్షార్హమైన చర్య. ప్రయాణికుడు మద్యం తాగుతూ లేదా మద్యం సేవించిన స్థితిలో ఉండగా పట్టుబడితే, జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు.
ప్రయాణికులకు కీలక సూచనలు
- రైలులో మద్యం తీసుకెళ్లే ముందు, మీ బయలుదేరే రాష్ట్రం, గమ్యస్థాన రాష్ట్రం ఎక్సైజ్ చట్టాలను తప్పకుండా తనిఖీ చేయండి.
- రైల్వే గైడ్‌లైన్స్, స్థానిక నిబంధనలు చదివి అర్థం చేసుకోండి.
- సీలైన బాటిళ్లు ఉన్నా, బిల్లులు, పరిమితులు అన్నీ స్పష్టంగా ఉండాలి.
- అనుమతించబడిన పరిమితికి మించి మద్యం తీసుకెళ్లడం వల్ల చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.