జుట్టు రాలడం ఆగి పొడుగ్గా పెరగాలంటే ఈ జ్యూస్ లను తాగండి
జుట్టు వివిధ కారణాల వల్ల ఊడిపోతుంది. జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మీజుట్టు రాలడం ఆగుతుంది. అలాగే మందంగా పెరుగుతుంది కూడా.
ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. నిజానికి జుట్టు రాలడానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలడం కూడా ఆగుతుంది. జుట్టు పెరగడానికి పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మరి జుట్టు సంరక్షణ కోసం డైట్ లో చేర్చుకోవాల్సిన కొన్ని జ్యూస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బచ్చలికూర రసం
బచ్చలికూర రసం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. బచ్చలికూరలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. బచ్చలికూర విటమిన్లకు గొప్ప భాండాగారం. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరలో ఉండే ఐరన్, బయోటిన్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. కాబట్టి బచ్చలికూర జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోండి. ఇది మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది.
cucumber juice
కీరదోసకాయ రసం
కీరదోసకాయ రసం కూడా జుట్టుకు మంచి మేలు చేస్తుంది. కీరదోసకాయ చాలా తక్కువ కేలరీలున్న కూరగాయ. దీనిలో నీరు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి.
ఉసిరి జ్యూస్
ఉసిరి జ్యూస్ మన ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఉసిరి జ్యూస్ లో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. జుట్టు నల్లగా ఉంటుంది. ఒత్తుగా పెరుగుతుంది.
క్యారెట్ జ్యూస్
క్యారెట్లలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, బయోటిన్, పొటాషియం, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని ఆపుతాయి. జుట్టు బలంగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. అందుకే రెగ్యులర్ గా గ్లాస్ క్యారెట్ జ్యూస్ ను తాగండి.
కలబంద జ్యూస్
కలబంద జ్యూస్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కలబంద జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. కలబంద రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. కలబంద మీ జుట్టు పొడుగ్గా పెరగడానికి సహాయపడుతుంది.