Paya: చిక్కటి మటన్ పాయా ఇలా వండారంటే ఎవరైనా ఇష్టంగా తింటారు.. ఇడ్లీ, దోశెతో అదిరిపోతుంది
Paya: ముస్లిం సోదరుల ఇళ్లల్లో చేసే విధంగా చిక్కటి, రుచికరమైన మటన్ పాయా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు. మేక కాళ్లను పర్ఫెక్ట్‌గా ఉడికించి, కొబ్బరి-జీడిపప్పు పేస్ట్ కలిపి ఘుమఘుమలాడే గ్రేవీని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

మటన్ పాయా తెలుగు రెసిపీ
ఇడ్లీ, దోశ, చపాతీ.. ఇలా దేనితో తిన్నా మటన్ పాయా రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా మేక కాళ్లలోని మాంసం మెత్తగా ఉడికి, మసాలా ఫ్లేవర్ గ్రేవీలో కలిసినప్పుడు ఆ టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ముస్లింలు చేసే స్టైల్ లో మటన్ పాయా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీలో మేక కాళ్లను సరిగ్గా ఉడికించడం చాలా ముఖ్యం. ఉల్లిపాయలు, మసాలాను బాగా వేయించి, చివర్లో కొబ్బరి పేస్ట్ కలిపితే గ్రేవీకి పర్ఫెక్ట్ చిక్కదనం వస్తుంది. ఈ పద్ధతిలో ఇంట్లోనే ఘుమఘుమలాడే రుచికరమైన ఆటుకాల్ పాయాను మీరు ఈజీగా చేసుకోవచ్చు.
మటన్ పాయా రెసిపీకి కావాల్సిన పదార్థాలు!
ముఖ్యమైన పదార్థాలు:
శుభ్రం చేసిన మేక కాళ్లు – 4 నుంచి 6 ముక్కలు
పెద్ద ఉల్లిపాయలు – 2
టమాటాలు – 2
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు
పచ్చిమిర్చి – 2
పసుపు – ¼ టీస్పూన్
కారం – 1 టీస్పూన్
ధనియాల పొడి – 2 టీస్పూన్లు
జీలకర్ర పొడి – ½ టీస్పూన్
సోంపు – 1 టీస్పూన్
దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు – తగినన్ని
కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా
నూనె – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
నీళ్లు – తగినన్ని
గ్రేవీ చిక్కదనం కోసం:
తురిమిన కొబ్బరి – ½ కప్పు
జీడిపప్పు – 6 నుంచి 8
సోంపు – ½ టీస్పూన్
తగినన్ని నీళ్లు
మటన్ పాయా రెసిపీ
మేక కాళ్లను ముందుగా బాగా శుభ్రం చేసుకోండి. వాటిపై వెంట్రుకలు, మురికి లేకుండా చూసుకోండి. ఆ తర్వాత నీళ్లతో కడిగి పక్కన పెట్టుకోండి.
2. కుక్కర్‌లో మేక కాళ్లు, కొద్దిగా పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోయండి. మూతపెట్టి 35 నుంచి 45 నిమిషాల పాటు ఉడికించండి.
3. మేక కాళ్లు మెత్తగా ఉడికి, ఎముకల నుంచి మాంసం సులభంగా విడిపోయేలా ఉండాలి. ఇంకా గట్టిగా ఉంటే, కొద్దిగా నీళ్లు పోసి మళ్లీ ఉడికించండి. ఉడికించిన నీళ్లను పారబోయకుండా పాయా గ్రేవీలో వాడుకోవాలి.
4. స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేడి చేయండి. నూనె కాగాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, సోంపు వేసి వేయించండి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి.
5. అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి. తర్వాత టమాటాలు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి టమాటాలు మెత్తబడేదాకా ఉడికించండి.
6. ఈలోపు కొబ్బరి, జీడిపప్పు, సోంపులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోండి. ఈ పేస్ట్ వల్లే పాయాకు చిక్కదనం, కమ్మటి రుచి వస్తాయి. జీడిపప్పు వేయడం మీ ఇష్టం; అది లేకపోయినా కొబ్బరి పేస్ట్‌తో గ్రేవీని చిక్కగా చేసుకోవచ్చు.
7. వేయించిన మసాలాలో ఉడికించిన మేక కాళ్లను వేసి బాగా కలపండి. ఆ తర్వాత మేక కాళ్లను ఉడికించిన నీళ్లను కూడా పోసి మీడియం మంటపై కొద్దిసేపు మరిగించండి. దీనివల్ల మసాలా ఫ్లేవర్ మేక కాళ్లకు బాగా పడుతుంది.
8. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరి-జీడిపప్పు పేస్ట్‌ను వేసి బాగా కలపండి. తక్కువ మంటపై 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగిస్తూ, మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి. గ్రేవీ మరీ చిక్కగా ఉంటే కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోవచ్చు. పల్చగా ఉంటే మూత తీసి కొద్దిసేపు ఉడికించండి.
9. నూనె పైకి తేలి, గ్రేవీ మేక కాళ్లకు బాగా పట్టిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. కొబ్బరి పేస్ట్ వేశాక ఎక్కువ మంటపై ఎక్కువసేపు ఉడికించకండి. మాడిపోయే ప్రమాదం ఉంది.

